Social Stars: కామెడీ.. ఆధ్యాత్మికత.. హెరిటేజ్ ఫ్యాషన్.. ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత!

ఒకరు తమ హాస్య చతురతతో చుట్టూ ఉన్న వారిని కడుపుబ్బా నవ్వించగలగచ్చు.. తమ స్ఫూర్తిదాయక మాటలతో ఇతరుల్లో ప్రేరణ కలిగించే ప్రత్యేకత మరొకరిలో ఉండచ్చు.. తమ అద్భుత గాత్రంతో నలుగురినీ సంగీత ఝరిలో ఓలలాడించే నేర్పు ఇంకొకరి సొంతం కావచ్చు.

Updated : 16 Mar 2024 14:32 IST

(Photos: Instagram)

ఒకరు తమ హాస్య చతురతతో చుట్టూ ఉన్న వారిని కడుపుబ్బా నవ్వించగలగచ్చు.. తమ స్ఫూర్తిదాయక మాటలతో ఇతరుల్లో ప్రేరణ కలిగించే ప్రత్యేకత మరొకరిలో ఉండచ్చు.. తమ అద్భుత గాత్రంతో నలుగురినీ సంగీత ఝరిలో ఓలలాడించే నేర్పు ఇంకొకరి సొంతం కావచ్చు. ఇలా తరచి చూస్తే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగుంటుంది.. దీన్ని తమ కోసం కాకుండా నలుగురి కోసం వినియోగిస్తున్నారు కొందరు మహిళలు. సోషల్‌ మీడియా ద్వారా తమలోని ప్రతిభను చాటుకుంటూ ‘సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు’గానూ గుర్తింపు పొందారు. అలాంటి కొంతమంది గేమ్‌ ఛేంజర్స్‌ని ఎంపిక చేసి.. వారికి తొలిసారి ‘నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డు’ అందించింది భారత ప్రభుత్వం. వివిధ రంగాల్లో, విభిన్న విభాగాల్లో ఈ పురస్కారం అందుకున్న మహిళామణుల గురించి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

ఆధ్యాత్మికతే ఆయువుపట్టు!

భవిష్యత్తులో అలా ఉండాలి.. ఇది చేయాలి.. అనుకుంటాం.. ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకుంటాం.. కానీ మనం ఎన్ని అనుకున్నా జరిగేది జరగక మానదు అంటోంది జయా కిశోరి. ఆమె అసలు పేరు జయా శర్మ. రాజస్థాన్‌లోని సుజంగర్‌ అనే ప్రాంతంలో ఓ సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిందామె. ఆధ్యాత్మిక వాతావరణంలో పెరగడం వల్ల చిన్నతనం నుంచే ఆమెలో భక్తి భావం రెట్టింపైంది. దీంతో ఏడేళ్ల వయసు నుంచే తన తల్లిదండ్రులు, గ్రాండ్‌ పేరెంట్స్‌ దగ్గర్నుంచి ఎన్నో భజనలు, భక్తి గీతాలు నేర్చుకొని ఆలపించడం ప్రారంభించింది. ఈ గీతాలు, శ్లోకాల్లోని కఠినమైన సంస్కృత పదాల్ని కూడా ఆమె పొల్లు పోకుండా పలకడం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇలా ఆధ్యాత్మికతపై ఆమెకున్న మక్కువే ఆమెను ప్రవచనకర్తగా, మోటివేషనల్‌ కోచ్‌గా మార్చాయి. నలుగురిలో స్ఫూర్తి నింపేలా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా ఆమె చేసే ప్రసంగాలు ఎంతోమందిలో ప్రేరణ కలిగిస్తుంటాయి.
‘నేను భవిష్యత్తు కంటే విధిని ఎక్కువగా నమ్ముతా. మనం సన్మార్గంలో ముందుకెళ్లాలంటే ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం అలవర్చుకోవడం తప్పనిసరి! అలాగే ఉత్తమ పేరెంటింగ్‌తోనే పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది.. ఓపిక, స్థిరత్వం, ప్రశాంతమైన మనసు.. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఇవే కీలకం! నాలో ఇలాంటి సానుకూల దృక్పథం అలవడడానికి భగవద్గీత పఠనం, నా జీవితానుభవాలు, కుటుంబ సభ్యులందించిన ప్రోత్సాహమే కారణం..’ అంటోంది జయ. ఆయా వేదికలపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసే ఆమె.. సోషల్‌ మీడియా వేదికగా జీవితానికి సంబంధించిన విలువల్నీ బోధిస్తుంటుంది. ‘నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డ్స్‌’లో భాగంగా ‘సోషల్‌ ఛేంజ్‌’ విభాగంలో ఈ అవార్డు అందుకున్న ఆమె ఇన్‌స్టా పేజీకి కోటి మందికి పైగా ఫాలోవర్లున్నారు.


