శీతాకాలంలో క్యారట్ హల్వా.. ఎందుకు తినాలో తెలుసా?

ఇంట్లో క్యారట్లు మిగిలిపోతే క్యారట్‌ హల్వా చేసుకుంటాం.. సులభంగా, ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ హల్వాతో తీపి తినాలన్న కోరికను తీర్చుకునే వారూ ఎంతోమంది! ఇది రుచిలోనే కాదు.. ఆరోగ్యంలోనూ మేటి అని చెబుతున్నారు నిపుణులు.

Updated : 13 Nov 2023 17:04 IST

ఇంట్లో క్యారట్లు మిగిలిపోతే క్యారట్‌ హల్వా చేసుకుంటాం.. సులభంగా, ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ హల్వాతో తీపి తినాలన్న కోరికను తీర్చుకునే వారూ ఎంతోమంది! ఇది రుచిలోనే కాదు.. ఆరోగ్యంలోనూ మేటి అని చెబుతున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా చలికాలంలో క్యారట్‌ హల్వా తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరతాయని సలహా ఇస్తున్నారు. శరీరానికి శక్తినివ్వడం దగ్గర్నుంచి రోగనిరోధక శక్తిని పెంచే దాకా, బరువు తగ్గించడంతో మొదలుపెట్టి చర్మ ఆరోగ్యాన్ని కాపాడే దాకా.. ఇలా ఈ సీజన్‌కు, క్యారట్‌ హల్వాకు అవినాభావ సంబంధం ఉందట! మరి, ఇంతకీ చలికాలంలో క్యారట్‌ హల్వా తినడం వల్ల చేకూరే ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..

రోగనిరోధక శక్తికి..!

చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుందన్న విషయం తెలిసిందే! ఇందుకు కారణం ఈ కాలంలో సూర్యకాంతి శరీరానికి తగలక విటమిన్‌ ‘డి’ లోపం తలెత్తడమే అని పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. తద్వారా ఇన్ఫెక్షన్లు సులభంగా దాడి చేస్తాయి. మరి, ఈ సమస్య తలెత్తకుండా ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే క్యారట్‌ హల్వా తినమని చెబుతున్నారు నిపుణులు. క్యారట్లలో ఉండే బీటా కెరోటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇక ఈ స్వీట్‌ తయారీలో మనం వాడే పాలు, యాలకులు, బాదంపప్పులు, జీడిపప్పుల్లో ఉండే విటమిన్లు రోగనిరోధక శక్తిని ప్రేరేపించే కారకాలుగా ఉపయోగపడతాయి.

బరువు అదుపులో..!

చలి వాతావరణం కారణంగా వ్యాయామం చేయకపోవడం, నీళ్లు తక్కువగా తాగడం, వాతావరణంలో మార్పుల వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం.. ఇలా ఎన్నో అంశాలు శీతాకాలంలో బరువు ఎక్కువగా పెరగడానికి దోహదం చేస్తాయి. అంతేకాదు.. ఈ కాలంలో వెచ్చదనం కోసం శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఈ శక్తి కోసం క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో బరువు పెరుగుతాం. మరి, ఇలా ఈ కాలంలో పెరిగిన బరువును తగ్గించుకోవాలన్నా, బరువును అదుపులో ఉంచుకోవాలన్నా క్యారట్‌ హల్వా మంచి ఆహారం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే క్యారట్స్‌లోని ఫైబర్‌ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండి ఆకలేయదు. అలాంటప్పుడు ఇతర చిరుతిళ్లు, నూనె సంబంధిత పదార్థాల పైకి మనసు మళ్లదు. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

న్యాచురల్‌ మాయిశ్చరైజర్‌గా..!

