Published : 17/12/2021 18:02 IST

Couple Talk: ఆ అంతరం వయసుకే.. అనుబంధానికి కాదు!

‘వయసు కాదు.. మనసు ముఖ్యం..’ తాము ఎంచుకునే జీవిత భాగస్వామిలో ఇప్పుడు చాలామంది కోరుకుంటోన్న లక్షణమిదే! అందుకే జంటల మధ్య ఎన్నేళ్ల ఎడం ఉన్నా నచ్చితే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. నిజానికి పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కంటే ప్రేమ వివాహాల్లోనే ఏళ్ల కొద్దీ వయోభేదం కనిపిస్తుంటుంది. ఇందుకు కొన్ని సెలబ్రిటీ జంటలే ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ఇలాంటి జనరేషన్‌ గ్యాప్‌తో జంటల మధ్య అన్యోన్యత లోపిస్తుందని, చూడముచ్చటైన జంటలా కనిపించలేరనేది చాలామంది భావన. కానీ ఇది పూర్తిగా అపోహే అంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. దాంపత్య బంధానికి, వయసుకు ముడిపెట్టకుండా ఒకరితో ఒకరు సర్దుకుపోతూ, కొన్ని అలవాట్లు అలవర్చుకుంటే వయోభేదం ఇద్దరి మధ్య అంతరాన్ని పెంచకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

ప్రియాంక చోప్రా-నిక్‌ జొనాస్‌, కత్రినా కైఫ్‌ - విక్కీ కౌశల్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ - కరీనా కపూర్‌.. ఈ సెలబ్రిటీ జంటల మధ్య ఏళ్ల కొద్దీ వయోభేదం ఉన్నా ఎంతో అన్యోన్యంగా మెలుగుతూ నేటి జంటలకు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతుంటారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. దాంపత్య బంధం దృఢంగా ఉండాలంటే కావాల్సింది ప్రేమే కానీ.. వయసులో అంతరాలు కాదు అని!

ఎవరి మనసులో ఏముందో?!

జంటల మధ్య గరిష్ఠంగా మూడేళ్ల దాకా వయోభేదం ఉండచ్చన్నది చాలామంది భావన. కానీ ఇంతకంటే ఎక్కువ గ్యాప్‌ ఉంటే మాత్రం వాళ్లిద్దరినీ వేర్వేరు తరాలకు/జనరేషన్లకు చెందిన జంటలుగా పరిగణిస్తుంటారు. తద్వారా ఒకరి ఆలోచనలతో మరొకరు మమేకం కాకపోవడం వల్ల ఇద్దరి మధ్య గొడవలొస్తాయని, ఇలాంటి బంధం కలకాలం నిలవదని అనుకునే వారూ లేకపోలేదు. కానీ జంటల మధ్య ఏళ్ల కొద్దీ వయోభేదం ఉన్నా.. ఒకరి ఆలోచనల్ని మరొకరు గౌరవించుకున్నంత కాలం ఇద్దరి మధ్య అనుబంధం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం, మనసులోని ఆలోచనలు పంచుకోవడం, భవిష్యత్‌ లక్ష్యాల గురించి చర్చించుకోవడం, సాధ్యాసాధ్యాలను బట్టి వాటితో ఏకీభవిస్తూ ప్రోత్సహించుకోవడం.. వంటివన్నీ ఇందులో కీలకమే అంటున్నారు. కాబట్టి ఎదుటివారు ఏమనుకుంటారోనని సందేహించకుండా ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉంటే అనుబంధాన్ని మరింత దృఢం చేసుకోవచ్చు.

ఎవరేమనుకున్నా ‘డోంట్‌ కేర్’!

మనం ఏ పనిచేసినా అందులో తప్పులు వెతకడమే ఈ సమాజం పని! ఈ క్రమంలో- వయసులో అంతరం ఎక్కువగా ఉన్న భాగస్వామిని ఎంచుకుంటే..  ‘అంకుల్‌ని పెళ్లి చేసుకున్నావేంటి?’, ‘ఈ ఆంటీ తప్ప నీకు ఇంకెవరూ దొరకలేదా?’ అంటూ ప్రశ్నిస్తుంటుంది. దీంతో మనసు చివుక్కుమంటుంది. ఈ ప్రతికూల ఆలోచనలతో విసుగెత్తిపోయి.. ఆ కోపం భాగస్వామిపై చూపిస్తుంటాం. దాంపత్య బంధంలో కలతలు రేగడానికి ఇదీ ఓ కారణమే! కాబట్టి నిజంగా ఒకరికొకరు నచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు.. ఎవరేమనుకున్నా, మూడో వ్యక్తి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూసినా, ఇతరులు మీ భాగస్వామిని తక్కువ చేసి మాట్లాడినా.. ఇవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్లడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. నిజానికి ప్రతికూల పరిస్థితుల్లో మీ భాగస్వామికి ఇలా మీరు అండగా నిలిచారని తెలిస్తే.. వారికి మీపై ప్రేమ మరింతగా పెరుగుతుందనడంలో సందేహమే లేదు.

