అది ‘మీ’ టైమ్‌ కాదు!

పనులన్నీ ముగిసి, మంచం మీదకి చేరాక మనసు ఫోనుకేసి లాగుతుంది. అప్పటిదాకా ఏదో ఒక పనితోనే సరిపోతుంది. కాస్త విశ్రాంతి తీసుకుందామన్నా, మనకోసం సమయం కేటాయించుకుందామన్నా కుదరదు.

Published : 23 Mar 2024 01:36 IST

పనులన్నీ ముగిసి, మంచం మీదకి చేరాక మనసు ఫోనుకేసి లాగుతుంది. అప్పటిదాకా ఏదో ఒక పనితోనే సరిపోతుంది. కాస్త విశ్రాంతి తీసుకుందామన్నా, మనకోసం సమయం కేటాయించుకుందామన్నా కుదరదు. అందుకే చాలామంది మహిళల ‘మీ టైమ్‌’ రాత్రివేళ, అందుకు సాయపడే సాధనం ఫోన్‌ అవుతోంది. కానీ ఇది అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోందని తెలుసా?

  • బెడ్‌టైమ్‌ ప్రొక్రాస్టినేషన్‌... అంటే... నిద్రని వాయిదా వేయడమని అర్థం. పసివాళ్లు, పిల్లల చదువులు, ఆఫీసు పనులంటూ తీరిక లేకుండా గడిపే మహిళలే దీని బారిన ఎక్కువ పడుతున్నారట. ‘రోజంతా కష్టపడ్డాం, మా కోసం కాస్త సమయం గడపాలిగా’ అని పడుకున్నాక ఫోన్‌ చేతిలోకి తీసుకుంటారా... ఒక్క వీడియో, కొద్దిసేపు సోషల్‌మీడియా కాస్తా గంటల సమయం తినేస్తుంది. దీంతో నిద్ర దూరమవుతుంది. దీర్ఘకాలంలో అది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.
  • ‘దొరికేదే ఆ కాస్త సమయం. ఇక అప్పుడూ నచ్చింది చేయకపోతే జీవితంలో పని తప్ప మరేం మిగలదు’ చాలామంది ఫిర్యాదే ఇది. మనసును శాంతపరచుకోవడం అనుకుంటాం కానీ... ఆ నీలికాంతి మనసుపై చెడు ప్రభావం చూపుతుంది. అలాగని వద్దంటేనేమో మనసులో ఒత్తిడి గూడు కట్టుకుంటుంది. కాబట్టి, నిద్రకు గంటకు ముందు ఫోన్‌ పక్కన పడేయండి. ముఖ్యంగా అన్ని పనులూ మీ నెత్తినే వేసుకోవడం వల్లే ఈ అలసట. కాబట్టి, అన్నీ కాకపోయినా అప్పటికప్పుడు చిన్నవాటినైనా వేరే వాళ్లకు అప్పగిస్తే మీకూ నచ్చినవి చేసుకునే సమయం దొరుకుతుంది. అప్పుడు రాత్రిదాకా వేచి ఉండాల్సిన పని ఉండదు.
  • మంచం మీదకి చేరాక నో టీవీ, నో ఫోన్‌ అన్న నియమాన్ని తప్పక పాటించండి. అప్పుడు తప్ప వీలవదు అనిపించిందా... ఓ పుస్తకం తీసి చదవడం మేలు. అలాగే ఎంత బిజీగా ఉన్నా తప్పక నిద్రవేళలను పాటించడం తప్పనిసరి నియమంగా పెట్టుకోండి. లేదంటే రోజుకో సమయానికి పడుకుంటే మేల్కొలపడానికీ, నిద్రపుచ్చడానికీ సాయపడే కార్టిసాల్‌, మెలటోనిన్‌ హార్మోనుల విడుదలలో ఇబ్బందులొస్తాయి. ఇదీ శరీరానికి హాని చేసేదే!
  • ఒక్కోసారి చాలా అలసటగా తోస్తుంది. నిల్చొని కూడా నిద్ర పోతామేమో అనిపిస్తుంది. అదేంటో ఫోన్‌ చేతిలోకి తీసుకోగానే దాని జాడే కనిపించదు. నిజానికి అలా అలసటగా అనిపించినపుడు 20 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది. తీరా ఫోన్‌ తీసుకోగానే అది కాస్తా కొన్ని గంటలు వెనక్కి వెళ్లిపోతుంది. కాబట్టి, నిద్రా సమయం ఎప్పుడూ ‘మీ టైమ్‌’ కాదు. కావాలనుకుంటే ప్రాణాయామం, వెచ్చని పాలు, హెర్బల్‌ టీ, వేడి నీటి స్నానాన్ని ఆశ్రయించండి కానీ... ఫోన్‌ మాత్రం వద్దు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్