Updated : 06/01/2022 04:59 IST

ఎన్నాళ్లు సిగ్గుపడాలి?

ఎంత బాధనైనా భరిస్తారు... అంత అసౌకర్యాన్నైనా అనుభవిస్తారు.. కానీ ‘నాకు నెలసరి’ సెలవు కావాలని అమ్మాయిలు ఈ రోజుకీ నోరుతెరిచి అడగలేకపోతున్నారు. ఎందుకని? మరోవైపు కొన్ని కార్పొరేట్‌ సంస్థలు మహిళలకు ‘నెలసరి సెలవుల’ని ప్రకటించి వారికి అండగా ఉండాలనుకుంటున్నాయి. వీళ్ల ప్రయత్నం మన సమాజంలో నెలసరి గురించిన అభిప్రాయాలని మార్చగలుగుతుందా?
ముప్ఫైఏళ్లుగా... బిహార్‌లో

మనదేశంలో మొదటిసారి నెలసరి సెలవులని చట్టబద్ధంగా సాధించుకున్నది బిహార్‌ మహిళలు. ముప్ఫైఏళ్ల క్రితం మహిళలకు ప్రత్యేక శౌచాలయాలు, హాస్టళ్లు, క్రెచెస్‌తో పాటు నెలసరి సెలవులూ కావాలని మినా తివారి నాయకత్వంలో 60 వేలమంది పెద్ద పోరాటమే చేశారు. అప్పటి లాలు ప్రసాద్‌ ప్రభుత్వం ఒప్పుకోవడంతో ముప్ఫై ఏళ్లుగా ప్రతినెలా రెండురోజులు ‘విశ్రాంతి సెలవులుగా’ తీసుకుంటున్నారు అక్కడి మహిళలు. ‘మా విభాగంలో ఐదుగురు మహిళలు. 20 మంది మగవాళ్లు. మొదట్లో ఈ లీవ్‌ కావాలని అడిగినప్పుడు మగ అధికారుల చూపులని భరించడం కష్టమయ్యింది. ఇప్పుడక్కడ అది ఓ సాధారణ విషయం అయిపోయిందంటారు పట్నా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ భారతీ కుమార్‌.
నెలసరి కొందరికి సాధారణ విషయం. మరికొందరికి ఒక మాత్రతో ఉపశమించే అంశం. కానీ కనీసం 20 శాతం మంది అమ్మాయిలు ఆ రోజుల్లో విపరీతమైన నొప్పి, వికారం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అవన్నీ చెప్పి సెలవు తీసుకోవడానికి మాత్రం ఇబ్బంది పడతారు. అందులోనూ బాస్‌ మగవాడైతే ఇది మరీ సమస్య. ఇలాంటప్పుడు ఏ వివరణలూ ఇచ్చుకోకుండా ‘పిరియడ్‌ లీవ్‌’ అని మెయిల్‌ పెట్టి  విశ్రాంతి తీసుకొనే అవకాశం ఉంటే ఎంత బాగుంటుంది?

అసలు సెలవెందుకు?
కౌమారం నుంచి మెనోపాజ్‌ దశ వరకూ నెలసరి చుట్టూ అనేక సమస్యలుంటాయి. కొందరిలో నెలసరికి కొన్ని రోజుల ముందు నుంచే భావోద్వేగాలు కలగడం, కోపం, బాధ ఉంటాయి. 30 - 40 శాతం మంది విపరీతమైన నొప్పితో మెలికలు తిరిగిపోతూ (డిస్‌మెనోరియా) ఉంటారు. మరికొందరికి పీసీఓడీ, ఎండోమెట్రియోసిస్‌లతో ఇబ్బంది. చాలామందిలో ఆ సమయంలో మూడ్‌ స్వింగ్స్‌ ఉంటాయి. పనిమీద దృష్టి పెట్టలేరు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. జ్వరం, వికారం, తలనొప్పి ఉంటాయి. కొందరిలో శరీరం నుంచి వేడి ఆవిర్లు వెలువడతాయి. ఇలాంటి సమయంలో వాళ్లకి కాస్త ఉపశమనం కావాలి అంటూ నయాతరం కార్పొరేట్‌ సంస్థలు ఒకటి లేదా రెండు రోజుల ప్రత్యేక సెలవులని ప్రకటిస్తున్నాయి. కానీ ఇదేం సమానత్వం... ఇలా అయితే ఆడవాళ్లకి ఉద్యోగాలివ్వడానికి భయపడాలేమో అనే విమర్శలూ ఉన్నాయి. ‘చాలామంది మహిళలకి నెలసరి అనేది ఓ అంటరాని విషయం. ఆ ప్రస్తావన వస్తే సిగ్గుతో ముడుచుకుపోతారు. ఈ సెలవుల వల్ల ఆ పరిస్థితి పోయి చర్చ జరుగుతుంది. అవి స్త్రీలకు ఎంత అవసరమో తెలుస్తుంది. స్త్రీ, పురుష సమానత్వం అంటే కేవలం ఆర్థిక, సామాజిక విషయాలే కాదు బయలాజికల్‌ విషయాలనీ పరిగణనలోకి తీసుకోవాలి’ అంటున్నారు ఇదే సమస్యపై కృషి చేస్తున్న హేయా సంస్థ స్థాపకురాలు అపరాజితా పాండే.
జపాన్‌లో 1947 నుంచే ఈ సెలవుల్ని ‘సైరికయుక’ పేరుతో ఇస్తున్నారు. సౌత్‌కొరియా, ఇటలీ, ఇండోనేషియా, తైవాన్‌, ఫిలిప్పీన్స్‌, చైనా, జాంబియా దేశాలూ వీటిని ఇస్తున్నాయి.

మన దేశంలో...  2017లో ముంబయికి చెందిన డిజిటల్‌ మీడియా సంస్థ కల్చరల్‌ మెషిన్‌...ఈ ప్రత్యేక సెలవుల్ని ప్రారంభించింది. మలయాళ పత్రిక మాతృభూమి, చెన్నైకి చెందిన డిజిటల్‌ సంస్థ మ్యాగ్‌జ్టర్‌ కూడా పిరియడ్స్‌లో మొదటిరోజు సెలవు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మహిళల వ్యక్తిగత శుభ్రత ఉత్పత్తుల సంస్థ ‘వెట్‌ అండ్‌ డ్రై’ సంస్థ నెలసరి మొదటిరోజు వేతనంతో కూడిన సెలవు ఇస్తోంది. తర్వాత రోజుల్లో ఇంటి నుంచి పని అవకాశాన్ని కల్పిస్తోంది. హైదరాబాద్‌కి చెందిన ‘ఇండస్ట్రీ ఏఆర్‌సీ’, ఐవిపామా, గోజూప్‌, హార్సెస్‌స్టెబుల్‌, ఫ్లైమైబిజ్‌ వంటి సంస్థలు కూడా ఇదే బాటన నడుస్తున్నాయి. బైజూస్‌ ఏడాదికి 12 సెలవులిస్తోంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలూ ఇలాంటి అవకాశాన్నే ఇస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి