అగ్రతారలు మెచ్చిన బ్యుటీషియన్‌!

ఆశ్మిన్‌ది సంప్రదాయ సిక్కు కుటుంబం. ఎయిర్‌ హోస్టెస్‌ కావాలనేది తన కల. డిగ్రీ చదువుతున్నప్పుడే మంచి సంబంధమని పెళ్లి చేసేశారు. ‘అత్తింటివారి అనుమతితో డిగ్రీ చేశా. చివరి సంవత్సరం చదువుతున్నప్పుడే తల్లినయ్యా. మావారిది వ్యాపారం. బాగా చూసుకునే భర్త, ఆర్థిక ఇబ్బందులూ లేవు. కానీ నాకే ఖాళీగా కూర్చోవడం నచ్చలేదు. చిన్న ఖర్చుల కోసం భర్తా, అత్తమామాలను అడగడం ఇబ్బందిగా అనిపించేది....

Published : 17 May 2022 02:32 IST

అందరమ్మాయిల్లానే బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనుకుంది. ఆమె ఆశలకు పెళ్లితో చుక్కపడింది. అత్తారింట ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలనుకుంది. ఒడుదొడుకులను అధిగమించి దేశంలోనే పేరొందిన బ్యూటీషియన్‌లలో ఒకరిగా ఎదిగింది. ఆశ్మిన్‌ ముంజల్‌ విజయగాథ ఇదీ...

శ్మిన్‌ది సంప్రదాయ సిక్కు కుటుంబం. ఎయిర్‌ హోస్టెస్‌ కావాలనేది తన కల. డిగ్రీ చదువుతున్నప్పుడే మంచి సంబంధమని పెళ్లి చేసేశారు. ‘అత్తింటివారి అనుమతితో డిగ్రీ చేశా. చివరి సంవత్సరం చదువుతున్నప్పుడే తల్లినయ్యా. మావారిది వ్యాపారం. బాగా చూసుకునే భర్త, ఆర్థిక ఇబ్బందులూ లేవు. కానీ నాకే ఖాళీగా కూర్చోవడం నచ్చలేదు. చిన్న ఖర్చుల కోసం భర్తా, అత్తమామాలను అడగడం ఇబ్బందిగా అనిపించేది. నా కాళ్ల మీద నేను నిలబడాలనుకున్నా. అదే మా వారికీ చెప్పా. బ్యూటీషియన్‌గా కెరియర్‌ ప్రారంభించాలనుకున్నా. అందుకోసం కోర్సులూ నేర్చుకున్నా’ అని చెబుతారామె.

వందశాతం మనసు పెట్టి.. దిల్లీలోని వాళ్ల ఇంట్లోనే చిన్న గదిలో పార్లర్‌ తెరిచింది. మొదట్లో హెయిర్‌ డ్రెస్సర్‌గా హెయిర్‌ కలర్‌, హెయిర్‌ కట్టింగ్‌, స్టైలింగ్‌... లాంటివి చేసేది... పెద్దింటి కోడలు ఈ పనులు చేస్తోందని అత్తామామలు కాస్త కోపంగా ఉండేవారు. ‘నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా భర్త సహకారంతోనే. ‘నీకు నచ్చింది చెయ్యి. అయితే సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే చెయ్యి’ అన్నారు. తను ఆఫీసుకు వెళ్లాక పార్లర్‌ చూసుకునేదాన్ని. అప్పట్లో నాది షరతులతో కూడిన స్వాతంత్య్రం’ అని నవ్వేస్తారామె. ముంజల్‌ తల్లీ సాయంగా ఉండే వారు. ‘మా అమ్మే నాకు స్ఫూర్తి, అండ. ఏదైనా సొంతంగా చేయాలనేది. నచ్చిన పనిని మధ్యలో ఆపొద్దని చెప్పేది. పార్లర్‌ ప్రారంభించిన కొత్తలో పాపను అమ్మే చూసుకుంది. చుట్టుపక్కలవాళ్లు, బంధువులు ఎప్పుడెప్పుడు నా పార్లర్‌ మూసేస్తానా... అని చూసేవాళ్లు. అయితే నా పార్లర్‌ చిన్నదైనా పని మాత్రం మనసుపెట్టి చేసేదాన్ని. నేను చేసే మేకప్‌ వినియోగదారులకు బాగా నచ్చేది. వారిలో మీడియా వారూ ఉండేవారు. వారి ద్వారా పత్రికల్లో నా గురించి వచ్చింది. తర్వాత టీవీ, సినీ నటులకు మేకప్‌ చేసే అవకాశాలొచ్చాయి.

సినిమా తారలకూ... ప్రియాంక చోప్రా, హృతిక్‌ రోషన్‌, అమితాబ్‌ బచ్చన్‌, సోహా అలీఖాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌... ఇలా బాలీవుడ్‌ తారలు, టీవీ నటీనటులు, ఫ్యాషన్‌ మేగజీన్‌ల కోసం పనిచేసే దాన్ని. అక్కడ అందరూ మీరు చేయడమే కాకుండా మరికొందరికీ నేర్పించమనే వారు. దాంతో మా ఆడపడుచుతో కలిసి అకాడమీని మొదలుపెట్టా. మొదటి బ్యాచ్‌లో నలుగురే చేరారు. క్రమంగా సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఏడు అకాడమీలను నడిపిస్తున్నా.’ అని వివరించారు ఆశ్మిన్‌. ‘ప్రతి మహిళా తనకు సంతోషానిచ్చేదేమిటో తెలుసుకోవాలి. దానికోసం కష్టపడాలి. మీ శ్రమకు కుటుంబ మద్దతు తోడైతే అనుకున్నది సాధించగలుగుతారు.’ అని అంటారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్