వేసవిలోనూ పెదాలు పొడిబారుతుంటే..!

చలికాలంలో శీతల వాతావరణం, గాలిలోని తేమ కారణంగా పెదాలు పొడిబారిపోయి.. అక్కడి చర్మం పొలుసులుగా ఊడిపోవడం మనలో చాలామందికి అనుభవమే! అయితే కొంతమందికి వేసవిలోనూ ఈ సమస్య తలెత్తుతుంటుంది. అందుకు వాతావరణంతో పాటు....

Published : 26 Feb 2023 10:04 IST

చలికాలంలో శీతల వాతావరణం, గాలిలోని తేమ కారణంగా పెదాలు పొడిబారిపోయి.. అక్కడి చర్మం పొలుసులుగా ఊడిపోవడం మనలో చాలామందికి అనుభవమే! అయితే కొంతమందికి వేసవిలోనూ ఈ సమస్య తలెత్తుతుంటుంది. అందుకు వాతావరణంతో పాటు అనేక కారణాలున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. కాబట్టి అవేంటో తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎండను తట్టుకుంటూ అధరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఎండాకాలంలో పెదాలు ఎందుకు పగులుతాయి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడచ్చు?

అసలు కారణాలివే!

ఎండాకాలంలో పెదాలు పొడిబారిపోయి పగలడానికి వాతావరణంతో పాటు మనం చేసే కొన్ని పొరపాట్లే కారణమంటున్నారు నిపుణులు.

వేసవిలో వేడికి శరీరం డీహైడ్రేట్ అయిపోవడం సహజమే! దీనికి తోడు నీళ్లు సరిగ్గా తాగకపోతే దాని ప్రభావం ఆరోగ్యం పైనే కాదు.. చర్మం పైనా పడుతుంది. దీంతో పెదాలు పగలడం గమనించచ్చు. కొంతమందిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.

ఎండ ప్రభావం పెదాలపై పడడం వల్ల కూడా అవి పొడిబారిపోతాయి. ముఖ్యంగా సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేస్తాయి. సున్నితంగా ఉండాల్సిన పెదాల చర్మాన్ని మందంగా, అట్టలు కట్టినట్లుగా మారుస్తాయి.

వేసవిలోనూ అధరాల ఆరోగ్యానికి లిప్‌బామ్ ఉపయోగించడం చాలామందికి అలవాటే! అయితే నాణ్యత లేని లిప్‌బామ్ కూడా ఇలా పెదాలు పొడిబారిపోవడానికి ఓ కారణం అంటున్నారు నిపుణులు. వీటి తయారీలో వాడే రసాయనాల వల్లే ఇలా జరుగుతుందట!

కొంతమందికి పదే పదే నాలుకతో పెదాల్ని అద్దే అలవాటుంటుంది. నిజానికి మన నోటిలోని లాలాజలంతో పెదాల్ని ఇలా తేమగా మార్చుకుంటున్నామని అనుకుంటాం.. కానీ ఈ అలవాటు అధరాల వద్ద ఉండే చర్మాన్ని పొడిబారుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇదే అలవాటు ఎక్కువ కాలం పాటు కొనసాగితే పెదాల చర్మంపై ఈస్ట్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుందట!

ఇలా మృదువుగా మార్చుకోవచ్చు!

ఎండ వేడిని తట్టుకుంటూ పెదాల వద్ద చర్మం తేమను సంతరించుకోవాలంటే ముందుగా చేయాల్సిన పని.. నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా లభించే పండ్లు, కాయగూరలు తినడం.. దాహం వేసినా, వేయకపోయినా ఈ చిట్కాలు పాటిస్తే కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

బయటి నుంచి తెచ్చుకున్న లిప్‌బామ్ కంటే వంటింట్లో దొరికే పదార్థాలతోనే అధరాల చర్మాన్ని మృదువుగా మార్చేసుకోవచ్చు. ఈ క్రమంలో జొజోబా నూనె, షియా బటర్.. వంటివి నిర్ణీత వ్యవధుల్లో పెదాలకు అప్లై చేసి కాసేపు మర్దన చేయాలి.

మనం తీసుకునే ఆహారంలో విటమిన్ - బి లోపించినా పెదాలు పొడిబారిపోతాయంటున్నారు నిపుణులు. అందుకే ఈ విటమిన్ అధికంగా లభించే గుడ్లు, మాంసం, లివర్, ఆకుకూరలు, చేపలు, పాలు, ఛీజ్.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

విటమిన్లు లోపించడం వల్లే కాదు.. మోతాదుకు మించి ఇవి ఎక్కువైనా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా విటమిన్-ఎ అధికంగా తీసుకుంటే అది కాలేయంలోకి చేరుతుంది. అలా పోగైన ఈ విటమిన్ ఒక్కో దశలో చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుందట! పాలు, పెరుగు, క్యారట్, పాలకూర, చిలగడ దుంప, మామిడి, సపోటా, ఆప్రికాట్.. తదితర పదార్థాల్లో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి సప్లిమెంట్స్ తీసుకోవడం కంటే సహజసిద్ధంగానే దీన్ని తీసుకోవడం మంచిదంటున్నారు.

కప్పు నీళ్లలో టీస్పూన్ జీలకర్ర వేసుకొని మరిగించుకోవాలి. ఆపై చల్లారనిచ్చి వడకట్టుకొని తాగాలి. ఇలా చేస్తే పగిలిన పెదాల నుంచి క్రమంగా ఉపశమనం కలుగుతుంది.

గాలి, వెలుతురు ప్రసరించని చిన్న చిన్న గదుల్లో హ్యుమిడిటీ అధికంగా ఉంటుంది. ఈ కాలంలో పెదాలు పొడిబారడానికి ఇది కూడా ఓ కారణమే! కాబట్టి కిటికీలు, సరైన వెంటిలేషన్ లేని చోట హ్యుమిడిఫయర్‌ని అమర్చుకుంటే ఈ సమస్య తగ్గుతుంది.

వీటితో పాటు కలబంద గుజ్జు, కొబ్బరి నూనె, కీరాదోస గుజ్జు, తేనె-చక్కెర స్క్రబ్.. వంటివి పెదాలపై అప్లై చేసి కాసేపు మర్దన చేసుకొని శుభ్రం చేసుకున్నా ఫలితం ఉంటుంది. ఈ పదార్థాలన్నీ చర్మానికి తేమను సైతం అందిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్