‘కేర్‌ టేకర్‌’ అవతారమెత్తండి!

వయోభేదం ఎక్కువగా ఉన్న జంటల మధ్య అన్యోన్యత బలపడాలంటే ఆరోగ్యం విషయంలోనూ ఒకరికొకరు తోడుగా ఉండాలంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. భార్యాభర్తల్లో ఎక్కువ వయసున్న వారికి ఏదో ఒక ఆరోగ్య సమస్య తలెత్తడం, వారిని చూసుకునే భారం చిన్న వయసులోనే మీపై పడడం.. వంటివి జరగచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చిరాకు పడకుండా, ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీరు మీ భాగస్వామికి అండగా నిలవాలి. తద్వారా ఇద్దరి మధ్య అన్యోన్యత మరింత బలపడుతుంది. అంతేకాదు.. ముందు ముందు మీకూ ఇలాంటి అనారోగ్యాలు తలెత్తినా.. అందరికంటే ముందు తనే మీకు కేర్‌ టేకర్‌గా మారతారన్న విషయం మాత్రం మర్చిపోవద్దు.

అభిరుచులే కలిపి ఉంచుతాయి!

దంపతుల మధ్య ఏళ్ల కొద్దీ వయోభేదం ఉండడం వల్ల ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు, ఆసక్తులు పూర్తి భిన్నంగా ఉంటాయనుకుంటారు చాలామంది. కానీ వాటిలో కొన్ని ఉమ్మడిగానూ ఉండచ్చు కదా! అలాంటి వాటిని వెతికి వెలికి తీయమంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. ఇద్దరికీ సాహసకృత్యాల్లో పాల్గొనడమంటే ఇష్టముండచ్చు. అలాంటప్పుడు తీరిక దొరికినప్పుడల్లా అడ్వెంచరస్‌ ట్రిప్స్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. లేదూ.. మా ఇద్దరికీ ఆహారమంటే ఇష్టమంటారా? అయితే.. ఒకరికి నచ్చిన వంటకాలు మరొకరు చేసి.. ప్రేమగా తినిపించుకుంటే సరి! ఇలా ఆలోచిస్తే.. జంటల్లో ఉమ్మడి ఆసక్తులు/అభిరుచులు బోలెడన్ని ఉంటాయి. నిజానికి ఇలా ఇద్దరూ కలిసి మనసుకు నచ్చిన పని చేయడం వల్ల సంతోషం రెట్టింపవుతుంది. జంటల్ని కలిపి ఉంచడానికి ఇదీ ఓ టానిక్కు లాంటిదే అంటున్నారు నిపుణులు.

బలవంతం చేయద్దు!

వయోభేదంతో సంబంధం లేకుండా దంపతుల మధ్య అన్యోన్యతను రెట్టింపు చేయడంలో శృంగారానిదీ కీలక పాత్రే! అయితే వయసు పెరిగే కొద్దీ ఈ ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఇందుకు హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, శారీరక సమస్యలు, ఇతర సవాళ్లు ప్రధాన కారణాలుగా చెప్పచ్చు. అయితే వీటిని అధిగమించి లైంగికాసక్తిని పెంచుకోవాలంటే పైన చెప్పిన నాలుగు విషయాలూ వర్తిస్తాయి. అలాగే ఎదుటివారిని బలవంత పెట్టకుండా అర్థం చేసుకోవడమూ ముఖ్యమే! తద్వారా ఇద్దరి మధ్య ప్రేమ పెరిగి.. సాన్నిహిత్యం అలవడుతుంది. కొంతమంది విషయంలో ఇది వర్కవుట్‌ కాకపోవచ్చు.. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. మీకున్న సమస్యను వారికి వివరించి అవసరమైతే కౌన్సెలింగ్‌ దాకా వెళ్లచ్చు.

ఇలా మీ అన్యోన్య దాంపత్యం మీ పిల్లల పైనా సానుకూల ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.

అంటే.. వీటన్నింటిని బట్టి మనకు అర్థమయ్యే విషయమేంటంటే.. దంపతుల మధ్య అన్యోన్యతకు కావాల్సింది ప్రేమే కానీ.. వయోభేదం ముఖ్యం కాదని! మరి, ఈ విషయంలో మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని