ఆమె పదవికి.. ఆయన పెత్తనమేంటి?
పంచాయతీల్లో ఆడవాళ్లకు సమాన రిజర్వేషన్! వినడానికి బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరే. పేరుకి సర్పంచి భార్య అయినా పెత్తనం చేసేదంతా ‘సర్పంచి భర్త గారే’. ఈ విధానాన్నే ప్రశ్నిస్తున్నారు డాలీ వర్మ.
డాలీ
పంచాయతీల్లో ఆడవాళ్లకు సమాన రిజర్వేషన్! వినడానికి బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరే. పేరుకి సర్పంచి భార్య అయినా పెత్తనం చేసేదంతా ‘సర్పంచి భర్త గారే’. ఈ విధానాన్నే ప్రశ్నిస్తున్నారు డాలీ వర్మ. ఇంతకీ ఎవరీమె?
2022 బిహార్.. పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఒకరి తర్వాత ఒకరు పోడియం వద్దకు వచ్చి ప్రమాణం చేసి వెళుతున్నారు. కానీ వాళ్లలో ఒక్కరూ ఎలక్షన్లలో నిలబడలేదు, పోటీ చేయలేదు. గెలిచిన వాళ్లంతా ఆ మగవాళ్ల భార్యలు లేదా ఇంటి సభ్యులు. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది కూడా. ఈ విధానాన్నే ప్రశ్నిస్తున్నారు డాలీవర్మ. ఆన్‌లైన్‌లో దీనికి వ్యతిరేకంగా క్యాంపెయిన్‌నీ నిర్వహిస్తున్నారు. ఈవిడది మేరఠ్. దిల్లీలో ఎంబీఏ పూర్తయ్యాక పలు ఎంఎన్‌సీల్లో ఉద్యోగాన్నీ చేశారామె. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భర్త ఊరు బిహార్‌లోని షాదీపూర్‌కి ఈమె సర్పంచ్. ‘డాలీ సర్పంచ్’గా పేరూ పొందారు.
ప్రభుత్వ మీటింగ్‌లు ఏవైనా భార్యల స్థానంలో భర్తలే హాజరవడాన్ని గమనించారామె. ‘పేరుకే 50% రిజర్వేషన్. అధికారమంతా ‘సర్పంచ్ పతి’లదే. మహిళలను పక్కకి తోసి, భర్తలు, తండ్రులు అధికారాన్ని చెలాయించడం సహించలేకపోయా. ఇది ఓటు వేసిన వారికి అవమానమే. అంతెందుకు పోస్టర్లు, బ్యానర్లలోనూ వాళ్ల ఫొటోలే. ఆడాళ్లవి ఏమూలో కనిపిస్తుంటాయి. ఇవన్నీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే’ అని చెబుతారీమె. ఈ సర్పంచి పతి పద్ధతి ఇలాగే కొనసాగితే మహిళా సాధికారతకు భంగమే అంటారీమె. ‘నిజానికి ఈ విధానంపై దశాబ్దం క్రితమే చర్యలు ప్రారంభ మయ్యాయి. కానీ పైపైనే! దీనిపై లోతైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఎన్నికైన మహిళలకి శిక్షణ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తే కోరుకున్న మార్పు సాధ్యమవుతుంది. బలమైన నాయకురాళ్లు తయారవుతారు. రాబోయే తరాలూ రాజకీయాల్లోకి వస్తా’యనే డాలీ దీనిపై ఆన్‌లైన్ వేదికగా అవగాహనని కల్పిస్తున్నారు. తన పరిధుల్లోని వార్డుల్లో మగవాళ్ల జోక్యాన్నీ అంగీకరించడం లేదావిడ. ఈమెలా అందరూ ఆలోచిస్తే.. అసలైన మహిళా నాయకురాళ్ల సంఖ్య పెరగడం ఖాయమే కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.