యూట్యూబే జై కొట్టింది!

వంటలు, ముగ్గులు, డాన్స్‌లు, అలంకరణ చిట్కాలు.. ఒకటేంటి ఎన్నైనా నేర్చుకోవచ్చు యూట్యూబ్‌ యూనివర్సిటీలో అడుగుపెడితే! నేర్చుకోవడం సరే... ఎవరైనా యూట్యూబ్‌నే ఉపాధిగా మార్చుకుని తమ

Updated : 20 Mar 2022 04:57 IST

వంటలు, ముగ్గులు, డాన్స్‌లు, అలంకరణ చిట్కాలు.. ఒకటేంటి ఎన్నైనా నేర్చుకోవచ్చు యూట్యూబ్‌ యూనివర్సిటీలో అడుగుపెడితే! నేర్చుకోవడం సరే... ఎవరైనా యూట్యూబ్‌నే ఉపాధిగా మార్చుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపుకొన్నారా అనేదిశగా అధ్యయనం చేసిందా సంస్థ. ఇందులో దేశవ్యాప్తంగా అమ్మాయిలే ముందండటం విశేషం. వారిలో ముందంజలో ఉన్నవారి స్ఫూర్తిగాధలు ఇవీ...


పీసీఓడీతో.. సెలబ్రిటీ

అన్వేష 

చదువుకొనే రోజుల్లో అన్వేష ఎదుర్కొన్న అనారోగ్య సమస్యే యూట్యూబ్‌లో తననో టాప్‌ సెలబ్రిటీని చేసింది. దేశంలోని పదిమంది టాప్‌ ఫిట్‌నెస్‌ ప్రముఖుల్లో ఒకరిగా మార్చింది. హరియాణాకు చెందిన అన్వేషముఖర్జీ దిల్లీలోని లేడీశ్రీరాం కళాశాలలో రాజనీతి శాస్త్రంలో డిగ్రీచేసింది. భర్త ఉత్సవ్‌సర్కార్‌ దుబాయ్‌లో ఉద్యోగి. జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో తీవ్రమైన పీసీఓడీతో బాధపడింది. ‘మొదట్లో ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలిసేది కాదు. హాస్టల్‌లో ఉండి చదువుకునేదాన్ని. నా బరువుని చూసి తోటి విద్యార్థులంతా వెటకారం చేసేవారు. బాధనిపించేది. ముఖం నిండా మొటిమలు. నెలసరులు సరిగా వచ్చేవికావు. పీసీఓడీ నుంచి బయటపడే క్రమంలో యోగా, పోషకాహారంపై దృష్టి పెట్టాను. క్రమంగా సమస్య అదుపులోకి వచ్చి బరువు తగ్గాను. నాలానే చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి నేను బరువు తగ్గిన క్రమాన్ని వీడియోగా చేసి ‘సింపుల్‌ టిప్స్‌ విత్‌ అన్వేష’ పేరుతో యూట్యూబ్‌ ఖాతా తెరిచి అందులో ఉంచాను. దానికి మంచి ఆదరణ వచ్చింది. చాలా మంది అమ్మాయిలు అనేక సమస్యలు చెబుతూ వాటికి పరిష్కారం కావాలనేవారు. ఏం చెప్పినా శాస్త్రీయంగా చెప్పాలి కదా.. అందుకోసం యోగాలో శిక్షణ తీసుకున్నా. స్పోర్ట్స్‌ న్యూట్రిషనిస్టుగా మారా. అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ అంశాలపై అమ్మాయిల్లో అవగాహన తీసుకొస్తూ 12లక్షలమంది సబ్‌స్క్రైబర్లకు చేరువయ్యాను. కార్పొరేట్‌ ఉద్యోగాన్నీ వదిలేసి పూర్తిగా యూట్యూబ్‌ ఛానెల్‌ కోసమే పని చేస్తున్నా. ముఖ్యంగా కొవిడ్‌ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి... ఆరోగ్యంపై ఉండే అపోహలని తొలగించేందుకు నిపుణులతో సలహాలు ఇప్పించాను. మనం బ్రష్‌ ఎలా చేస్తామో ఫిట్‌నెస్‌ కూడా అలాంటిదే’ అనే అన్వేష వీడియోలకు పదికోట్లకు పైగా వ్యూస్‌ ఉన్నాయి.


