మన స్మృతికి మళ్లీ ఆ గౌరవం..!

క్రికెట్‌ అంటే కేవలం పురుషులు మాత్రమే ఆడే క్రీడ అనే సంప్రదాయాన్ని నేటి తరం అమ్మాయిలు మార్చి చూపించారు. మార్చడమే కాకుండా పురుషులతో సమానంగా ఇందులో రాణిస్తూ క్రికెట్‌ ప్రేమికులను అలరిస్తున్నారు. ఈ జాబితాలో భారత ఓపెనింగ్‌ బ్యాట్స్ఉమన్‌ స్మృతి మంధాన ముందు వరసలో ఉంటుంది. తాజాగా ఆమె 2021 సంవత్సరానికి గాను ఐసీసీ ‘ఉత్తమ మహిళా క్రికెటర్’ అవార్డు

Published : 24 Jan 2022 21:28 IST

క్రికెట్‌ అంటే కేవలం పురుషులు మాత్రమే ఆడే క్రీడ అనే సంప్రదాయాన్ని నేటి తరం అమ్మాయిలు మార్చి చూపించారు. మార్చడమే కాకుండా పురుషులతో సమానంగా ఇందులో రాణిస్తూ క్రికెట్‌ ప్రేమికులను అలరిస్తున్నారు. ఈ జాబితాలో భారత ఓపెనింగ్‌ బ్యాట్స్ఉమన్‌ స్మృతి మంధాన ముందు వరసలో ఉంటుంది. తాజాగా ఆమె 2021 సంవత్సరానికి గాను ఐసీసీ ‘ఉత్తమ మహిళా క్రికెటర్’ అవార్డు (రాచెల్ హేహో ఫ్లింట్ అవార్డు)ను అందుకుంది. అంతకుముందు 2018లో కూడా ఈ అవార్డును అందుకున్న ఆమె రెండోసారి ఈ అవార్డు అందుకున్న రెండవ మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. అంతకుముందు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఎల్లీస్‌ పెర్రీ మాత్రమే ఈ ఘనత సాధించింది. ఈ సందర్భంగా స్మృతి గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీకోసం...

* స్మృతి మంధాన 2018లో ఐసీసీ ‘ఉమన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్’ అవార్డుతో పాటు ‘వన్డే క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్’ అవార్డును సొంతం చేసుకుంది. అంతకుముందు 2007లో భారత స్టార్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి మాత్రమే ఈ అవార్డును సొంతం చేసుకుంది.

* తొమ్మిదేళ్ల వయసులోనే మహారాష్ట్ర అండర్ -15 స్క్వాడ్‌లో అర్హత సంపాదించిన స్మృతి.. పదకొండేళ్ల వయసులోనే అండర్ - 19 జట్టులో చోటు సంపాదించుకుంది.

* అండర్-19 విభాగంలో మహారాష్ట్ర జట్టు తరఫున ఆడిన ఆమె 2013లో గుజరాత్ జట్టుపై 150 బంతుల్లో 224 పరుగులు చేసింది. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా నిలిచింది.

* 2013లో తన పదహారేళ్ల వయసులో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆమె.. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడింది. ఇక తొలి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్‌పై ఆడింది.

* గులాబీ బంతితో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి రికార్డు సృష్టించింది స్మృతి మంధాన. అంతేకాదు.. ఆ మ్యాచ్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును సైతం దక్కించుకుంది. 

* దిగ్గజ క్రికెటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్ఫూర్తితో క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది స్మృతి. ఆయన్ను ప్రేరణగా తీసుకోవడం మాత్రమే కాదు.. ఆమె బ్యాటింగ్ శైలి సైతం అచ్చం దాదాని పోలినట్టే ఉంటుంది. గంగూలీ మాదిరిగానే ఎడమ చేతి వాటం బ్యాట్స్ఉమన్ ఆమె. అతనిలాగే క్రీజు వదిలి ముందుకొచ్చి సిక్స్‌లు కొట్టడం ఆమెకిష్టం. అందుకే ఆమెను ‘లేడీ గంగూలీ’ అని పిలుస్తుంటారు.

* 2021లో 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన స్మృతి 38.86 సగటుతో 855 పరుగులు చేసింది. ఇందులో ఒక శతకంతో పాటు ఐదు అర్థ శతకాలున్నాయి.

* పరిమిత ఓవర్ల క్రికెట్లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఇండియా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. అయితే ఈ రెండు విజయాల్లోనూ స్మృతి కీలక పాత్ర పోషించింది. ఒక వన్డేలో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. మరో టీ20 మ్యాచ్‌లో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

* స్మృతి ధరించే జెర్సీ నంబర్ 18. భారత పురుషుల జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా పద్దెనిమిదే. ఒకే రకమైన జెర్సీ ధరించడం మాత్రమే కాదు.. ఆటలోనూ కోహ్లీకి ఏ మాత్రం తీసిపోననేలా పరుగులు సాధిస్తోంది స్మృతి.

* తన కెరీర్‌లో 4 టెస్టులు, 62 వన్డేలు, 84 టీ20లు ఆడిన స్మృతి.. మొత్తంగా 5 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు చేసింది.

* భారత మహిళల జట్టు తరఫున వేగంగా అర్థ సెంచరీ సాధించిన రికార్డు కూడా స్మృతి పేరు మీదనే ఉంది. 2018లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆమె 25 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని