ఫోను చలవే.. మతిమరుపు!
కూరలో ఉప్పేయడం మరిచిపోవడం, బాగా దగ్గరి వారి పుట్టినరోజులూ గుర్తుండకపోవడం, గుర్తుగా పెట్టిన వస్తువు జాడ చెప్పలేకపోవడం, ఆత్మీయుల ఫోన్ నంబర్ల కోసమూ తడుముకోవడం.. అడపాదడపా జరిగేవే! వీటివల్ల పెద్ద ప్రమాదముండదు. అదే తరచుగా జరుగుతోంటే? డిజిటల్ అమ్నీషియా కావొచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటిది?
కూరలో ఉప్పేయడం మరిచిపోవడం, బాగా దగ్గరి వారి పుట్టినరోజులూ గుర్తుండకపోవడం, గుర్తుగా పెట్టిన వస్తువు జాడ చెప్పలేకపోవడం, ఆత్మీయుల ఫోన్ నంబర్ల కోసమూ తడుముకోవడం.. అడపాదడపా జరిగేవే! వీటివల్ల పెద్ద ప్రమాదముండదు. అదే తరచుగా జరుగుతోంటే? డిజిటల్ అమ్నీషియా కావొచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటిది?
చిన్న లెక్కకీ ఠకీమని కాలిక్యులేటర్ తెరిచేయడం.. చిన్న సమాచారమైనా గూగుల్‌లో వెతికేయడం.. ఫోన్ మీద ఎంతలా ఆధారపడుతున్నామన్న దానికి సూచికలే. దానికి తోడు కొవిడ్ తర్వాత ప్రధాన వ్యాపకం మొబైలే. పిల్లల ఆన్‌లైన్ పాఠాలతో దాని వాడకం ఇంకాస్త పెరిగింది. ఆ ప్రభావమంతా పడేది మెదడుపైనే. కాలు బయట పెట్టకుండా ఇంట్లోనే హాయిగా పని చేసుకోవచ్చు.. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశమివ్వగానే అందరిదీ ఇదే భావన కదూ! కదలకుండా గదిలో కూర్చోవడం.. పలకరింపులు, పని తాలూకూ చర్చలు, మీటింగ్‌లు అన్నీ తెర వేదికనే! ఫలితమే డిజిటల్ అమ్నీషియా. అంటే.. మెదడు గుర్తుంచుకోగల సామర్థ్యాన్ని కోల్పోవడమన్నమాట. అంతేకాదు కొత్త సమాచార సేకరణ, అనుభవాల్ని సంక్షిప్తం చేయలేని స్థితికి చేరుతుంది. ఫలితమే చిన్న చిన్న విషయాల్నీ మర్చిపోవడం.. ఎంతో గుర్తుగా దాచమన్నవీ జ్ఞప్తికి రాకపోవడం వంటివన్నీ! దీనికి ఒత్తిడీ జతైతే సమస్య మరింత పెరుగుతుంది. కొందరిలో నిద్ర లేమికీ కారణమవుతుంది. నిద్ర.. మెదడుకు డీటాక్సింగ్ చేసుకునే వీలు కల్పిస్తుంది. దీంతో అనవసర సమాచారాన్ని తీసేసి, కొత్తవి ఏర్పరుచుకోవడానికి స్థలం లభిస్తుంది. కలత నిద్రతో వీటికి వీలుండదు. దీంతో మర్చిపోతుంటాం.
హెచ్చరిస్తున్నాయ్..
ఎన్నో పరిశోధనలు మొబైల్ ఫోన్ పెద్దల్లోనే కాదు చిన్నపిల్లలు, టీనేజర్లపైనా ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నాయి. ఓ విదేశీ సంస్థ 6000 మందిపై పరిశోధన చేస్తే.. 71 శాతం మంది ఇంట్లోవాళ్ల నంబర్లూ చెప్పలేకపోయారట. మొబైల్ లేకపోతే ఆరోజు ఏం చేయాలన్న స్పష్టత లేనివారూ ఉన్నారట. అంతలా టెక్నాలజీపై ఆధారపడుతున్నాం. పిల్లల్లో అయితే రోజులో వారు 10.6 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడినా రేడియేషన్ మామూలు వాళ్లకంటే ఎక్కువ ప్రభావం వారిపై చూపుతోందట.
బయటపడాలంటే..
* ఆగండి.. పిల్లలకి ఏదైనా సందేహం వచ్చింది. అడగ్గానే గూగుల్ తెరిచేయకండి. ముందు మీకెంత వరకూ తెలుసో ఆలోచించండి. అదనపు సమాచారం కావాలన్నప్పుడు మాత్రమే టెక్నాలజీపై ఆధారపడండి. మొదటి ప్రయత్నం మాత్రం మీదే అవ్వాలి.
