అందుకే లక్షల మంది వీళ్ల వీడియోలు చూస్తున్నారు..!

సోషల్‌ మీడియా వచ్చినప్పట్నుంచి ఎవరెంత దూరంలో ఉన్నా పక్కనే ఉన్నట్లనిపిస్తోంది.. తమలో ఉన్న ట్యాలెంట్‌ని ప్రదర్శించడానికీ ఇదే వేదికవుతోంది. అలా తమలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలతో దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు ఈతరం అమ్మాయిలు.

Updated : 26 Dec 2023 18:11 IST

(Photos: Instagram)

సోషల్‌ మీడియా వచ్చినప్పట్నుంచి ఎవరెంత దూరంలో ఉన్నా పక్కనే ఉన్నట్లనిపిస్తోంది.. తమలో ఉన్న ట్యాలెంట్‌ని ప్రదర్శించడానికీ ఇదే వేదికవుతోంది. అలా తమలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలతో దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు ఈతరం అమ్మాయిలు. కోట్ల, లక్షల మంది సబ్‌స్క్రైబర్లతో యూట్యూబ్స్‌ క్వీన్స్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. అలా ఈ ఏడాది తమ వీడియోలతో ఎక్కువ మంది ప్రేక్షకుల్ని అలరించిన కొందరు యూట్యూబ్‌ రాణులు, వాళ్ల ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..!

‘లిప్‌ సింక్‌’తో పాపులారిటీ!

జీవితం విసిరే సవాళ్లను అధిగమించినప్పుడే మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. యూట్యూబర్‌ నీతూ బిష్త్‌ కథా ఇందుకు మినహాయింపు కాదు. తాను కూడా చిన్న వయసు నుంచే పలు కఠిన సవాళ్లను ఎదుర్కొంది. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో జన్మించిన ఆమె.. తన 11 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది. దీంతో ముగ్గురు ఆడపిల్లల్ని పెంచే బాధ్యత ఆమె తల్లిపైనే పడింది. ఈ క్రమంలో తన తల్లి పడే కష్టాల్ని దగ్గర్నుంచి గమనించిన నీతూ.. బాగా చదువుకొని తన తల్లి కష్టాల్ని తీర్చాలనుకుంది. చదువు పూర్తయ్యాక తన అక్కతో కలిసి ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను ప్రారంభించింది. అయినా నష్టాలే ఎదుర్కోవాల్సి వచ్చిందామె. ఈ క్రమంలోనే ఇతర అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడే తనలోని లిప్‌ సింక్‌ ట్యాలెంట్‌ని గుర్తించింది నీతూ. ఆపై వివిధ రకాల అంశాలపై లిప్‌ సింక్‌ వీడియోలు రూపొందిస్తూ వాటిని సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేయడం ప్రారంభించింది. ఇలా క్రమంగా పాపులారిటీని సంపాదించుకున్న ఆమె.. ఆపై తన బాయ్‌ఫ్రెండ్‌ లఖన్‌తోనూ పలు ఫన్నీ వీడియోలు రూపొందిస్తూ.. వాటిని యూట్యూబ్‌(Neetu Bisht Rawat)లో అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం బ్యూటీ, ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌, రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలు, పండగలు.. ఇలా బోలెడన్ని అంశాలపై వీడియోలు, వెబ్‌ సిరీస్‌లు రూపొందిస్తూ.. లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది నీతూ. తన ఇష్టసఖుడు లఖన్‌నే పెళ్లి చేసుకున్న ఆమె.. రిలేషన్‌షిప్‌ గోల్స్‌కి సంబంధించిన వీడియోల్నీ పోస్ట్‌ చేస్తుంటుంది. ప్రస్తుతం ఆమెకు యూట్యూబ్‌లో 2 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారు.


వివక్షను జయించి..!

