Sudha Murthy: ఏడాదికి 265 సినిమాలు.. కాశీలో షాపింగ్‌ని వదిలేశా..!

ప్రపంచంలోనే దిగ్గజ ఐటీ సంస్థ వ్యవస్థాపకుడికి భార్య ఆమె.. దేశంలోనే సంపన్న మహిళల్లో ఒకరిగా ఆమె స్థానం ఎప్పటికీ పదిలమే! అయినా ఓ సామాన్య మహిళలాగే సాదాసీదాగా ఉండడానికే ఇష్టపడతారు.

Updated : 16 Mar 2024 14:28 IST

(Photos: Instagram)

ప్రపంచంలోనే దిగ్గజ ఐటీ సంస్థ వ్యవస్థాపకుడికి భార్య ఆమె.. దేశంలోనే సంపన్న మహిళల్లో ఒకరిగా ఆమె స్థానం ఎప్పటికీ పదిలమే! అయినా ఓ సామాన్య మహిళలాగే సాదాసీదాగా ఉండడానికే ఇష్టపడతారు. డబ్బు, హోదా, పలుకుబడి ఉన్నాయన్న అహంకారం, గర్వం ఇసుమంతైనా ఆమెలో కనిపించవు. అది ఎంత గొప్ప సందర్భమైనా, మహామహులు పాల్గొనే కార్యక్రమమైనా.. సంప్రదాయ చీరకట్టులో సింపుల్‌గా కనిపించడానికే ఇష్టపడతారామె.

ఇలా ఎన్నో సద్గుణాల్ని, నిలువెల్లా నిరాడంబరతను నింపుకొన్న సేవామూర్తి సుధా మూర్తికి తాజాగా మరో ఘనత దక్కింది. భారత పార్లమెంట్‌లో ఎగువ సభ అయిన రాజ్యసభకు ఆమెకు నామినేట్‌ అయ్యారు. ప్రజా సేవే పరమావధిగా భావించే సుధ.. దేశ సేవ, ప్రజా సేవ చేసేందుకు దీన్నో వారధిగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో మిసెస్‌ మూర్తి వివిధ సందర్భాల్లో తన గురించి పంచుకొన్న కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!


ఇది నాకు డబుల్‌ సర్‌ప్రైజ్!

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణిగానే కాకుండా.. ప్రముఖ విద్యావేత్తగా, సమాజ సేవకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సుధా మూర్తి. ప్రస్తుతం ‘మూర్తి ట్రస్ట్‌’కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోన్న ఆమె.. ఈ వేదికగా గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ఎన్జీవో వేదికగా పలు అనాథాశ్రమాల్ని నెలకొల్పిన ఆమె.. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఇలా సమాజ సేవలో తనదైన ముద్ర వేసిన మిసెస్‌ మూర్తిని భారత ప్రభుత్వం 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. ఇక తాజాగా రాజ్యసభకూ నామినేట్‌ చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఆమె సేవల్ని కొనియాడుతూ, ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలని ఆకాంక్షించారు. అయితే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ రోజునే తనను రాజ్యసభకు ఎంపీగా నామినేట్‌ చేయడం మరింత ఆనందంగా ఉందంటున్నారు సుధ.

‘మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన రావడం నాకు డబుల్ సర్‌ప్రైజ్‌. చాలా ఆనందంగా ఉంది. ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిజానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఏనాడూ పదవులు కోరుకోలేదు. ప్రభుత్వం నన్ను ఎందుకు ఎంపిక చేసిందో తెలియదు. అయితే, దేశానికి సేవ చేసేందుకు ఇదో కొత్త బాధ్యత అని నేను నమ్ముతున్నా..’ అంటూ తన నిరాడంబరతను మరోసారి చాటుకున్నారీ సేవామూర్తి!


సేవ వైపు అడుగులు..!

చిన్నతనం నుంచీ భగవంతుడి సేవలోనే తరించిన తనకు తన కూతురి ద్వారానే ‘మానవ సేవే మాధవ సేవ’ అనే సిద్ధాంతం అవగతమైందని ఓ సందర్భంలో పంచుకున్నారు సుధ.
‘ప్రజలకు సేవ చేయడంలో నాకు ప్రశాంతత దొరుకుతుంది. ఆ సంతృప్తి ముందు అన్నీ దిగదుడుపే అనిపిస్తుంది. నిజానికి ఈ విషయం నా కూతురే నాకు తెలియజేసింది. ‘నీకు జీవితంలో ఎన్నో విషయాలు తెలుసు.. నువ్వెంతో అనుభవజ్ఞురాలివి. అయితే అంతిమంగా నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావ్‌? నీ జీవితానికంటూ సార్థకత ఉండాలంటే ఏం చేయాలనుకుంటున్నావ్‌?’ అని ఓసారి నా కూతురు నన్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్నే నన్ను ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ప్రారంభించేలా చేసింది. ప్రస్తుతం ఎన్నో సేవా కార్యక్రమాల్లో తరించేలా చేస్తోంది..’ అంటూ సేవ వైపు తన అడుగులు పడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు సుధ.

