Published : 15/03/2022 15:32 IST

తొలి ఉద్యోగం.. తెలుసుకోండివి!

తొలి ఉద్యోగం ఎవరికైనా ప్రత్యేకమే! ఆర్థిక స్వేచ్ఛ సాధించామని, ఇక ప్రతి విషయంలో ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదని, వచ్చే ఆదాయంతో తమకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చని.. ఇలా ఎవరి ఆలోచనలు వారికుంటాయి. అయితే ఈ మోజులో పడిపోయి.. కొన్ని ముఖ్యమైన విషయాల్ని నిర్లక్ష్యం చేశామంటే కెరీర్‌ ప్రారంభంలోనే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే మొదటి ఉద్యోగంలో చేరే ముందు/చేరాక కొన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటే కెరీర్‌లో విజయవంతంగా దూసుకుపోవచ్చంటున్నారు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..!

నిత్య విద్యార్థిగా..!

చదువుకునే సమయంలో ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని ఆరాటపడుతుంటాం.. తీరా జాబ్‌ వచ్చాక ఇక చదువుతో పనిలేదనుకుంటాం..! కానీ ఉద్యోగం వచ్చినా నిత్య విద్యార్థిగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చుట్టూ ఉన్న విషయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, ప్రస్తుతం చేస్తోన్న ఉద్యోగంలో ఎదగాలంటే మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం.. వంటివన్నీ ముఖ్యమే! ఈ క్రమంలో మీ పని సమయాలను బట్టి షార్ట్‌ టర్మ్‌ కోర్సులు నేర్చుకోవచ్చు.. అలాగే ఆయా విషయాల గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌ని ఆశ్రయించచ్చు.. పరిజ్ఞానం పెంచుకోవడానికి పుస్తకాలు చదవచ్చు. ఇలా మీరు ఏది చేసినా పరోక్షంగా మీ ఉద్యోగ ఎదుగుదలకు దోహదం చేసేలా చూసుకోవడం ఉత్తమం.

కట్టూ-బొట్టూ ఇలా!

‘చదువు పూర్తై ఉద్యోగం వచ్చింది.. ఇక యూనిఫాం గోల ఉండదు’ అనుకుంటారు చాలామంది. ఆఫీస్‌లో ఏ డ్రస్‌ వేసుకున్నా, ఎలా రడీ అయినా తమను అడిగే వారు ఉండరనుకుంటారు. అదే పొరపాటు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పని ప్రదేశంలో యూనిఫాం ఉండకపోవచ్చు.. కానీ హుందాగా డ్రస్సింగ్‌ వేసుకోవడం, చూడచక్కగా తయారవడం తప్పనిసరి. అదే మీ సభ్యతను, సంస్కారాన్ని ఎదుటివారికి తెలియజేస్తుంది. కాబట్టి మరీ మోడ్రన్‌గా ఉండే దుస్తులు కాకుండా.. మన సంస్కృతిని ప్రతిబింబించేలా నిండుగా ఉన్న దుస్తులు ఎంచుకోవాలి. ఒకవేళ వెస్ట్రన్‌ ఎంచుకున్నా.. మీకు నప్పినవి, మిమ్మల్ని హుందాగా చూపించే అవుట్‌ఫిట్స్‌కి ప్రాధాన్యమివ్వాలి. అయితే కొన్ని కార్పొరేట్‌ కంపెనీల్లో బ్లేజర్‌ తరహా డ్రస్సింగ్‌ ఉంటుంది. మీ కంపెనీలోనూ అలాంటి నియమనిబంధనలుంటే వాటిని ఫాలో అవడం మంచిది.

అవన్నీ వదిలిపెట్టండి!