ఆడపిల్లలపై వివక్ష ఎక్కువగా ఉన్న హరియణా రాష్ట్రంలో పుట్టి పెరిగింది షాలూ కిరార్‌. ఆమెకు జిమ్నాస్టిక్స్‌ అంటే చిన్న వయసు నుంచే మక్కువ! ‘ఆడపిల్లలకు ఇలాంటి ఆటలెందుక’ని అందరూ దెప్పి పొడిచినా.. తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అందులో ఆరితేరింది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ పతకాలు కొల్లగొట్టింది. ఇలా ఒక్కో గెలుపుతో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూ పోయిన ఆమె.. తన కుటుంబ బాధ్యతనంతా ఒంటరిగా చూసుకునే స్థాయికి చేరుకుంది. అయితే ఇదే సమయంలో ‘ఇండియాస్‌ గాట్‌ ట్యాలెంట్‌ షో’ గురించి తెలుసుకుంది షాలూ. స్టంట్స్‌, డ్యాన్స్‌ కలగలిపి ప్రదర్శించే ఆ డ్యాన్స్‌ షోకు ఎంపికైందామె. తన ట్యాలెంట్‌ను అక్కడా నిరూపించుకున్న ఆమె.. ఆ షో సీజన్‌-9లో రన్నరప్‌గా నిలిచింది. హర్యాణా ఫోక్‌ డ్యాన్సర్‌గానూ షాలూకు పేరుంది. ఈ క్రమంలోనే తన డ్యాన్స్‌ మెలకువలతో కవర్‌ సాంగ్స్‌ రూపొందిస్తూ, సొంతంగా పలు డ్యాన్స్‌ వీడియోలు క్రియేట్‌ చేస్తూ.. వాటిని తన యూట్యూబ్‌ ఛానల్‌(Shalu Kirar)లో పోస్ట్‌ చేయడం ప్రారంభించిందామె. ఇలా తాను పోస్ట్‌ చేసే ప్రతి డ్యాన్స్‌ వీడియోలోనూ జానపద వేషధారణలో ఆకట్టుకుంటుందీ ఫోక్‌ డ్యాన్సర్‌. ఇప్పటికి 2 వేలకు పైగా డ్యాన్స్‌ వీడియోల్ని, స్టంట్‌ వీడియోల్ని రూపొందించిన ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు 88 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లున్నారు.


ఎక్స్‌ప్రెషన్స్‌ అదుర్స్‌!

తన అసలు పేరు కంటే తన యూట్యూబ్‌ ఛానల్‌ ‘ది థాట్‌ఫుట్‌ గర్ల్‌’ అనే పేరుతోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది జార్ఖండ్‌ బ్యూటీ మోనాలిశా ఘోష్‌. తన ముఖకవళికలతోనే అన్ని రకాల హావభావాలు పలికించడంలో ఆమె దిట్ట. తనలోని ఈ ప్రత్యేక ట్యాలెంట్‌ను రోజువారీ జీవితంలో వివిధ సందర్భాల్లో మనకు కలిగే ఆలోచనలకు జోడిస్తూ ఫన్నీ వీడియోలు రూపొందిస్తుంటుంది ఘోష్‌. ఈ క్రమంలోనే ‘పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌లో టీచర్‌ ఆలోచనలు ఎలా ఉంటాయి?’, ‘షాపింగ్‌కి వెళ్లినప్పుడు అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారు?’, ‘పండగలకు సంబంధించి చిన్న నాటి జ్ఞాపకాలు’, ‘ఓవైపు జంక్‌ ఫుడ్‌ తీసుకుంటూనే మరోవైపు ఆరోగ్యం గురించి మనం ఏం ఆలోచిస్తాం?’, ‘ఫ్రెండ్స్‌తో ప్రయాణాలు’.. ఇలాంటి విభిన్న వీడియోల్ని ముఖకవళికలతోనే ప్రదర్శిస్తూ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది ఘోష్‌. ఇప్పటికే 500లకు పైగా వీడియోల్ని తన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసిన ఈ యూట్యూబ్‌ క్వీన్‌ ఛానల్‌కు 76 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.


అంజు.. ది డ్రాయింగ్‌ టీచర్‌

కొన్ని బొమ్మల్ని చూస్తే.. వీటిని ఇంత అందంగా ఎలా గీశారా? అన్న ఆలోచన వస్తుంది. కానీ ఎంత కఠినమైన బొమ్మలైనా.. సులభంగా గీస్తూ, ఆ నైపుణ్యాల్ని ఔత్సాహికులకు నేర్పిస్తూ డ్రాయింగ్ టీచర్‌గా మారిపోయింది అంజు. ఒక్కసారి చూస్తే చాలు.. ఎలాంటి కఠినమైన బొమ్మైనా ఇట్టే గీసేయగల నైపుణ్యాలు ఈమె సొంతం. ఈ మెలకువలతోనే విభిన్న బొమ్మలు గీస్తూ, ఇతరులకు నేర్పిస్తూ.. రూపొందించిన వీడియోల్ని తన యూట్యూబ్‌ ఛానల్‌ ‘అంజూ డ్రాయింగ్‌ షాట్స్‌’ పేరుతో ప్రారంభించిన తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేస్తోందామె. మ్యాజిక్‌ పెన్స్‌తో బొమ్మలు గీయడం, శాండ్‌ ఆర్ట్స్‌.. వంటి నైపుణ్యాల్ని ప్రదర్శిస్తూ.. 56 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది అంజూ. ప్రస్తుతం ఆమె యూట్యూబ్‌ ఛానల్‌లో 3800కు పైగా డ్రాయింగ్‌ వీడియోలున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్