1996లో తాను స్థాపించిన ‘ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌’ ద్వారా తన సేవా కార్యక్రమాలను రోజురోజుకీ విస్తరింపజేస్తున్నారామె. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, పరిశుభ్రత, కళలు, సంప్రదాయం.. వంటి అంశాలను ప్రోత్సహిస్తూ.. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు సాగుతోందీ సంస్థ. ఈ సేవా కార్యక్రమాలతో పాటు విపత్తు సమయంలోనూ ప్రజలకు వివిధ రకాలుగా సేవలందిస్తోందీ ఎన్జీవో.


ఆలిగా.. ఇల్లాలిగా!

‘పురుషుడి విజయం వెనుక మహిళ పాత్ర ఉంటుందం’టారు. ఇందుకు సుధామూర్తే ప్రత్యక్ష నిదర్శనం. తన భర్త నారాయణ మూర్తి ‘ఇన్ఫోసిస్‌ సంస్థ’ పెట్టాలన్న ఆలోచన చేసినప్పుడు ఆయనపై ఉన్న నమ్మకంతో మారు మాట్లాడకుండా ముంబయికి మకాం మార్చారామె. అంతేకాదు.. ఆ సమయంలో తన భర్త చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా తాను దాచుకున్న పది వేల రూపాయలు పెట్టుబడిగా అందించి గృహలక్ష్మి అనిపించుకున్నారు. ‘మూడేళ్ల పాటు ఇంటి ఖర్చులు, అవసరాలన్నీ తానే చూసుకుంటానని, మీరు మాత్రం సంస్థ అభివృద్ధి పైనే పూర్తి ధ్యాస పెట్టాలం’టూ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు మిసెస్‌ మూర్తి.

1960లో పురుషాధిపత్యం ఎక్కువగా ఉన్న సమయంలోనే ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించి చదువుపై తనకున్న మక్కువను చాటుకున్నారామె. ఇలా తన చదువును వృథా కానీయకుండా.. ఇంటి ఆర్థిక అవసరాల కోసం ‘వాల్‌చంద్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌’లో సీనియర్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. మరోవైపు ఇంటి పనుల్నీ బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగారామె. అంతటితో ఆగకుండా ఇన్ఫోసిస్‌ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రోగ్రామర్‌గా కూడా మారారు సుధ. ఇలా భర్తకు చేదోడువాదోడుగా నిలిచే భార్యగా, ఇంటిని నడిపించే ఇల్లాలిగా.. రెండు విధాలుగా సక్సెసయ్యారు మిసెస్‌ మూర్తి.


సంప్రదాయ చీరకట్టుతో..!

పుట్టుకతోనే సింప్లిసిటీని పుణికిపుచ్చుకున్నారేమో అనిపిస్తుంది సుధామూర్తిని చూస్తే! కాలేజీలో చదివే రోజుల నుంచే సంప్రదాయ చీరకట్టుకే విలువనిస్తూ వస్తోన్న సుధ.. నేటికీ అదే ఆహార్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత ఎదిగినా మనం పాటించే విలువలే మనమేంటో చెబుతాయన్నట్లుగా.. తాను ప్రస్తుతం కోట్లకు పడగెత్తినా, దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా నిలిచినా.. సాదాసీదాగా ఉండడానికే ప్రాధాన్యమిస్తారామె. ఏ సందర్భమైనా, మహామహులు పాల్గొనే వేడుకైనా చక్కటి చీరకట్టు, నుదుటన బొట్టు, మెడలో నల్లపూసలు, సిగ.. ఇలా భారతీయత తొణికిసలాడే ఆహార్యం ఆమెకు మాత్రమే సాధ్యమేమో అనిపించక మానదు!


కాశీలో షాపింగ్‌ని వదిలేశా..!