చల్లటి వాతావరణం కారణంగా చర్మం తేమను కోల్పోయి పొడిబారిపోవడం మనకు తెలిసిందే. తద్వారా దురద, మంట, చర్మం ఎరుపెక్కడం.. వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక ఇలా పొడిబారిన చర్మానికి తేమను అందించడానికి మాయిశ్చరైజర్లు, లోషన్లు.. వంటివి వాడుతుంటారు. అయితే ఇలాంటివన్నీ పొడి చర్మం సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం చూపుతాయే తప్ప లోలోపలి నుంచి చర్మాన్ని తేమగా మార్చవు. కానీ క్యారట్‌ హల్వా చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. క్యారట్లలోని విటమిన్ ‘ఎ’ ఇందుకు దోహదం చేస్తుందట! ఇది నిర్జీవమైపోయిన చర్మ కణాల్ని తొలగించి కొత్త కణాలు ఏర్పడేందుకు సహకరిస్తుంది. తద్వారా చర్మం తేమను, తద్వారా మెరుపును సంతరించుకుంటుంది.

క్యాన్సర్‌ ముప్పు తగ్గించడానికి..

క్యాన్సర్ ముప్పు తగ్గించడానికి కూడా క్యారట్లు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకు క్యారట్లలో ఉండే కొన్ని రకాల ఫైటోకెమికల్సే కారణమట! వీటిలోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు శరీరంలో క్యాన్సర్‌ను కలిగించే ఫ్రీ రాడికల్స్‌ని విచ్ఛిన్నం చేసి ట్యూమర్లు ఏర్పడకుండా చేస్తాయి. తద్వారా క్యాన్సర్‌ ముప్పుకు దూరంగా ఉండచ్చని వారు సూచిస్తున్నారు.
వెచ్చదనాన్ని పంచుతుంది!

శీతాకాలంలో ఏది తిన్నా వేడివేడిగా తినాలని కోరుకుంటాం. అంతేకాదు.. శరీరానికి వెచ్చదనాన్ని పంచే పదార్థాలనూ మన మెనూలో చేర్చుకుంటాం. అలాంటి పదార్థాల్లో క్యారట్‌ హల్వా ముందుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ స్వీట్‌ తయారీలో వాడే నెయ్యి, పాలు, నట్స్‌.. వంటి పదార్థాల్లో క్యాల్షియం, ప్రొటీన్లు, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని పంచడానికి తోడ్పడతాయి. అంతేకాదు.. చలి వాతావరణం కారణంగా పెరిగే బద్ధకాన్ని దూరం చేసి తక్షణ శక్తిని, ఉత్సాహాన్ని అందించే సూపర్‌ రెసిపీ క్యారట్‌ హల్వానే అంటున్నారు నిపుణులు.

బెల్లంతో చేస్తే మేలు!

సాధారణంగా స్వీట్‌ అనగానే చక్కెరే గుర్తొస్తుంది. చాలామంది క్యారట్‌ హల్వా తయారుచేసే క్రమంలో చక్కెరనే ఉపయోగిస్తుంటారు కూడా! కానీ చక్కెరకు బదులుగా బెల్లంతో ఈ హల్వా తయారుచేస్తే అటు రుచి పెరగడంతో పాటు ఇటు ఆరోగ్యం కూడా రెట్టింపవుతుందంటున్నారు నిపుణులు.

మరి, చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించి క్యారట్‌ హల్వా ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం..!

కావాల్సినవి

క్యారట్‌ తురుము - కప్పు

వెన్నతో కూడిన పాలు - కప్పు

బెల్లం తురుము - పావు కప్పు

నెయ్యి - టేబుల్‌ స్పూన్

జీడిపప్పు, బాదంపప్పులు, పిస్తా, కిస్‌మిస్‌ - గుప్పెడు

యాలకుల పొడి - టీస్పూన్

తయారీ

ముందుగా స్టౌపై ప్యాన్‌ పెట్టి నెయ్యి కరిగించుకోవాలి. ఇందులో క్యారట్‌ తురుము వేసి పచ్చిదనం పోయేంతవరకు వేయించుకోవాలి.

ఆపై ఇందులో పాలు పోసి మరగనివ్వాలి. ఈ క్రమంలో మిశ్రమం అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కాస్త దగ్గరపడుతున్నప్పుడు బెల్లం పొడి వేసి బాగా కలపాలి.

బెల్లం కరిగి మిశ్రమం చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి.

ఆపై ఇందులో యాలకుల పొడి, నట్స్‌ వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత కాస్త నెయ్యి వేసి ఒకసారి కలిపి దించేసి సర్వ్‌ చేసుకుంటే హెల్దీ, టేస్టీ క్యారట్‌ హల్వా రడీ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్