తోట పని చేస్తూ చదువుకుంది.. ఇప్పుడు టీచరైంది!

చెయ్యి పట్టి ముందుకు నడిపించాల్సిన నాన్న చిన్నప్పుడే తన దారి తాను చూసుకుంటే.. పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంది. తల్లితో కలిసి యాలకుల తోటకు పనికి వెళ్లింది. అయినా చదువును నిర్లక్ష్యం చేయలేదామె. ‘నీకు చదువెందుకే తల్లీ.. పెళ్లి చేసుకో’ అని అంటున్నా అవేవీ పట్టించుకోకుండా పట్టుదలతో ముందుకెళ్లింది.

Updated : 28 Jul 2021 20:30 IST

Image for Representation

చెయ్యి పట్టి ముందుకు నడిపించాల్సిన నాన్న చిన్నప్పుడే తన దారి తాను చూసుకుంటే.. పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంది. తల్లితో కలిసి యాలకుల తోటకు పనికి వెళ్లింది. అయినా చదువును నిర్లక్ష్యం చేయలేదామె. ‘నీకు చదువెందుకే తల్లీ.. పెళ్లి చేసుకో’ అని అంటున్నా అవేవీ పట్టించుకోకుండా పట్టుదలతో ముందుకెళ్లింది. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీల్లాంటి ఉన్నత చదువులు అభ్యసించింది. ఇప్పుడు హైస్కూల్‌ టీచర్‌గా పిల్లలకూ తన జ్ఞానాన్ని పంచుతోంది. ఆమే కేరళకు చెందిన 28 ఏళ్ల సెల్వమరి. తన స్ఫూర్తిదాయక జీవితంతో అందరి మన్ననలు అందుకుంటోన్న ఈ చదువుల తల్లి కథేంటో మనమూ తెలుసుకుందాం రండి.

హైస్కూల్‌ టీచర్‌గా!

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలైనా, ఇతర పోటీ పరీక్షలైనా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడమంటే అంత సులభమేమీ కాదు. అందులోనూ పనికెళుతూ పుస్తకాలు పట్టుకునే వాళ్లకైతే మరీ కష్టం. కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది సెల్వమరి. కేరళలోని చోట్టుపారా గ్రామానికి చెందిన ఆమె ఇటీవల విడుదలైన పీఎస్‌సీ పరీక్షా ఫలితాల్లో సివిల్‌ పోలీస్ ఆఫీసర్‌గా ఎంపికైంది. అయితే ఆ ఉద్యోగంలో చేరడానికి ఆసక్తి చూపలేదామె. 2017 పీఎస్‌సీ పరీక్షా ఫలితాల్లోనూ విజయం సాధించిన ఈ చదువుల తల్లి గతేడాదే హైస్కూల్‌ టీచర్‌గా అపాయింట్‌మెంట్‌ లెటర్‌ తీసుకుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితమే ఇడుక్కి జిల్లాలోని వంచివాయల్‌ ప్రభుత్వ హైస్కూల్‌లో టీచర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

తల్లి కష్టాన్ని చూడలేక!

సెల్వమరి తండ్రి చిన్నప్పుడే ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో ఆమెతో పాటు మరో ఇద్దరు కూతుళ్ల బాధ్యతలన్నీ తల్లి సెల్వమ్‌ భుజాల మీదే పడ్డాయి. యాలకుల తోటలో దినసరి కూలీగా పనిచేస్తూ ఆ వచ్చిన మొత్తంతో తన కుటుంబాన్ని పోషించసాగింది. అయితే తల్లి ఒంటరిగా కష్టపడడం చూడలేకపోయిన సెల్వమరి కూడా యాలకుల తోటలో పనికి వెళ్లేది. సెలవు రోజుల్లో, సమయం దొరికినప్పుడల్లా తల్లితో కలిసి తోట పనికి వెళ్లడం అలవాటు చేసుకుంది. అయితే చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. చోట్టుపారా, మురిక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత తమిళనాడులో ప్లస్‌ టూ చదివింది. తిరువనంతపురంలోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకుంది.

చదువు ఆపేద్దామనుకున్నా!

మలయాళం, ఇంగ్లిష్‌ భాషలపై పెద్దగా పట్టులేకపోవడంతో కాలేజీ రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది సెల్వమరి. ‘నాకు మలయాళం సరిగ్గా రాదు. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం కూడా అంతంతే..! అయితే నా డిగ్రీ సబ్జెక్టులన్నీ మలయాళం లేదా ఇంగ్లిష్‌ భాషల్లోనే ఉండేవి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా. మలయాళం సరిగ్గా రాదనే కారణంతో నా తోటి విద్యార్థులు కూడా నన్ను వెక్కిరించేవారు. దీంతో ఒక్కోసారి చదువు ఆపేసి ఇంటికెళదామనిపించేది. అదే సమయంలో యాలకుల తోటలో అమ్మ పడిన కష్టాలు నా కళ్లముందు మెదిలేవి. వాటి నుంచి ఎలాగైనా ఆమెను బయటపడేయాలని ముందుకే అడుగేశాను. మలయాళం, ఇంగ్లిష్‌ భాషలు నేర్చుకోవడానికి మరింత శ్రమపడ్డాను’ అని తాను పడిన కష్టాలను గుర్తుకు తెచ్చుకుందీ చదువుల తల్లి.

యూజీసీ నెట్‌లోనూ!

డిగ్రీ తర్వాత ఎమ్మెస్సీ పట్టా అందుకున్న సెల్వమరి.. ఆ తర్వాత కుమ్లీలోని ఎంజీ యూనివర్సిటీ సెంటర్‌ నుంచి బీఈడీ పూర్తి చేసింది. ఆపై తిరువనంతపురంలోని థైక్వాడ్‌ గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి ఎంఈడీ, ఎం.ఫిల్‌ కోర్సులను పూర్తిచేసింది. వీటితో పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌ కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే యూజీసీ నెట్‌ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం తనకు ఇష్టమైన గణితంలో పీహెచ్‌డీ కూడా చేస్తోంది. భవిష్యత్‌లో సివిల్‌ సర్వీసెస్‌ అధికారిణిగా ప్రజలకు సేవ చేయాలనుకుంటోందీ సూపర్‌ వుమన్‌.

రాజ్‌భవన్‌ నుంచి ఆహ్వానం!

కష్టాలకు కుంగిపోకుండా పట్టుదలతో ఉన్నత చదువులు అభ్యసించింది సెల్వమరి. పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ఆమె ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ కూడా ఈ చదువుల తల్లి గురించి తెలుసుకున్నారు. ఫోన్‌ ద్వారా  అభినందనలు తెలిపారు. రాజ్‌భవన్‌కు రావాలని ఆహ్వానం కూడా పంపారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు, నెటిజన్లు సెల్వమరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్