అమ్మమ్మ చిట్కాలతో.. అత్తాకోడళ్ల వ్యాపారం.. లక్షల ఆదాయం!

అవసరమే సరికొత్త ఆలోచనలకు నాంది పలుకుతుందంటారు. అలాంటి అవసరమే నిధి దువాను వ్యాపారంలోకి అడుగుపెట్టేలా చేసింది. ఒకానొక సమయంలో జుట్టు సమస్యల్ని ఎదుర్కొన్న ఆమె.. బామ్మల కాలం నాటి చిట్కాలతో వీటిని దూరం చేసుకుంది.

Published : 22 Mar 2024 11:49 IST

(Photos: Instagram)

అవసరమే సరికొత్త ఆలోచనలకు నాంది పలుకుతుందంటారు. అలాంటి అవసరమే నిధి దువాను వ్యాపారంలోకి అడుగుపెట్టేలా చేసింది. ఒకానొక సమయంలో జుట్టు సమస్యల్ని ఎదుర్కొన్న ఆమె.. బామ్మల కాలం నాటి చిట్కాలతో వీటిని దూరం చేసుకుంది. ఈ చిట్కాలనే మరింతమందికి చేరువ చేయాలన్న లక్ష్యంతో తన అత్తగారితో కలిసి సహజసిద్ధమైన హెయిర్‌ ఆయిల్ వ్యాపారాన్ని ప్రారంభించింది. తమ చుట్టూ ఉన్న వారి జుట్టు సమస్యల్ని దూరం చేయడంతో పాటు.. మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తోన్న తమ వ్యాపార ప్రయాణం గురించి నిధి పంచుకొన్న కొన్ని విశేషాలు మీకోసం..!

నిధి దువాది గురుగ్రామ్‌. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన ఆమె.. పెళ్లయ్యాకా ఉద్యోగాన్ని కొనసాగించింది. ఆపై కొడుకు పుట్టాకా కొన్నాళ్ల పాటు జాబ్‌ చేసిన ఆమె.. తన కొడుకులో ప్రవర్తనా లోపాలున్నాయని గుర్తించి ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆరేళ్ల పాటు తన కొడుకు ఆలనా పాలనలోనే నిమగ్నమైంది.

బామ్మ చిట్కాతో పరిష్కారం!

అప్పుడే అనిపించిందామెకు.. తనకంటూ కాస్త సమయం కూడా కేటాయించుకోలేకపోతున్నానని, తన అభిరుచులపై దృష్టి పెట్టలేకపోతున్నానని! అయితే అంతలోనే దేశంలో కరోనా విజృంభించడంతో కొవిడ్‌ బారిన పడిందామె. దీంతో విపరీతంగా జుట్టు రాలడం గుర్తించింది. ఈ సమస్యకు పరిష్కారంగా చిన్నప్పుడు తన బామ్మ తన కోసం తయారుచేసిన హెయిర్‌ ఆయిల్‌ రెసిపీని ప్రయత్నించింది. ఈ ప్రయత్నమే తన జీవితాన్ని మలుపు తిప్పిందంటోంది నిధి.

‘స్కూల్లో చదువుకొనే రోజుల్లో ఆదివారం వచ్చిందంటే చాలు.. బామ్మ చేత తలకు నూనె పెట్టించుకునేదాన్ని.. మర్దన చేయించుకునేదాన్ని. అందుకే చిన్నప్పుడు నా కురులు పొడవుగా ఉండేవి. ఇక కాలేజీ చదువులు, ఆపై ఉద్యోగంలో చేరడంతో ఈ పద్ధతి పాటించేందుకు సమయమే దొరకలేదు. దాంతో జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇక కరోనా బారిన పడడంతో జుట్టు రాలే సమస్య మరింత పెరిగింది. దీన్నుంచి బయటపడేందుకు మా బామ్మ నా చిన్నప్పుడు తయారుచేసిన హెయిర్‌ ఆయిల్‌ రెసిపీని తిరిగి ప్రయత్నించాలనుకున్నా. ఈ ఆయిల్‌ను ఎలా తయారుచేయాలో మా అమ్మ, అత్తయ్యను అడిగి తెలుసుకున్నా. ఈ నూనె వాడిన కొన్ని రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గి.. ఒత్తుగా పెరగడం గమనించా..’ అని చెబుతోంది నిధి.

