సేవలమ్మ.. ఈ కండక్టరమ్మ

అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు... అన్నీ ఆమె సంకల్ప బలాన్ని పరీక్షించినవే! వాటికి సమాధానం చెబుతూనే 19 ఏళ్లుగా సేవాపథంలో నడుస్తున్న యల్లా శ్యామలకి ఎదురైన కఠిన పరీక్ష... రొమ్ముక్యాన్సర్‌.

Published : 08 Nov 2022 00:53 IST

అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు... అన్నీ ఆమె సంకల్ప బలాన్ని పరీక్షించినవే! వాటికి సమాధానం చెబుతూనే 19 ఏళ్లుగా సేవాపథంలో నడుస్తున్న యల్లా శ్యామలకి ఎదురైన కఠిన పరీక్ష... రొమ్ముక్యాన్సర్‌. 1200 మందికి విద్యాదానం చేసిన ఈ కండక్టరమ్మ స్ఫూర్తిగాథ చదవండి...

ష్టాలు ముంచెత్తినప్పుడు గట్టెక్కించే ఆధారం కోసం చూస్తాం. అది దొరగ్గానే... మళ్లీ వెనక్కి చూడాలనుకోం. కానీ శ్యామల అలా అనుకోలేదు. ‘తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తారుమంచివారి కండ్రిగ మా సొంతూరు. నేను ఐదుగురు ఆడపిల్లల్లో ఒక్కరిగా పుడితే... ఆయన పద్నాలుగు మందిలో ఒక్కరు. చదువుకోవాలని ఉన్నా వీలు కాలేదు. మా వారు కృష్ణయ్య మేకలు కాశారు. ధాన్యం లోడ్‌ ఎత్తేవారు. ఊరికి అధికారులు వస్తే మంచి దుస్తులు వేసుకున్న వారినే పలకరిస్తారు కదా. చదువుకొంటే మనకీ ఆ గౌరవం దక్కుతుంది కదాని ఆలోచించారాయన. అందుకే మా పెళ్లయ్యాక నన్ను కాలేజీకి పంపి.. ఆయన ఓపెన్‌ స్కూల్లో చదివారు. మా వరకూ చూసుకుంటే సరిపోతుందా అనిపించింది. అడుక్కునే పిల్లలనీ, దుకాణాల్లో పనిచేసే వాళ్లూ, అనాథలూ, చెత్త ఏరుకొనే పిల్లల్ని చేరదీసి ఉన్నంతలో పెట్టి, చదువు చెప్పేవాళ్లం. లేదా బడిలో చేర్పించే వాళ్లం. అనాథలైతే మా అద్దె ఇంట్లోనే ఉంచుకొనే వాళ్లం. నాకు ఇంటర్‌ అయ్యాక కండక్టర్‌ ఉద్యోగం వచ్చింది. ఆయన డిగ్రీ పూర్తి చేశారు. నా జీతం ఉందన్న ధైర్యంతో మరో యాభై మందిని చేరదీసి బడి మొదలు పెట్టాం. రోజంతా ఉద్యోగం, సాయంత్రం పిల్లల బాగోగులు, చదువులు, వంటతో సరిపోయేది. ఇదంతా 2004 నుంచీ చేస్తున్నా.. 2007లో ‘చేయూత’ సంస్థను రిజిస్టర్‌ చేయించాం. పిల్లలు పెరగడంతో మరో భవనాన్ని అద్దెకు తీసుకున్నాం. నా జీతంలో సగం అద్దెకే ఖర్చయ్యేది. ఇక పిల్లలకు భోజనం కోసం... చాలా మంది కంట్రోల్‌ బియ్యం ఇచ్చేవారు. కాయగూరల దుకాణాల వాళ్లు.. సాయంత్రం మిగిలినవి ఇచ్చే వాళ్లు. ఇలా సామాన్యుల సహకారంతో రోజులు గడిచిపోయేవి. మా సంస్థ సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఏటా 20 నుంచి 50 మంది చిన్నారులకు విద్యా బుద్ధులు నేర్పి వెలుగు, గురుకులాల్లో చేర్చేవాళ్లం. ప్రస్తుతం స్థానిక పాఠశాలల్లో చేర్చి, బాగోగులు చూస్తున్నాం’ అనే శ్యామల ఇంతవరకూ 1200 మందిని చదువు బాట పట్టించారు.

క్యాన్సర్‌ వచ్చాక...

రెండేళ్ల క్రితం ఓ శరాఘాతం... శ్యామలకి రొమ్ము క్యాన్సర్‌ వచ్చింది. చికిత్స తీసుకుంటూనే ఉద్యోగం, సేవా కొనసాగిస్తున్నారు. ‘కొవిడ్‌ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాం. పిల్లల ఆకలి ఎలా తీర్చాలో అర్థం కాలేదు. కొంతమంది అయిన వాళ్ల దగ్గరకు వెళ్లినా, అనాథల్ని ఎక్కడికీ పంపలేం కదా. ఆ కష్టాల నుంచి ఎలానో దాటాం అనుకొనే సమయానికి నాకీ జబ్బు. ఆరు నెల్లకు పైగా ఆసుపత్రి పాలయ్యా. ఇంటినమ్మేసి ఆ డబ్బునీ వైద్యానికి ఖర్చుపెట్టాం. చాలామంది మీ సంపాదన దాచుకొని ఉంటే ఆ డబ్బులు మిగిలేవి... ఇవన్నీ తలకెత్తుకోవడం ఎందుకు అన్నారు. నాకు మాత్రం సేవకు మించిన సంతృప్తి లేదనిపించింది. ఇప్పుడు మందులు వాడుతూ ఉద్యోగానికి వెళ్తున్నా’ అనే శ్యామలకి ఇద్దరు పిల్లలు. ఒకరు డిగ్రీ పూర్తి చేస్తే.. మరొకరు ఎంబీయే చదువుతున్నారు.

-యర్రాబత్తిన నాగరాజు, గూడూరు గ్రామీణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్