Updated : 22/04/2022 16:06 IST

పెళ్లి తర్వాత ఇలా బాధపడద్దు..!

పురుషులతో పోలిస్తే మహిళల జీవనశైలిలో నిరంతరం మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు వారు రకరకాల బాధ్యతలను పోషిస్తుంటారు. శారీరక మార్పులకు లోనవుతుంటారు. ముఖ్యంగా పెళ్లి మహిళల జీవన గమనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అప్పటి వరకు తల్లిదండ్రుల చాటున ఉన్న వారి జీవితం భర్త, అత్తమామలు, ఆడపడుచుల నీడలోకి మారిపోతుంది. ఈ క్రమంలో తమను తాము నిర్వచించుకోవడానికి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటుంటారు. దాంతో కొంతమంది పెళ్లి తర్వాత ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని చింతిస్తుంటారు. కాబట్టి, పెళ్లికి ముందే ఇలాంటి అంశాలపై అవగాహన పెంచుకోవడం మంచిదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా...

స్వేచ్ఛ లేదు!

పెళ్లైన తర్వాత చాలామంది మహిళలు తమకు దక్కాల్సిన స్వేచ్ఛ లభించడం లేదని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం పెళ్లి తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే భర్త అనుమతి తీసుకోవాల్సి రావడం. ఉదాహరణకు ఆఫీసు పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, సొంతంగా ఏదైనా  కొనుక్కోవాలనుకున్నప్పుడు భర్త అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఉమ్మడి కుటుంబంలో ఉండే వారికి ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు ధరించే డ్రస్‌ నుంచి స్నేహితులతో షాపింగ్‌ వెళ్లడం వరకు ఇటు భర్తతో పాటు అత్తమామల అనుమతి తీసుకోవాలని చెబుతుంటారు. ఇవి అందరికీ వర్తించకపోయినా సమాజంలో తరచుగా జరుగుతుంటాయి. ఒకవేళ ఎదురుతిరిగి తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆ బంధంలో పొరపొచ్ఛాలు వస్తుంటాయి.

పని మనిషిని కాదు..!

మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ పురుషాధిక్య ప్రపంచమే రాజ్యమేలుతోంది. చాలామంది అమ్మాయిలంటే కేవలం వంట చేయడం, ఇల్లు తుడవడం, భర్తకు పనిచేసి పెట్టాలనే భావనతో మాత్రమే ఉంటారు. అయితే ఇంటి పనుల్లో కూడా పాలుపంచుకునే అబ్బాయిలు ఉన్నప్పటికీ వారి శాతం చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి, ఇలాంటి భావజాలం ఉన్న అబ్బాయి మీకు తారసపడితే పెళ్లికి ముందే రిజెక్ట్‌ చేయడం మంచిదంటున్నారు నిపుణులు.

టైమంతా దానికే..!

పెళ్లి తర్వాత భార్యభర్తలిద్దరికీ బాధ్యతలు పెరుగుతాయి. మహిళలకు ఇవి ఎక్కువగా ఉంటాయి. అటు పని చేసుకుంటూ ఇటు పిల్లలను చూసుకోవడం వారికి కత్తిమీద సాము లాగా మారిపోతుంటుంది. అయితే కొంతమంది పురుషులు మహిళలతో సమానంగా కుటుంబ బాధ్యతలు తీసుకోకుండా చెడు అలవాట్లతో వారిని ఇబ్బంది పెడుతుంటారు. దాంతో చేసేదేమీ లేక మహిళలే కుటుంబాన్ని చక్కబెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. మరోవైపు భర్తను దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా కొంతకాలం తర్వాత సమయమంతా అతనిని సరైన మార్గంలో పెట్టడానికే సరిపోయింది.. నాకంటూ ఏమీ మిగల్లేదని పశ్చాత్తాపపడుతుంటారు.

స్నేహితులు దూరమవుతున్నారా..?

పెళ్లి తర్వాత చాలామంది మహిళల జీవితం భర్తే సర్వస్వంగా మారుతుంటుంది. దీనివల్ల వారి జీవితంలో కొన్ని బంధాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ జాబితాలో మొదటి స్థానం స్నేహితులదే ఉంటుంది. పెళ్లి తర్వాత మహిళలకు ఉండే కొన్ని బాధ్యతల వల్ల స్నేహితులతో బయటకు వెళ్లడానికి కుదరకపోవచ్చు. కానీ ఏవో కుంటి సాకులు చెబుతున్నారని భావించి క్రమంగా స్నేహితులు తమ జాబితా నుంచి వీరిని తొలగిస్తుంటారు. అయితే ప్రారంభంలో ఈ విషయం అంత ఇబ్బందిగా అనిపించనప్పటికీ కాలక్రమేణా కొంతమంది తమ కష్టసుఖాలు పంచుకోవడానికి స్నేహితులు ఉంటే బాగుండని చింతిస్తుంటారు.

విడిపోవాల్సి వస్తే..

మహిళలు రిలేషన్‌షిప్‌లో పురుషుల కంటే ఎక్కువగా కనెక్ట్‌ అవుతారు. ఈ క్రమంలో భర్త, పిల్లలతో తమ అనుబంధాన్ని దృఢపరుచుకుంటారు. ఇలాంటి సమయంలో అనుకోని పరిస్థితుల వల్ల ఇద్దరూ విడిపోతే మహిళలకు చాలా కష్టంగా మారుతుంది. కానీ, పురుషులు మాత్రం తొందరగా మరో భాగస్వామి కోసం వెతుకులాట ప్రారంభిస్తుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే వారి మనోవేదన వర్ణనాతీతం.

సో.. చూశారుగా.. పెళ్లయ్యాక సాధారణంగా ఎదురయ్యే కొన్ని పరిస్థితులు. అయితే అందరి విషయంలోనూ ఇలాగే జరుగుతుందని లేదు. అలాగని జరగదని కూడా చెప్పలేం. అందుకే సాధ్యమైనంతవరకు పెళ్లికి ముందే ఇలాంటి అంశాల గురించి అవగాహన పెంచుకోవాలి. ఒకవేళ  భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించుకోవాలి. అందుకు ముందు నుంచే సంసిద్ధంగా ఉండాలి. అదేవిధంగా పెళ్లికి ముందే ఇలాంటి విషయాల గురించి కాబోయే జీవిత భాగస్వామితో వివరంగా చర్చించాలి. నిజంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఇద్దరూ ఒక అంగీకారానికి రావాలి. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా మన కాళ్ల పైన మనం నిలబడడం మాత్రం ముఖ్యమని గుర్తుంచుకోండి. అప్పుడే పెళ్లి తర్వాత ఏ విషయంలోనూ పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండదు.

మరి పెళ్లి తర్వాత ఏ విషయంలో అయినా బాధపడాల్సిన పరిస్థితులు మీకు ఎదురయ్యాయా? అలాంటి సందర్భాల్లో మీరేం చేశారు? మీ అనుభవాలను  contactus@vasundhara.net ద్వారా పంచుకోండి. అవి మరింతమంది మహిళలకు మార్గదర్శకంగా ఉంటాయి.

పెళ్లి తర్వాత ఏ విషయంలో అయినా బాధపడాల్సిన పరిస్థితులు మీకు ఎదురయ్యాయా?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని