Sania Mirza: పెళ్లి, విడాకులు.. రెండూ కఠినమైనవే!

స్పోర్ట్స్‌ కపుల్‌ సానియా మీర్జా-షోయబ్ మాలిక్‌ విడిపోయారంటూ గత కొంత కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే! అయితే చాలాసార్లు తమ మాటలు, చేతలతో ఈ వార్తలను పరోక్షంగానే ఖండిస్తూ వచ్చిందీ జంట.

Updated : 20 Jan 2024 19:16 IST

(Photos: Instagram)

స్పోర్ట్స్‌ కపుల్‌ సానియా మీర్జా-షోయబ్ మాలిక్‌ విడిపోయారంటూ గత కొంత కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే! అయితే చాలాసార్లు తమ మాటలు, చేతలతో ఈ వార్తలను పరోక్షంగానే ఖండిస్తూ వచ్చిందీ జంట. కానీ షోయబ్‌ తాజాగా మూడో పెళ్లి చేసుకోవడం, ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే.. పెళ్లి, విడాకులకు సంబంధించి ఇటీవలే సానియా ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టిన ఓ ఆసక్తికర పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ఇది పరోక్షంగా సూచిస్తోంది. మరి, ఇంతకీ సానియా పెట్టిన పోస్ట్‌లో ఏముంది? నిజంగానే సానియా-షోయబ్‌ విడిపోయారా? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో షోయబ్‌ మాలిక్‌ పెళ్లికి సంబంధించిన వార్తలు, ఫొటోలే దర్శనమిస్తున్నాయి. పాకిస్థాన్‌ నటి సనా జావేద్‌ను ఆయన తాజాగా వివాహం చేసుకున్నాడు. షోయబ్‌కు ఇది మూడో పెళ్లి. 2002లో ఆయేషా సిద్ధిఖీని పెళ్లి చేసుకున్న ఈ క్రికెటర్‌.. 2010లో ఆమెతో విడిపోయాడు. అదే ఏడాది భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను వివాహమాడాడు షోయబ్‌. అప్పట్లో వీళ్ల పెళ్లి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. పెళ్లి తర్వాత దుబాయ్‌లో స్థిరపడ్డ ఈ జంటకు.. 2018లో ఇజాన్‌ మీర్జా మాలిక్‌ అనే బాబు పుట్టాడు.

పద్నాలుగేళ్ల అనుబంధం!

తమ సుదీర్ఘ వివాహ బంధంలో వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగిందీ జంట. పుట్టిన రోజులు, ప్రత్యేక సందర్భాలు, వెకేషన్స్‌, తమ కొడుకుతో గడిపిన క్షణాల్ని ఫొటోల్లో బంధిస్తూ.. అందరితో పంచుకునే వారీ సెలబ్రిటీ కపుల్‌. ఇదిలా ఉంటే.. గత రెండేళ్లుగా వీళ్లిద్దరూ విడిపోయారంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. వీటికి తోడు.. షోయబ్‌ తన ట్విట్టర్‌ బయో నుంచి సానియా పేరు తొలగించడం, సానియా కూడా షోయబ్‌తో దిగిన పలు ఫొటోల్ని సోషల్‌ మీడియా నుంచి తొలగించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. అయినా ఇవన్నీ నిజం కాదంటూ తమ మాటలు, చేతలతో పలుమార్లు కొట్టిపారేసే ప్రయత్నం చేసిందీ జంట. ఈ క్రమంలో గతేడాది ఇజాన్‌ ఐదో పుట్టినరోజు వేడుకల్ని వీళ్లిద్దరూ దుబాయ్‌లో కలిసి సెలబ్రేట్‌ చేయడం, ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో పాటు.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘ది మీర్జా మాలిక్‌ షో’ పేరుతో ఓ టీవీ షోను నిర్వహించడంతో.. వీళ్ల విడాకుల వార్తలు ఊహాగానాలే అనుకున్నారు ఫ్యాన్స్‌. దీంతో ఈ రూమర్లకు తెరపడింది.

కష్టమైనదే ఎంచుకోవాలి!

అయితే తాజాగా షోయబ్‌ తన మూడో పెళ్లికి సంబంధించిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ఫ్యాన్స్‌ ఒక్కసారిగా షాకయ్యారు. అలాగే సానియా-షోయబ్‌ విడాకుల వార్తలు మరోసారి తెరమీదకొచ్చాయి. వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నాకే షోయబ్‌ మూడో పెళ్లి చేసుకున్నట్లు అందరూ భావిస్తున్నారు. కాగా, ఇటీవలే పెళ్లి, విడాకులపై సానియా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది. షోయబ్‌ మూడో పెళ్లికి కొన్ని రోజుల ముందు పెట్టిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరలవుతోంది. ఈ క్రమంలో ‘జీవితంలో కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడే సక్సెసవ్వగలం’ అనే అర్థం వచ్చేలా ఉన్న ఓ పాపులర్‌ కొటేషన్‌ని పోస్ట్‌ చేసింది సానియా.

‘పెళ్లి కఠినమైనదే.. విడాకులూ కఠినమైనవే.. వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి..

లావుగా ఉన్నా కష్టమే.. అలాగని ఫిట్‌గా మారడమూ కష్టమైన పనే.. వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి..

అప్పు చేసినా కష్టమే.. అలాగని ఆర్థిక క్రమశిక్షణ పాటించడమూ కష్టమే.. వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి..

మాట్లాడినా కష్టమే.. మాట్లాడకపోయినా కష్టమే.. వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి..

జీవితంలో ముందుకు సాగడం అంత సులభం కాదు.. ఈ క్రమంలో మనం వేసే ప్రతి అడుగూ కష్టమైనదే! కానీ మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది.. ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే అంతగా సక్సెస్‌ కాగలుగుతాం. కాబట్టి తెలివిగా మీ మార్గాన్ని ఎంచుకోండి..’ అంటూ రాసుకొచ్చింది సానియా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్