* మనసులో మననం చేసుకోవడం కంటే కాగితంపై రాస్తే ఎక్కువ గుర్తుంటుందట. కాబట్టి, సరకులు, ఆరోజు చేయాల్సిన పనులు, ఇంటి లెక్కలు ఏవైనా రాసిపెట్టుకోండి.
* పొద్దుపోక సాహిత్యం, వార్తలు వగైరా చదువుతారా? తెర మీద మాత్రం చదవొద్దు. స్క్రీన్ మీద చదువు మొత్తాన్నీ పూర్తిచేయనీయదు. ఆసక్తికరంగా లేదని కొంత మొత్తాన్ని పక్కకు తోసేలా చేస్తుంది.
* గుర్తుచేసుకుంటూ ఉండండి.. ఉదయం లేవాలంటే అలారం.. మనకు తప్పదు. పిల్లల ప్రాజెక్టులు, ఆఫీసు పని, ఆయన గుర్తు చేయమన్న విషయాలు.. వేటికైనా రిమైండర్లు పెట్టుకోవడం మామూలై పోయింది కదూ! కానీ వద్దు. బదులుగా చిన్న చిన్న స్టిక్ పేపర్లను అతికించుకొని వాటిపై రాసుకుని తరచూ చెక్ చేసుకోండి.
* మననం చేయండి.. మీది మినహా ఎన్ని ఫోన్ నంబర్లు గుర్తున్నాయ్? చెక్ చేసుకోండి. తోడబుట్టిన వాళ్లు, దగ్గరి బంధువులు, స్నేహితులు, పిల్లల స్కూలు నంబర్లను మననం చేసుకోండి. వాళ్లకి ఎప్పుడు కాల్ చేయాలన్నా కాల్ డేటా, ఫోన్‌బుక్ తెరవక సొంతంగా నంబర్లు టైప్ చేయండి.
* మధ్యాహ్నం పనయ్యాక ఆరోజంతా ఏం చేశారో క్రమపద్ధతిలో గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించండి. పోనీ బీరువాలో చీరలు తీసి ఎప్పుడెప్పుడు కొన్నారు లాంటివి ఆలోచించండి. ఇవన్నీ సహజంగా గుర్తుండేలా చేసే మార్గాలే!
* పక్కన పెట్టేయాల్సిందే.. రోజంతా పనితో సరిపోతుంది. మనకంటూ కాస్త సమయం దొరికేది పిల్లలు పడుకున్నాకే! దాన్ని ఫోన్‌తో గడుపుతున్నారా? నిద్ర దూరమవడమే కాదు మెదడుపైనా దుష్ప్రభావం. కాబట్టి దూరంగా ఉంచండి. వారాంతాల్లో పిల్లలకు ప్రత్యేకమైనవి చేసిపెట్టాలని నెట్‌లో వెతుకుతుంటాం. వాటినీ ఓ పుస్తకంలో రాసి ఉంచుకోండి. పదే పదే మొబైల్ మీద ఆధారపడాల్సిన పనుండదు. అలాగే ప్రతి ఆదివారం ఇంటిల్లపాదికీ డిజిటల్ డీటాక్సింగ్ అలవాటు చేయండి. రోజంతా ఫోన్‌కు దూరంగా ఉండటమన్నమాట. ఎరోప్లేన్ మోడ్‌లో ఉంచడమో, స్విచాఫ్ చేయడమో చేస్తే.. ఫోన్, మెసేజ్‌లు వచ్చాయనో, తెర వెలిగిందనో మనసు అటువైపు వెళ్లకుండా ఉంటుంది.
* ఆహారం, వ్యాయామం.. ఎక్కువ ప్రొటీన్లు, మంచి కొవ్వులు మెదడును చురుగ్గా ఉంచుతాయి. వీటితోపాటు బి1, బి12 విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారానికి ప్రాధాన్యమివ్వండి. కొత్త వ్యాపకాలు, నేర్చుకోవడంపై దృష్టిపెట్టండి. నేరుగా నేర్చుకోవడానికే ప్రాధాన్యమివ్వండి. కొత్త వంట, వ్యాయామం, మొక్కల పెంపకం, భాష.. నచ్చినదేదో ప్రయత్నించేయండి. వ్యాయామాన్నీ తప్పనిసరి చేసుకోండి. కనీసం రోజులో కాసేపయినా నడవండి. దీంతోపాటు కనీసం 8 గంటల తప్పనిసరి నిద్ర ఉండేలా చూసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.