ఒత్తిడితో అందానికి ముప్పేనట!

దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళనలు మన అందంపై రెండు రకాలుగా ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు సౌందర్య నిపుణులు. మొదటిది.. టెన్షన్‌ పడినప్పుడు మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

Published : 03 Feb 2024 19:51 IST

దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళనలు మన అందంపై రెండు రకాలుగా ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు సౌందర్య నిపుణులు. మొదటిది.. టెన్షన్‌ పడినప్పుడు మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా జరిగే శారీరక మార్పుల వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇక రెండోది.. ఒత్తిడికి గురైనప్పుడు ఏది పడితే అది తినడం వల్ల జీవనశైలిలో సైతం మార్పులొస్తాయి. ఇదీ ఒక రకంగా సౌందర్యంపై ప్రభావం చూపుతుంది. అయితే మీరు ఒత్తిడి, ఆందోళనలకు గురైనప్పుడు మీ ముఖ సౌందర్యం విషయంలో ఈ మార్పులు గమనించచ్చంటున్నారు నిపుణులు.

ఎలాంటి సమస్యలొస్తాయంటే..!

⚛ ఒత్తిడి, ఆందోళనలకు గురైనప్పుడు శరీరంలో ఎక్కువ మొత్తంలో కార్టిసాల్‌ (ఒత్తిడి హార్మోన్‌) విడుదలవుతుంది. ఇది చర్మంపై ఉండే నూనె గ్రంథుల్ని (సెబేషియస్ గ్రంథులు) ప్రేరేపించి ఎక్కువ మొత్తంలో నూనెలు విడుదలయ్యేలా చేస్తుంది. తద్వారా చర్మ గ్రంథులు మూసుకుపోయి మొటిమలొస్తాయి.

⚛ సాధారణంగా వయసు పైబడే కొద్దీ కళ్ల కింద వాపు (ఐ బ్యాగ్స్‌), కనురెప్పలు ఉబ్బడం.. వంటి సమస్యలొస్తాయి. అయితే ఒత్తిడి వల్ల నిద్ర లేకపోవడం కూడా ఈ సమస్యను తెచ్చిపెడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. చర్మం స్థితిస్థాపకతను కోల్పోవడం, పిగ్మెంటేషన్‌, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు దరిచేరడం.. ఇలా ఒత్తిడి అందంపై పలు రకాలుగా ప్రతికూల ప్రభావం చూపుతుందట!

⚛ చర్మం కింద ఉండే ప్రొటీన్‌, లిపిడ్స్‌ చర్మ కణాలు తేమగా ఉండడంలో సహకరిస్తాయి. అయితే ఒత్తిడి కారణంగా వాటి పనితీరు దెబ్బ తింటుంది. ఫలితంగా చర్మం పొడిబారిపోవడం, దురద రావడం.. వంటి సమస్యలొస్తాయి.

⚛ ఒత్తిడి, ఆందోళనలు పరోక్షంగా మన రోగనిరోధక శక్తి పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా పొట్ట, చర్మంలో ఉండే బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది. దీన్నే ‘డిస్‌బయోసిస్’ అంటారు. ఫలితంగా చర్మంపై దద్దుర్లు రావడం, ఎరుపెక్కడం.. వంటి సమస్యలొస్తాయి. ఇదిలాగే కొనసాగితే సొరియాసిస్‌ వంటి తీవ్ర చర్మ వ్యాధులకు కూడా దారితీసే ప్రమాదముందట!

⚛ మానసిక సమస్యలు ఎంత ఎక్కువైతే జుట్టు అంతగా నెరిసిపోతుందని చెబుతోంది తాజా అధ్యయనం. జుట్టుకు సహజసిద్ధమైన నలుపు రంగును అందించే మెలనోసైట్స్‌ ఒత్తిడి కారణంగా క్రమంగా కనుమరుగవుతాయట! తద్వారా కొత్తగా పుట్టుకొచ్చే కణాలకు మెలనిన్‌ అందక జుట్టు నెరిసిపోవడం ప్రారంభమవుతుంది. అంతేకాదు.. దీర్ఘకాలిక మానసిక సమస్యలు జుట్టు పెరుగుదల ఆగిపోయేలా చేసి.. అది పూర్తిగా నిర్జీవమైపోయేలా చేస్తాయట!

ఒత్తిడిని చిత్తు చేయాలంటే..!

ఒత్తిడి కారణంగా సౌందర్యంపై ఇంతలా ప్రభావం పడుతుంది కాబట్టే ఇలాంటి మానసిక సమస్యలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని చిన్న చిన్న చిట్కాల్ని పాటించాల్సి ఉంటుంది.

⚛ బిజీగా ఉంటే పని ఒత్తిడి, ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలతో మనసంతా అయోమయంగా ఉంటుంది. ఇలాంటప్పుడు మీకు ఏ పనైతే ఇష్టంగా చేయాలనిపిస్తుందో ఆ పనిలో బిజీగా మారిపోమంటున్నారు నిపుణులు. తద్వారా మనసుకు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఏదో తెలియని సంతృప్తి మన మనసులో నిండిపోతుంది.

⚛ మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా కూడా ఒత్తిడిని అదుపు చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో డార్క్‌ చాక్లెట్‌, గుడ్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు, చామొమైల్‌ టీ.. వంటివి చక్కగా పనిచేస్తాయట! వీటిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లే అందుకు ప్రధాన కారణమంటున్నారు నిపుణులు.

⚛ ఒత్తిడిని కలుగజేసే కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయుల్ని అదుపులో ఉంచడంలో వ్యాయామం, యోగా, ధ్యానం.. వంటివి చక్కగా దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే రోజూ ఉదయం లేదా సాయంత్రం ఓ అరగంట పాటు మీకు నచ్చిన వ్యాయామాలు చేస్తే ఒత్తిడికి దూరంగా ఉండచ్చంటున్నారు.

⚛ ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌, మీ మనసుకు నచ్చిన వారితో కాసేపు సమయం గడిపి చూడండి.. మంచి ఉపశమనం లభిస్తుంది.

ఒకవేళ ఈ చిట్కాలన్నీ పాటించినా ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడట్లేదనిపిస్తే మాత్రం వెంటనే మానసిక నిపుణుల్ని సంప్రదించడం ఉత్తమం. తద్వారా మొదట్లోనే సమస్య నుంచి బయటపడచ్చు. తద్వారా ఇతర మానసిక, శారీరక సమస్యల్లోకి కూరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్