పరిమళాల పూలను పెంచేద్దామా!

సువాసన వెదజల్లుతూ, గుత్తుల్లో విరబూస్తూ కనువిందు చేసే పూలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి.

Published : 21 Mar 2024 02:04 IST

సువాసన వెదజల్లుతూ, గుత్తుల్లో విరబూస్తూ కనువిందు చేసే పూలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి మొక్కే సెంటు మల్లె. మరి దీన్ని ఎలా పెంచుకోవాలో చూద్దామా!

సెంటు మల్లెనే ఉత్తరాదిన కశ్మీరీ బొకేగా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం క్లిరొడెండ్రామ్‌ ఫిలిప్పీనమ్‌. ఈ పూలు విరబూసిన మల్లెలను గుర్తు తెస్తాయి. బీట్‌రూట్‌ రంగులో మొగ్గలు తొడుగుతాయి. ఇవి కొన్నిసార్లు ధవళవర్ణంలోనూ, మరికొన్నిసార్లు దీనికే కాస్త గులాబీ ఛాయ అద్దినట్లూ పూస్తాయి. మనసుకి హాయినిచ్చే పరిమళాన్నీ వెదజల్లుతాయి.  దీన్ని ఎండ తగిలే ప్రదేశంలోనే కాదు, పాక్షికంగా నీడ ఉన్న చోటా నాటుకోవచ్చు. ఈ మొక్క ఎలాంటి మట్టిలోనైనా వేగంగా, గుబురుగా పెరుగుతుంది. కాబట్టి దీన్ని కాస్త పెద్ద కుండీల్లో నాటుకోవాలి. నేలలో నాటితే కాస్త విశాలంగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఈ పూలల్లో మకరందాన్ని సేకరించడానికి సీతాకోక చిలుకలూ, తూనీగలు దీని చుట్టూ చేరి... ఆ ప్రదేశానికి మరింత ఆకర్షణ తెచ్చిపెడతాయి.

శ్రద్ధపెట్టండిలా... సెంటుమల్లె మొక్కను ఎప్పటికప్పుడు ప్రూనింగ్‌ చేయాలి. ముఖ్యంగా పూలు పూయడం పూర్తయ్యాక కొమ్మని రెండు అంగుళాల కిందవరకూ కత్తిరించాలి. అప్పుడే కొత్త చిగుళ్లు వస్తాయి. పూలు పూయడం తగ్గిందనిపిస్తే మొక్కను దానికంటే పెద్ద పరిమాణంలో ఉన్న కుండీలోకి మార్చుకోవాలి. నెలరోజులకోసారైనా మొక్క చుట్టూ ఉన్న మట్టిని తిరగేస్తే వేళ్లకు పోషకాలు సరిగ్గా అందుతాయి. దీనికి ఎన్‌పీకే ద్రవరూప ఎరువుని ఇవ్వడంతో పాటు వర్మీకంపోస్ట్‌ని ప్రతి నెలరోజులకోసారి ఇవ్వాలి. మందారాన్ని పట్టి పీడించే పేనుబంక, తెల్ల దోమ, బూడిద తెగులు ఈ సెంటు మల్లెనీ వేధిస్తుంటాయి. ఈ సమస్య దూరం చేయడానికి సూర్యోదయానికి ముందే లీటరు నీటిలో రెండు చెంచాల వేప నూనె చేర్చి స్ప్రే చేస్తే సరి. పూలతో నిండుగా ఎదుగుతుందీ మొక్క.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్