కడుపుబ్బా నవ్విస్తోంది!

శ్రద్ధా జైన్‌.. తన అసలు పేరు కంటే ‘అయ్యో శ్రద్ధ’ పేరుతోనే ఆమె భారతీయులకు సుపరిచితం. నిజానికి ఇది ఆమె స్టేజ్‌ నేమ్‌. బెంగళూరుకు చెందిన ఆమె చదువు పూర్తయ్యాక ఐటీ రంగంలో తన కెరీర్‌ని ప్రారంభించింది. అయితే తన జీవిత లక్ష్యం ఇది కాదని తక్కువ సమయంలోనే గుర్తించిన ఆమె.. ఆపై ఉద్యోగం మానేసి డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా స్థిరపడింది. తన హాస్య చతురతతో చుట్టూ ఉన్న వారిని కడుపుబ్బా నవ్వించడం శ్రద్ధకు చిన్నతనం నుంచే అలవాటు! ఈ మక్కువతోనే స్టాండప్‌ కమెడియన్‌గా తనను తాను నిరూపించుకోవాలనుకుందామె. 2016లో ఆమె చేసిన ఓ కామెడీ వీడియో రాత్రికి రాత్రే ఆమెను స్టార్‌ని చేసింది. చుట్టూ జరిగే సంఘటనలు, రోజువారీ జీవనశైలి, అనుబంధాలు, రాజకీయాలు.. వంటి అంశాలపై కామెడీ వీడియోల్ని రూపొందిస్తూ వాటిని తన యూట్యూబ్‌ ఛానల్‌ (అయ్యో శ్రద్ధ)లో పోస్ట్‌ చేస్తుంటుందామె. తన మాతృభాష కన్నడతో పాటు హిందీ, ఇంగ్లిష్‌, మరాఠీ, తుళు.. వంటి ఇతర భాషల్లోనూ కామెడీ వీడియోల్ని రూపొందిస్తుంటుంది శ్రద్ధ. ఇక 2018లో ‘కామిస్తాన్‌’ పేరుతో ఓ కామెడీ షో నిర్వహించిన ఆమె మరింతమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. సమాజ సేవలోనూ ముందుండే శ్రద్ధ ప్రస్తుతం మహిళా హక్కులపై అందరిలో అవగాహన పెంచడానికి కృషి చేస్తోంది. ఇలా సమాజాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తోన్న శ్రద్ధ ‘మోస్ట్‌ క్రియేటివ్‌ క్రియేటర్‌ ఉమన్’ విభాగంలో ‘నేషనల్‌ క్రియేటర్‌ అవార్డు’ అందుకుంది.


ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్!