13 మూలికలతో..!

అయితే కొవిడ్‌ కారణంగా నిధికి ఎదురైన జుట్టు సమస్యలే తన ఇరుగుపొరుగు ఇళ్లలో ఉన్న వారికీ తలెత్తాయి. దాంతో వారికీ ఇదే నూనెను వాడమని సలహా ఇచ్చిందామె. అలా ఈ నూనెకు క్రమంగా ఆదరణ పెరగడంతో దీన్నే వ్యాపారంగా మలచుకోవాలని నిర్ణయించుకుంది నిధి. మరోవైపు తన అత్తగారు రజినికి వ్యాపారం చేయాలన్న తపన ఎప్పట్నుంచో ఉంది.. పైగా తనకూ బామ్మల కాలం నాటి సహజసిద్ధమైన నూనెలు, జుట్టు సంరక్షణ చిట్కాలపై అవగాహన ఉండడంతో.. సరిగ్గా ఏడాది క్రితం తన అత్తగారితో కలిసి ‘నిధీస్‌ గ్రాండ్‌మా సీక్రెట్‌’ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది.

‘జుట్టు సంరక్షణ కోసం నా ఫ్రెండ్స్‌, ఇతర కుటుంబ సభ్యుల కోసం నేను అందించిన నూనెకు మంచి స్పందన వచ్చింది. దాంతో అందరూ ఈ నూనెను ఆన్‌లైన్‌లో విక్రయించమని ప్రోత్సహించారు. అలా వాట్సప్‌, ఇన్‌స్టా వేదికగా నా హెయిర్‌ ఆయిల్‌ దాదాపు 70 వేల మందికి చేరువైంది. నెలకు సుమారు రూ. 50 లక్షల ఆదాయం వచ్చేది. వంద శాతం సహజసిద్ధంగా తయారుచేసే ఈ నూనెలో 13 రకాల మూలికల్ని వాడతాం. కరివేపాకు, మందార పువ్వులు, కలబంద, ఉసిరి, భృంగరాజ్‌ మొక్క వేర్లు.. వంటివన్నీ కొబ్బరి నూనెలో వేసి రెండు గంటల పాటు మరిగిస్తాం.. ఆపై రాత్రంతా దీన్ని చల్లారనిచ్చి కాటన్‌ వస్త్రంతో వడకట్టి.. బాటిల్స్‌లో నింపి విక్రయిస్తాం.. జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు చుండ్రు, ఇతర జుట్టు సమస్యల్ని తగ్గించడంలో ఈ నూనె సమర్థంగా పనిచేస్తుంది..’ అంటున్నారు నిధి.

ఇంటి ప్రోత్సాహం కావాలి!

ఏడాది క్రితం హెయిర్‌ ఆయిల్‌తో మొదలుపెట్టిన తన వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తున్నారు నిధి. ఎలాంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్స్‌ ఉపయోగించకుండా.. సహజసిద్ధమైన మూలికలతో హెయిర్‌ ఆయిల్‌, హెయిర్ కండిషనర్‌, షాంపూ, స్కాల్ప్‌ స్క్రబ్‌.. వంటి ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక మహిళలకు ఉపాధీ కల్పిస్తున్నారామె.

‘ఎంచుకున్న రంగంలో రాణించాలంటే తపనతో పాటు ఇంటి నుంచి తగిన ప్రోత్సాహమూ మనకు అందాలి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని! ఎందుకంటే వ్యాపారంలో రాణించడమంటే అంత సులభం కాదు.. నా భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. ఈ సృష్టిలో ప్రతి మహిళకూ ఆర్థిక స్వేచ్ఛ అవసరమని నా భావన! అందుకే నా వ్యాపారం ద్వారా మరింతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నా. లక్ష్యమేదైనా ధైర్యంగా అడుగు ముందుకేసినప్పుడే విజయం సాధించగలం.. కలల్ని నెరవేర్చుకోగలం..’ అంటూ తన మాటలతోనూ సాటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు నిధి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్