విదేశీ ఆటలో.. మన మెరుపులు!
బీచ్ వాలీబాల్.. విదేశాల్లో దీనికి ప్రాచుర్యం, గుర్తింపూ ఎక్కువే! మన దగ్గర? దీని పరిచయమే తక్కువ. అలాంటి ఆటలో రాణిస్తున్నారు ఊట్కూరి ఐశ్వర్య, పిట్టల శ్రీకృతి. ఎన్నో సవాళ్లను దాటి గుర్తింపూ తెచ్చుకున్నారు.
బీచ్ వాలీబాల్.. విదేశాల్లో దీనికి ప్రాచుర్యం, గుర్తింపూ ఎక్కువే! మన దగ్గర? దీని పరిచయమే తక్కువ. అలాంటి ఆటలో రాణిస్తున్నారు ఊట్కూరి ఐశ్వర్య, పిట్టల శ్రీకృతి. ఎన్నో సవాళ్లను దాటి గుర్తింపూ తెచ్చుకున్నారు. విదేశాల్లోనూ మన దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఈ తెలుగమ్మాయిలు వసుంధరతో తమ గురించి పంచుకున్నారిలా..
వారిచేతే శెభాష్ అనిపించుకొని
పేద కుటుంబంలో మూడో సంతానం. అదీ అమ్మాయి.. అందరి నుంచీ ‘అమ్మేయండ’న్న సలహాలే! ఏదోకటి సాధించి ఇంటికి భారమన్న వారిచేతే గర్వకారణం అనిపించుకోవాలి అనుకుంది ఐశ్వర్య. టీమ్‌కి కెప్టెన్ అవ్వడమే కాదు.. విదేశాల్లో ఆడే అవకాశం దక్కించుకొని తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది.
‘మాది నల్గొండ జిల్లాలోని బొల్లేపల్లి. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నప్పుడు సీనియర్లు వాలీబాల్ ఆడుతోంటే చూసి మనసుపారేసుకున్నా. పీఈటీ బ్రహ్మయ్య ప్రోత్సాహంతో సాధన మొదలుపెట్టా. నాన్న రైతు. పేదకుటుంబం, ముగ్గురం అమ్మాయిలమేనని అమ్మానాన్నని అందరూ జాలిగా చూసేవారు. కానీ వాళ్లు మమ్మల్ని అబ్బాయిలతో సమానంగా పెంచారు. ఏదోకటి సాధించి వాళ్లు గర్వపడేలా చేయాలనుకునేదాన్ని. కష్టపడి సాధన చేశా. అదే స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)కి ఎంపికయ్యేలా చేసింది. ఇకప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మొదట నేను వాలీబాల్ ప్లేయర్‌నే! తర్వాత కొద్దితేడాతో ఉండే బీచ్ వాలీబాల్ గురించి తెలిసింది. దాన్నీ సాధన చేశా. ఉత్తరాఖండ్, కేరళ చెన్నై.. ఇలా జాతీయ స్థాయి పతకాలెన్నో అందుకున్నా. గత ఏడాది థాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఏషియన్ బీచ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌నకు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించినప్పుడు నేను కోరుకున్నది సాధించా అనిపించింది. భారమన్నవారే ‘అమ్మానాన్నల పేరు నిలబెట్టావ్’ అంటోంటే ఆనందమనిపించింది. ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడానికి ఆర్థిక ఇబ్బందులెన్నో! అధ్యాపకుల సాయంతో ఇంతదూరం వచ్చా. డిగ్రీ చదువుతున్నా. గోవాలో నిర్వహించనున్న నేషనల్ గేమ్స్‌కి సిద్ధమవుతున్నా. అంతర్జాతీయ పోటీల్లో గెలవాలి, నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలన్నది కల’ అంటోందీ 19 ఏళ్లమ్మాయి.
- బొల్లం మధు, నల్గొండ
నాన్న కోసం..
నాన్న కోసం వాలీబాల్‌ను ఎంచుకొంది శ్రీకృతి. జూనియర్, సీనియర్.. వివిధ కేటగిరీల్లో ఆడింది. గత ఏడాది భారత జెర్సీ ధరించాలన్న కలనీ నెరవేర్చుకుందీ హైదరాబాదీ.
‘నాన్న సుదర్శన్ వాలీబాల్ ఆటగాడు. ఆయన్నుంచే నాకు దీనిపై ఆసక్తి కలిగింది. అయిదో తరగతిలో వేసవి శిక్షణ శిబిరంలో వాలీబాల్ ఆడటం ప్రారంభించా. నచ్చడంతో కొనసాగించా. నాలుగేళ్లలో జాతీయ మినీ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ఆడా. అప్పట్నుంచి వివిధ దశల్లో 17కుపైగా నేషనల్స్ ఆడా. గత ఏడాది థాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఏవీసీ సమీల ఓపెన్ ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి భారత జెర్సీ ధరించాలన్న చిన్ననాటి కల నెరవేర్చుకున్నా. అప్లయిడ్ ఫైనాన్స్‌లో ఎంకాం పూర్తిచేశా. నాతోపాటు ఆట ప్రారంభించిన ఎంతోమంది రకరకాల కారణాలతో ఆటను మధ్యలోనే వదిలేశారు. ఇంత దూరం రావడం గర్వంగా అనిపిస్తుంది. ఇంట్లోవాళ్ల ప్రోత్సాహమే అందుకు కారణం. వాలీబాల్, బీచ్‌వాలీబాల్‌కి ప్రాధాన్యం అంతగా లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే మరింత మందిని ఈ ఆట దిశగా ప్రోత్సహించడానికి క్రీడాకారులకీ శిక్షణిచ్చా. నా దగ్గర శిక్షణ పొందినవారు ఈ ఏడాది సీఎం కప్ టోర్నీలోనూ పాల్గొన్నారు. ఈఏడాది సమ్మర్ క్యాంప్‌లూ నిర్వహించా. కోచ్‌ని అవ్వాలని కల. అందుకే ఆ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నా. గోవాలో జరగనున్న నేషనల్స్‌లో పసిడి పతకం సాధించాలని సాధన చేస్తున్నా. భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆడాలి, మరింత మందిని వాలీబాల్ ఎంచుకునేలా చేయాలన్నది నా ఆశ. నిజానికి సీరియస్‌గా తీసుకుంటే ఆటలూ మంచి కెరియర్ కాగలవు. అదే అందరికీ చెబుతుంటా’నంటోంది 21ఏళ్ల శ్రీకృతి.
- తాతినేని పూర్ణిమా శ్రీనివాస్, విజయవాడ
బీచ్ వాలీబాల్.. దాదాపుగా వాలీబాల్ తరహాలోనే ఉంటుంది. అయితే దీన్ని ఇసుకలో ఆడతారు. నిబంధనల విషయంలోనూ కొద్దిపాటి మార్పులుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.