తొలి ఉద్యోగంలో చేరే ముందు ఎంత ఉత్సాహంగా ఉంటామో.. అంత నెర్వస్‌నెస్‌ కూడా ఉంటుంది. కొత్త వాతావరణం.. అక్కడ పని ఎలా ఉంటుందో, కొలీగ్స్‌ నాతో కలిసిపోతారో లేదో, నాకంటే వాళ్లకు ఎక్కువ నైపుణ్యాలుంటాయేమో.. ఇలాంటి సందేహాలతో మనసు ఉక్కిరిబిక్కిరవుతుంటుంది. ఏదో తెలియని భయం ఆవహిస్తుంది.. కొత్త వారితో మమేకమవడానికి సిగ్గు-బియడం అడ్డొస్తాయి. నిజానికి ఇవే మనల్ని ఉద్యోగంలో కుదురుకోకుండా చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా వదిలిపెట్టి సహోద్యోగులతో చెలిమి పెంచుకోమంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ప్రత్యేక నైపుణ్యాలుంటాయి. వాటిని గుర్తించి స్వీయ నమ్మకం పెట్టుకుంటే కెరీర్‌లో రాణించచ్చంటున్నారు.

నిర్లక్ష్యం వద్దు!

ఎవరైనా సరే.. ఉద్యోగం చేసేది అంతిమంగా ఆదాయం కోసమే! అయితే తొలి ఉద్యోగం ద్వారా వచ్చిన తొలి సంపాదన మనలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. అంతేకాదు.. నా డబ్బు, నా ఇష్టం, నేనెలాగైనా ఖర్చు పెట్టుకుంటా.. అన్న నిర్లక్ష్య ధోరణి కూడా కొంతమందిలో ఉంటుంది. దీన్ని మొదట్లోనే సరిదిద్దుకోకపోతే భవిష్యత్తు కోసం డబ్బును వెనకేసుకోలేం. కాబట్టి తొలి నెల సంపాదన నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలి. అవసరమున్న వాటికి ఖర్చు పెట్టుకుంటూ.. అనవసరమైనవి తగ్గించుకోవాలి. తద్వారా అలా దాచుకున్న డబ్బుతో భవిష్యత్తులో ఇల్లు/స్థలం/బంగారం.. వంటి ఆస్తుల్ని కొనుక్కోవచ్చు. ఆర్థికంగా వెనకబడకుండా, డబ్బు సమస్యలు రాకుండా ఈ ముందస్తు ఆలోచనలే మనల్ని కాపాడతాయని గుర్తుపెట్టుకోండి.

‘బ్యాలన్స్‌’ నేర్చుకోండి!

ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కెరీర్‌లో స్థిరపడ్డాకే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఒకటి లేదా రెండేళ్లు ఉద్యోగం చేశాకే వివాహం చేసుకుంటామని తమ తల్లిదండ్రులతో తేల్చి చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో అటు ఉద్యోగం చేయడం, ఇటు ఇంటిని చక్కదిద్దుకోవడం, పిల్లల బాధ్యతలు చూసుకోవడం.. ఇవన్నీ సమతులం చేసుకోవడం అంత సులభం కాదు. కాబట్టి వృత్తిపరంగా మీరు కెరీర్‌ ప్రారంభించిన తొలి నాళ్ల నుంచే ఇంటిని-పనిని సమన్వయం చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఈ క్రమంలో ఇంటి పనుల్లో మీ అమ్మగారికి చేదోడు వాదోడుగా ఉంటూనే.. మరోవైపు ఉద్యోగం చేయండి. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌కు సంబంధించిన చిట్కాలేవైనా తెలుసుకోవాలనుకుంటే.. మీ అమ్మగారిని, సోదరీమణుల్ని, ఇతర కుటుంబ సభ్యుల్ని అడగచ్చు. ఇలా ముందు నుంచే ఈ విషయంలో ఓ స్పష్టత, అవగాహన ఉంటే.. ఆ తర్వాత ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. తద్వారా కెరీర్‌లోనూ రాణించచ్చు.

అలాగే ఉద్యోగం చేసే క్రమంలో సవాళ్లను స్వీకరించడం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం.. వంటివీ ముఖ్యమే! కెరీర్‌లో దూసుకుపోవాలంటే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా.. ఈ అంశాలన్నీ కీలకమే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని