గులాల్‌ గోటా... రంగుల కళ!

హోలీ అంటే మనకు రంగులే మనసులో మెదులుతాయి. వాటితోపాటు ఈ సింథటిక్‌ వర్ణాలు చేసే హానీ గుర్తుకొస్తుంది. కానీ నాలుగువందల ఏళ్ల నుంచీ సహజరంగులతో చేసే గులాల్‌ గోటా రంగుల గురించి వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

Published : 25 Mar 2024 01:34 IST

హోలీ అంటే మనకు రంగులే మనసులో మెదులుతాయి. వాటితోపాటు ఈ సింథటిక్‌ వర్ణాలు చేసే హానీ గుర్తుకొస్తుంది. కానీ నాలుగువందల ఏళ్ల నుంచీ సహజరంగులతో చేసే గులాల్‌ గోటా రంగుల గురించి వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ కళని బతికించిన గుల్‌రుక్‌ సుల్తానా కథా ఆసక్తికరమే...

గులాల్‌ గోటా... ఇవి సహజరంగులు నింపిన బంతులు. చూడ్డానికి బలమైన బంతుల్లా ఉంటాయి కానీ... తాకీతాకగానే పగిలి రంగులు వెదజల్లే వీటిని లక్కతో చేస్తారు. ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటే తప్ప వీటిని చేయలేరు. వీటిలోని రంగులు మనకి ఏమాత్రం హానిచేయవు. అందుకే వాటికంత డిమాండ్‌. ఈ కళ నాలుగువందల ఏళ్ల క్రితం జైపుర్‌లో పుట్టింది. రాజ కుటుంబాలు హోలీ ఆడుకోవడానికి వీలుగా కొన్ని ముస్లిం కుటుంబాలు ఈ గులాల్‌ గోటాలని తయారు చేసేవి. అప్పట్లో హోలీ వస్తే ఈ కుటుంబాలకు క్షణం తీరిక దొరికేది కాదట. కాలక్రమేణా సింథటిక్‌ రంగుల తాకిడివల్ల వీటికి ఆదరణ తగ్గింది. అయినా కొన్ని కుటుంబాలు మాత్రం ఈ కళని అంటిపెట్టుకునే ఉన్నాయి. అందులో ఆవాజ్‌ మహ్మద్‌ కుటుంబం ఒకటి. ఆయన కూతురే గుల్‌రుక్‌. కుటుంబాన్ని పోషించడం కోసం చదువుకు కూడా దూరమై గులాల్‌ గోటాలు తయారు చేసేది ఆమె. తనకి మరికొందరూ తోడయ్యారు. వీరంతా కలిసి చేసిన గులాల్‌ గోటాలు జైపుర్‌లోని గోవింద్‌జీ ఆలయం సహా బృందావన్‌, మధుర ఆలయాలకు వెళ్తుంటాయి. ఈ కళ తనతోనే అంతరించిపోకూడదని జైపుర్‌, ముంబయి, సూరత్‌లో ఎంతోమందికి శిక్షణ ఇప్పించారీమె. పెద్దగా చదువుకోకపోయినా ఈ కళని నేర్పించడానికి దుబాయ్‌తో పాటు మరికొన్ని దేశాలకు వెళ్లి అక్కడా శిక్షణ ఇచ్చారు. జేజే స్కూల్‌ ఆఫ్‌ఆర్ట్స్‌, పెరల్‌ అకాడెమీ, ఆయోజన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్‌ వంటి చోట్ల గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేసి ఎంతోమందికి ఈ కళ గొప్పతనం గురించి చెబుతున్నారు. ఆమె కృషికి 2013లో యునెస్కో అవార్డు వరించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్