ఇంటీరియర్‌ ‘మాత’

అనన్య  

పొదరింటిలాంటి మీ ఇంటిని బడ్జెట్‌ ధరలో చూడముచ్చటగా మార్చేస్తుంది అనన్య భట్టాచార్జీ. ఇంటీరియర్‌ డిజైనర్‌ అయిన అనన్య.. కోల్‌కతాలో 2017లో ‘ఇంటీరియర్‌ మాత’ పేరుతో స్టూడియోని ప్రారంభించింది. కోల్‌కతా, ముంబయి,  నేపాల్‌లలో అనేక రెసిడెన్షియల్‌ కాంప్లెక్సులూ, హోటళ్లకు ఆధునిక సొబగులద్దింది. కొవిడ్‌ అందరిలానే ఆమెకు కష్టాలను తెచ్చింది. మునుపటిలా అవకాశాలు లేవు. అప్పుడు తను నిరుత్సాహ పడలేదు. బుర్రకు పదును పెట్టింది. యూట్యూబ్‌ ద్వారా వర్చువల్‌గానే ఇంటింటికీ చేరువకాడం మొదలుపెట్టింది. తక్కువ ధరలో ఇంటి మేకోవర్‌ చిట్కాలు చెబుతూ క్రమంగా మినిమలిజంపై దృష్టి పెట్టింది. అంటే తక్కువ వస్తువులతోనే అందంగా ఇంటిని మార్చేపద్ధతి. అలాగే వ్యర్థాలు తయారు కాని బయోడిగ్రేడబుల్‌ రకాలతో చెప్పే ఆమె చిట్కాలకు జనం ఫిదా అయ్యారు. మిలీనియల్స్‌ కోరుకొనేదీ అదే అంటోంది అనన్య. వాస్తవానికి 2017లోనే యూట్యూబ్‌లో అడుగుపెట్టినా కొవిడ్‌ సమయంలో ఆమె సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 7.5 లక్షలకు చేరుకుంది. ‘నాకు ఆర్కిటెక్ట్‌ అవ్వాలని ఉండేది. కానీ అమ్మానాన్నలు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదవాల్సిందే అన్నారు. ఇంజినీరింగ్‌ కోసం కోల్‌కతా వచ్చినా ఇంటీరియర్‌ డిజైనింగ్‌ పుస్తకాలని కొని చదవడం మొదలుపెట్టాను. ధైర్యం చేసి అక్కడే స్టూడియో మొదలుపెట్టా. నెమ్మదిగా క్లైంట్లు రావడం మొదలుపెట్టారు. అయితే యూట్యూబ్‌లో చెప్పడం కొద్దిగా కష్టం అయ్యేది. అయినా నా శ్రమ ఫలించింది. మొదట్లో పెద్ద నగరాల్లో మాత్రమే నా క్లైంట్లు ఉండేవారు. ఇప్పుడు చిన్నపల్లెల నుంచీ మా ఇంటికి పర్యావరణహితంగా మేకోవర్‌ చేస్తారా అని అడుగుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది’ అంటోంది అనన్య.


ఆమె డ్యాన్స్‌కి ఫిదా!

రిపన్‌ప్రీత్‌

రిపన్‌ప్రీత్‌ కౌర్‌కి డ్యాన్స్‌ హాబీ కాదు, జీవితం. చిన్నప్పుడు స్కూల్‌ స్థాయి డ్యాన్స్‌ పోటీల్లో అదరగొట్టేసేది. తర్వాత అదే జోష్‌తో పలు టీవీ డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొంది. ప్రఖ్యాత బూగీ ఊగీ డ్యాన్స్‌ షో ఫైనలిస్ట్‌ కూడా. కెరియర్‌ గురించి ఆలోచించినపుడు తనకు డ్యాన్స్‌ తప్ప ఇంకేమీ కనిపించలేదు. దాంతో డ్యాన్స్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేసేది. అయినా ఏదో అసంతృప్తి. దాంతో 2009లో మొహాలీలో ‘డ్యాన్స్‌ మాఫియా’ పేరుతో సొంత అకాడమీ పెట్టింది. బాలీవుడ్‌, ఫిట్‌నెస్‌, భాంగ్రా డ్యాన్స్‌లలో శిక్షణ ఇచ్చేది. తన ప్రతిభను ప్రపంచానికి చూపాలన్న ఆలోచనతో.. 2014లో యూట్యూబ్‌లో అడుగుపెట్టింది. డ్యాన్స్‌ వీడియోలు పెట్టే క్రమంలో తాను కూడా వివిధ రకాల నృత్యరీతుల్ని నేర్చుకుంటూ ఎంతో మెరుగైంది. ఈమె డ్యాన్స్‌ వీడియోలు వీక్షకుల్ని ఆకట్టుకునేవి.  వాటినే పాఠాలుగా చేసుకున్న ఔత్సాహికులు వేలల్లో ఉన్నారు. డ్యాన్స్‌లో ప్రాథమిక అంశాల్ని వివరిస్తూ వీడియోలు చేస్తుంది. పెళ్లి, కాలేజీ వేడుకల్లాంటి సందర్భాలకు సరిపోయే పాటల్ని ఎక్కువగా పెడుతుంది. వీటితో మంచి గుర్తింపు సంపాదించిన రిపన్‌ ఛానెల్‌కి 14లక్షలమంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. అకాడమీనీ బాగా అభివృద్ధి చేసింది. ఇక్కడ 10 మంది డ్యాన్సర్లు శిక్షణ ఇస్తున్నారు. ఇష్టం ఉంటే జీవితంలో ఏదీ కష్టం కాదని చెబుతుంది రిపన్‌ప్రీత్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్