భారత తొలి గుడ్‌విల్‌ అంబాసిడర్‌

17 ఏళ్లకే శాంతి, లింగవివక్ష, యువత సాధికారత వంటి అంశాలకు భారతదేశం తరఫున రాయబారిగా వ్యవహరిస్తోందామె. తాజాగా బ్రిక్స్‌ దేశాలకు మన దేశ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించి మరో గౌరవాన్నీ అందుకుంది. తనే మొహాలీకి చెందిన అనన్యా కాంబోజ్‌. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆమె స్ఫూర్తి కథనం..

Updated : 16 Nov 2021 06:03 IST

17 ఏళ్లకే శాంతి, లింగవివక్ష, యువత సాధికారత వంటి అంశాలకు భారతదేశం తరఫున రాయబారిగా వ్యవహరిస్తోందామె. తాజాగా బ్రిక్స్‌ దేశాలకు మన దేశ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించి మరో గౌరవాన్నీ అందుకుంది. తనే మొహాలీకి చెందిన అనన్యా కాంబోజ్‌. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆమె స్ఫూర్తి కథనం..

క్రీడలపై ఆసక్తితో చదువుతోపాటు ఫుట్‌బాల్‌లో శిక్షణ తీసుకుంది అనన్య. అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడే ట్రైనర్‌ మాటలు ఆమెను ఆలోచించేలా చేసేవి. పాఠశాల తరఫున పోటీల్లో పాల్గొని జట్టును విజేతగా నిలిపిన అనన్య చిన్నప్పటి నుంచి లింగవివక్ష గురించి ఆలోచించేది. సామాజికపరంగా తాను గుర్తించిన పలు అంశాలను రాసి పత్రికలకు పంపేది. ఆ అనుభవం ఆమె 14వ ఏటనే అంతర్జాతీయ స్థాయిలో చిన్నారుల కోసం ‘ఫుట్‌బాల్‌ ఫర్‌ ఫ్రెండ్‌ షిప్‌’ అనే సామాజిక కార్యక్రమానికి విలేకరిగా ఎంపికయ్యేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, సంప్రదాయాల నుంచి హాజరైన పిల్లల్లో ఫుట్‌బాల్‌పై ఆసక్తిని పెంచే దిశగా దీన్ని 2017లో నిర్వహించారు. ‘ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో తోటివారికి మద్దతునివ్వడం, స్నేహాన్ని పంచడం, సమానత్వం, గెలుపోటములు, ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన వస్తుంది. విలేకరిగా పనిచేసిన అనుభవంతోనే ‘మై జర్నీ ఫ్రమ్‌ మొహాలీ టు సెయింట్‌ పీటర్‌బర్గ్‌’ రచన చేయగలిగా. 21 కథల సంకలనమైన ఈ పుస్తకం వరల్డ్‌ ప్రీమియర్‌కు మాస్కోలో ప్రత్యేక అతిథిగా ఆహ్వానాన్ని అందుకోవడం మరవలేనిది. పాఠ్యాంశాలంటే లెక్కలు, సైన్స్‌, సోషల్‌స్టడీస్‌, లాంగ్వేజెస్‌ మాత్రమే అని చాలామంది భావిస్తారు. క్రీడలు కూడా చదువులో ఓ భాగమే. పాఠశాల స్థాయిలో క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. ఇదే పలు సామాజిక సమస్యలకు కారణమవుతోంది. ఆటలంటే తెలియని చిన్నారికి భవిష్యత్తులో ఏది గెలుపు, ఏది ఓటమి అని ఎలా తేడా తెలుస్తుంది. కేవలం క్రీడలే పిల్లల్లో మానసిక పరిణతిని తెస్తాయి’ అని అంటుంది అనన్య.

ఉపన్యాసకురాలిగా... మహిళాసాధికారత, ప్రపంచశాంతి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలువంటి అంశాలపై ప్రసంగించడానికి ఐక్యరాజ్య సమితి అనన్యను రెండుసార్లు ఆహ్వానించింది. మొదటిసారి 2019లో ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ నిర్వహించిన ‘ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ గేమ్స్‌(ఐసీజీ)’ సందర్భంగా ఆ వేదికపై అనన్య ఉపన్యసించింది. అలాగే రెండోసారి రష్యాలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించింది. తాజాగా బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ఆఫ్రికా దేశాలకు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపికై భారతదేశం నుంచి ఈ అర్హత పొందిన తొలి యువతిగా నిలిచింది. ఈ బాధ్యతల్లో భాగంగా బాలిక -విద్య, పిల్లల్లో అభివృద్ధి లక్ష్యాలను పెంపొందించడం వంటి అంశాలకు సంబంధించి ప్రాజెక్టుల్లో పని చేయనుంది. భారతదేశంలో పిల్లలకు చిన్నప్పటి నుంచీ క్లబ్స్‌, అసోసియేషన్స్‌ ద్వారా ఫుట్‌బాల్‌ ఆటని  నేర్పించాలంటుంది అనన్య. ‘క్రీడలపట్ల ఆసక్తి ఉన్నా లింగ వివక్షతోపాటు ఆర్థిక, సామాజిక అంశాలెన్నో క్రీడలకు ఆడపిల్లలను దూరం చేస్తున్నాయి. చిన్నప్పటి నుంచి స్కూల్‌ స్థాయిలోనే నేను ఫుట్‌బాల్‌ ఆడటం ప్రారంభించా. క్రీడల్లో నువ్వు అమ్మాయిలాగే ఆడుతున్నావని కోచ్‌ అంటున్నప్పుడు చాలా కోపం వచ్చేది. అమ్మాయిలంటే చిన్నచూపు ఇంకా ఏ రంగంలోనూ పూర్తిగా పోలేదు. రెండేళ్లక్రితం మహిళాసాధికారత కోసం, అలాగే బాలికలను క్రీడలవైపు ఎక్కువశాతంలో అడుగులేయించడానికి ‘స్పోర్ట్స్‌ టు లీడ్‌’ ప్రారంభించా. దీనిద్వారా చదువు, క్రీడల్లో లింగవివక్షను దూరం చేయాలనేది నా లక్ష్యం. అమ్మాయిల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి పలు పాఠశాలల్లో శిక్షణా తరగతులను నిర్వహించా. ఆన్‌లైన్‌ వర్క్‌షాపుల ద్వారా కూడా శిక్షణనిస్తున్నాం’ అని చెబుతున్న అనన్య క్రీడలద్వారా మహిళాసాధికారతను పెంపొందించడం కోసం చేస్తున్న కృషిని అభినందిద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్