యువతకు స్ఫూర్తి ఈ యువరాణులు!
ఇద్దరు అమ్మాయిలు.. అమ్మానాన్న అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థకి అధిపతులు! రాజమహల్‌ని తలపించే ఇల్లు.
ఇద్దరు అమ్మాయిలు.. అమ్మానాన్న అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థకి అధిపతులు! రాజమహల్‌ని తలపించే ఇల్లు. కోట్ల ఆస్తులకు వారసురాళ్లు.. వీళ్ల గురించి వినగానే ‘యువరాణులు..’ అనాలనిపిస్తోంది కదూ.. కానీ వీళ్లకీ వేధింపులు, లింగవివక్ష తప్పలేదు. వాటన్నింటినీ దాటి అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు వసుంధర, రిధి! వీళ్లెవరో.. వీళ్ల కథేంటో తెలుసుకుందాం రండి.
వసుంధర, రిధి ఓస్వాల్.. బిలియనీర్లు పంకజ్, రాధిక ఓస్వాల్‌ల కూతుళ్లు. అంతర్జాతీయ వ్యాపార సామ్రాజ్యం ఓస్వాల్ గ్రూప్ గ్లోబల్ కార్పొరేషన్ అధినేతలు వీళ్లు. అసలు భారతే. కానీ స్విట్జర్లాండ్‌లో స్థిరపడ్డారు. 24 ఏళ్ల వసుంధర పెద్దమ్మాయి. ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది. చదువయ్యాక నాన్న వ్యాపారంలో అడుగు పెట్టాలనుకున్న ఆమెకు ‘చేయగలదా?’ అన్న సందేహాలు.. అమ్మాయికేం తెలుసన్న వివక్షే ఎదురయ్యాయి. డైరెక్టర్‌గా పశ్చిమాఫ్రికాలోని బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టు ‘యాక్సెస్ మినరల్’ బాధ్యత తీసుకుంది. దాని ఫైనాన్స్, ప్రభుత్వ ఒప్పందాలు వంటివన్నీ వసుంధరనే చూసుకుంది. ఎండ కన్నెరుగని యువరాణి.. ఏసీ గదిలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ నెలలో ఎక్కువ రోజులు మైనింగ్ సైట్లలో గడుపుతూ పనుల్ని స్వయంగా పరిశీలిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిందామె. సస్టెయినబిలిటీ, పర్యావరణ పరిరక్షణ ఈమెకు ఆసక్తి కలిగించే అంశాలు. పనికిరాని నీటిని రీసైక్లింగ్ చేసి తాగునీటిగా మలిచింది. పీఆర్‌ఓ ఇండస్ట్రీస్ పేరుతో సీఓ2 కాప్చరింగ్ ప్లాంట్‌ను ప్రారంభించి, లాభాల బాట పట్టించింది. ఆఫ్రికాలోని వెనకబడిన ప్రాంతాలకు తాగునీరు, రవాణా సౌకర్యం కల్పించింది. అంతేకాదు చెల్లెలి కోసం ‘పీఆర్‌ఓ ట్యూన్స్’ ప్రారంభించిన తను దాని ద్వారా వర్థమాన ఇండో వెస్ట్రన్ గాయకులకు వేదికను కల్పిస్తోంది. రిచెస్ట్ సెల్ఫ్‌మేడ్ విమెన్ జాబితాకీ ఎక్కింది.
చెల్లిది మరో బాట..
19 ఏళ్ల రిధికి సంగీతంటే పంచప్రాణాలు. లండన్‌లో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతూనే మ్యూజిక్ రంగంలో దూసుకెళుతోంది. సింగర్, సాంగ్ రైటర్ తను. ఏడాది క్రితం గాయనిగా కెరియర్ ప్రారంభించింది. ఎవరి సాయం లేకుండానే ప్రొడ్యూసర్లను సంపాదించుకుంది. ఒక విదేశీ లేబుల్ కిందా పనిచేస్తోంది. ఈమె పట్టుదల, సంగీతంలో ప్రతిభను చూసే వసుంధర ‘పీఆర్‌ఓ ట్యూన్స్’ ప్రారంభించింది. సొంతంగా ఆల్బమ్‌లను రిలీజ్ చేసి, తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అయితే టీనేజీలో రిధి వేధింపులకు గురైంది. డిప్రెషన్‌లోకీ వెళ్లిన తను తిరిగి కోలుకొని అక్కతో కలిసి యాంటీ బుల్లీయింగ్ ప్లాట్‌ఫాం- ‘స్టాప్ ద బి’ ప్రారంభించింది. యునెస్కో యాంటీబుల్లీయింగ్‌లో మాట్లాడిన అతి పిన్న వయస్కురాలీమె. ‘మాకు మేముగా గుర్తింపు పొందాలనుకున్నాం. విమర్శలకు గెలుపుతోనే సమాధానం చెప్పాలనుకున్నా’మనే ఈ అక్కాచెల్లెళ్లు సందేహించిన వారితోనే శభాష్ అనిపించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.