‘కాశీలో పుణ్యస్నానం ఆచరించి.. మనకు నచ్చిన వస్తువులు వదిలేయడం సంప్రదాయం. అలా నా విషయంలో నేను షాపింగ్‌ని వదిలేశా.. అందులోనూ ముఖ్యంగా చీరల్ని! అలా అప్పట్నుంచి ఇప్పటిదాకా చీరలు కొనలేదు. ఉన్న వాటినే రిపీట్‌ చేస్తుంటా.. మరీ ముఖ్యమైన వస్తువుల్ని మాత్రమే కొంటుంటా.. చీరకట్టులోనే నాకు ఎంతో సౌకర్యవంతంగా అనిపిస్తుంటుంది. అందుకే ఇతరుల మాటలు, మన గురించి వారు ఏం ఆలోచిస్తున్నారన్న విషయాల గురించి నేను పట్టించుకోను.. నాకు కంఫర్టబుల్‌గా ఉండే వాటినే ఎంచుకుంటా..’ అంటూ తన సింప్లిసిటీని చాటుకుంటారు సుధ.


365 రోజులు.. 265 సినిమాలు!

సుధామూర్తి అంటే తన నిరాడంబరత, సేవా గుణమే గుర్తొస్తాయి. ఇలా తను నిరంతరాయంగా సేవలోనే తరించినా.. తనకంటూ కాస్త సమయం కేటాయించుకుంటారామె. ఈ క్రమంలోనే తనకు నచ్చిన అంశాలపై దృష్టి పెడతానని ఓ సందర్భంలో పంచుకున్నారు సుధ.

‘ఓ సోషల్‌ వర్కర్‌గా, రచయిత్రిగానే నేను మీకు తెలుసు. కానీ నా గురించి మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. నేనో పెద్ద సినిమా లవర్‌ని! నా హోమ్‌ థియేటర్‌లో 500లకు పైగా సినిమా డీవీడీలుంటాయి. సినిమా అంటే చాలామంది కథ, హీరో, హీరోయిన్‌.. వీటినే గమనిస్తారు. కానీ నేను అలా కాదు. వాటితో పాటు డైరెక్షన్‌, ఎడిటింగ్‌.. వంటి అన్ని కోణాల్ని పరిశీలిస్తూ సినిమాను ఎంజాయ్‌ చేస్తా. నిజానికి నేను సినిమా జర్నలిస్ట్‌ని కావాల్సింది! సినిమాలంటే నాకు అంత పిచ్చి మరి! సంవత్సరం మొత్తమ్మీద 265 సినిమాలు చూస్తా..’ అంటూ సినిమాలపై తనకున్న మక్కువను ఓ సందర్భంలో పంచుకున్నారామె.


అబ్బాయిలతో మాట్లాడకూడదన్నారు!

హుబ్లీ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదివిన మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందిన సుధ తన కళాశాల జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను ఓ సందర్భంలో పంచుకున్నారు. ‘నేను ఇంజినీరింగ్‌ చదవాలని నిర్ణయించుకున్నప్పుడు మా అమ్మమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అలా చేస్తే మా కమ్యూనిటీలో నన్నెవరూ పెళ్లిచేసుకోరని భయపెట్టారు. కానీ నేను నా నిర్ణయానికే కట్టుబడి హుబ్లీ ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరాను.

ఈ నేపథ్యంలో కేవలం నా మెరిట్ మాత్రమే చూసి నాకు సీటిచ్చిన ఆ కళాశాల ప్రిన్సిపల్‌ నాకు మూడు షరతులు విధించారు. అప్పుడు ఆ కళాశాలలో 599 మంది అబ్బాయిలు ఉండేవారు. నేను ఒక్కర్తే అమ్మాయిని. నేను శారీలోనే కాలేజీకి రావాలని, క్యాంటీన్‌ వైపు అసలు వెళ్లకూడదని, ఇక కళాశాలలోని అబ్బాయిలతో మాట్లాడకూడదని నిబంధనలు విధించారు. చీర కట్టుకోవడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మొదటి షరతు ప్రకారం రోజూ నేను చీరలోనే కాలేజీకి వెళ్లేదాన్ని. ఇక కళాశాలలోని క్యాంటీన్‌ ఫుడ్‌ ఏ మాత్రం బాగుండదు. కాబట్టి రెండో నిబంధన ప్రకారం అటువైపు వెళ్లాల్సిన అవసరమే రాలేదు. ఇక మూడోది అబ్బాయిలతో మాట్లాడడం.. కాలేజీలో చేరిన ఏడాది వరకు నేను అబ్బాయిలతో మాట్లాడలేదు. కానీ నాకు ఫస్టియర్‌లో టాప్‌ ర్యాంక్‌ రావడంతో రెండో సంవత్సరం నుంచి వాళ్లే నా దగ్గరకు వచ్చి మాట్లాడేవారు’ అని నవ్వేస్తారు సుధ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్