మారుతోన్న కాలంతో పాటే మనమూ మారుతున్నాం.. మన కట్టూ-బొట్టులోనూ మార్పులొస్తున్నాయి. అయితే మనం ఎంతగా మారినా.. మన సంస్కృతీ సంప్రదాయాలు, విలువలు, సంప్రదాయ వస్త్రధారణను మర్చిపోకూడదంటోంది 20 ఏళ్ల జాన్వీ సింగ్‌. ఈ తరానికి చెందిన అమ్మాయే అయినా.. భారతీయత ఉట్టిపడేలా దుస్తులు ధరిస్తూ నిండుదనంతో కనిపిస్తుంటుందామె. ఎక్కువగా చీరకట్టుకే ప్రాధాన్యమిస్తూ భారతీయ ఫ్యాషన్‌ మూలాల్ని విదేశీయులకు పరిచయం చేస్తోందామె. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల్లో రూపొందించే ప్రత్యేకమైన వస్త్రాల్ని తన వీడియోలతో అందరికీ పరిచయం చేస్తోందామె. అంతేకాదు.. జాన్విలో ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే! భగవద్గీతలోని శ్లోకాలు, పవిత్ర గ్రంథాల్లోని మంచి విషయాల్ని వివరిస్తూ.. ఓ తత్త్వవేత్తలా జీవితంలోని పలు సమస్యలకు పరిష్కార మార్గాలూ చూపుతోందామె. యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా మారి యోగా పాఠాలూ నేర్పుతోన్న జాన్వి ఇన్‌స్టాకు 5.6 లక్షల మంది ఫాలోవర్లున్నారు. మరోవైపు తన స్ఫూర్తిదాయక వీడియోల్ని ‘గీతా సే గ్యాన్‌’ పేరుతో నిర్వహిస్తోన్న తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేస్తుంటుందామె. తాజా ‘నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డ్స్‌’లో భాగంగా ‘హెరిటేజ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌’ విభాగంలో ఈ పురస్కారం అందుకుందీ యంగ్‌ ఫ్యాషనర్‌. జాన్విది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్.


‘గ్రీన్‌’ వారియర్!

పర్యావరణ పరిరక్షణ.. దీని గురించి మనం రోజూ మాట్లాడుకుంటాం.. కానీ దీన్నే తన జీవిత లక్ష్యంగా మార్చుకుంది పంఖ్తీ పాండే. పీల్చే గాలి దగ్గర్నుంచి ధరించే దుస్తుల దాకా.. ప్రతిదీ పర్యావరణహితంగా ఉండాలని కోరుకునే ఆమె.. అందరికీ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడానికి ‘జీరో వేస్ట్‌ అడ్డా’ పేరుతో సోషల్‌ మీడియా వేదికను నడుపుతోంది. మన రోజువారీ జీవనశైలిలో పర్యావరణహితమైన ఎంపికలు, కిచెన్‌ వృథాని ఎరువుగా మార్చుకోవడం, ఇంట్లోనే కూరగాయల పెంపకం, ప్లాస్టిక్‌ నిర్మూలన, దానికి ప్రత్యామ్నాయాలు.. ఇలా చాలా విషయాలపై అవగాహన కల్పిస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తుంటుందామె.

‘మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల చిన్నతనం నుంచే పొదుపు మంత్రం అలవడింది. అయితే నేను గర్భిణిగా ఉన్నప్పుడు.. మనం వృథా చేసే వస్తువులు/పదార్థాల వల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో ఓ వ్యాసంలో చదివి తెలుసుకున్నా. అప్పుడే పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధ పెరిగింది. నా కూతురు పుట్టాక దీన్ని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టా..’ అంటోన్న పంఖ్తీ.. ప్రస్తుతం ఇస్రోలో ‘ఆర్‌ఎఫ్‌ మైక్రోవేవ్‌ సైంటిస్ట్’గా పనిచేస్తోంది. తాజా అవార్డుల్లో భాగంగా ‘ఫేవరెట్‌ గ్రీన్‌ ఛాంపియన్‌ అవార్డు’ను సొంతం చేసుకుందీ అహ్మదాబాద్‌ గ్రీన్‌ వారియర్.

వీరితో పాటు ప్రముఖ చెఫ్‌ కవితా సింగ్ - (బెస్ట్‌ క్రియేటర్‌ ఇన్‌ ఫుడ్‌ కేటగిరీ) , జర్నలిస్ట్‌-ట్రావెల్‌ లవర్‌ కామియా జానీ - (ఫేవరెట్‌ ట్రావెల్‌ క్రియేటర్), గాయని మైథిలీ థాకూర్ - (కల్చరల్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ ది ఇయర్), కీర్తికా గోవిందసామి - (బెస్ట్‌ స్టోరీ టెల్లర్) మొదలైన వారు సైతం ఈ అవార్డులు అందుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్