close
హాలీవుడ్
భారతీయం @ హాలీవుడ్‌

అక్కడ అదుర్స్‌ అనిపించిన భారత మూలాలున్న నటులు

ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్‌ చిత్రాలకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. వివిధ దేశాలకు చెందిన నటీనటులు అక్కడ తమ ప్రతిభను చాటేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అలాగే భారత్‌కు చెందిన వారు కూడా హాలీవుడ్‌లో రాణించి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు పొందారు. గ్లోబల్‌ స్టార్‌గా ప్రియాంక చోప్రా హాలీవుడ్ చిత్రాలు, టీవీ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది. దీపికా పదుకొణె కూడా అక్కడ అడుగుపెట్టి వచ్చింది. వీళ్లు ఇక్కడ స్టార్‌గా ఎదిగి  అక్కడికి వెళ్లారు. అలాకాకుండా భారతీయ మూలాలున్న కొందరు నటులు హాలీవుడ్‌లో రాణిస్తున్నారు. వాళ్లే వీరు!

గుజరాత్‌ నుంచి... 

1998లో సినిమాల్లో ప్రవేశించిన కాల్‌పెన్‌ హాలీవుడ్ సినిమాల్లో నటుడు, కమెడియన్‌, నిర్మాతగా రాణిస్తున్నాడు. కాల్‌ పెన్‌ పూర్తి పేరు కాల్‌ పెన్‌ సురేశ్ మోదీ. బరాక్‌ ఒబామా హయాంలో ఆయన ప్రభుత్వంలో పనిచేశాడు. కొంతకాలం తర్వాత పదవిని వదిలేసి సినిమాలపై దృష్టిపెట్టాడు. టీవీ కార్యక్రమాల్లో రాణిస్తూనే హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గుజరాత్ నుంచి అమెరికాకు కాల్ పెన్‌ కుటుంబం వలస వెళ్లింది

 

అక్కడ పుట్టి.. అక్కడికే చేరి

హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం పొందే టీవీ నటుడిగా పేరుగాంచిన కునాల్‌ నయ్యర్‌ భారత సంతతికి చెందినవాడే. పంజాబీ కుటుంబానికి చెందిన కునాల్‌ నయ్యర్‌ లండన్‌లోని హౌన్‌స్లోలో జన్మించాడు. నాలుగేళ్ల వయసులో కునాల్‌ కుటుంబం భారత్‌కు తిరిగొచ్చింది. యూఎస్‌లో బీబీఏ చేయడానికి వెళ్లిన కునాల్‌ చదువు తర్వాత కొన్ని హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేశారు. 2004 నుంచి పదికిపైగా సినిమాల్లో నటించాడు. 2011లో ఫెమినా మిస్‌ ఇండియా నేహా కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. టెలివిజన్‌, థియేటర్‌ విభాగాల్లో పలు షోలను నిర్వహించాడు. 2012 నుంచి 2016 వరకు వరుసగా గిల్డ్‌ అవార్డును అందుకున్నారు.

 

టీవీ నుంచి వచ్చి... 

‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’తో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మరో నటుడు దేవ్‌ పటేల్‌. భారత సంతతికి చెందిన దేవ్‌ 1990లో లండన్‌లో జన్మించాడు. బ్రిటిష్‌ టెలివిజన్‌ షో ‘టీన్‌ డ్రామా స్కిన్స్‌’ద్వారా తెరంగేట్రం చేశారు. 18 ఏళ్ల వయస్సులో ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’తో గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రిటీష్‌ ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ అవార్డ్‌, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రివ్యూ (ఎన్‌బీఆర్‌) అవార్డు, షికాగో ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డు అందుకున్నాడు. 2008 నుంచి ఇప్పటివరకు 2019 వరకు 14 సినిమాల్లో నటించాడు. 

 

2003లో ఓ సినిమా చూసి...

ముంబయిలో జన్మించిన ఫ్రిదా పింటో బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి హాలీవుడ్‌కి వెళ్లింది. అమెరికన్‌, బ్రిటీష్‌ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన పింటో కుటుంబం ముంబయిలో స్థిరపడింది. 2003లో ‘మాన్‌స్టర్‌’ చూసిన తర్వాత తన భవిష్యత్తుపై పింటో నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేవరకు రెండేళ్లపాటు నటన, మోడలింగ్‌కు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. 2008లో ఆమె నటించిన ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ విజయవంతం కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 20కిపైగా చిత్రాలు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించింది. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’కిగాను టీన్‌ ఛాయిస్‌ అవార్డ్‌, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులను అందుకుంది.

 

పులితో ప్రయాణం చేసి... 

భారతీయ ప్రేక్షకులకు బాగా దగ్గరైన చిత్రం ‘లైఫ్‌ ఆఫ్‌ పై’. పులితో ఒంటరిగా పడవ ప్రయాణం చేసే కథతో రూపొందించిన సినిమాలో నటించిన యువకుడే సూరజ్‌ శర్మ. దిల్లీలో 1993లో జన్మించిన సూరజ్‌ 19 ఏళ్ల వయసులో హాలీవుడ్‌ చిత్రంలో నటించడం విశేషం. ఆ చిత్రానికిగానూ బాఫ్టా రైజింగ్‌ స్టార్‌ అవార్డును అందుకున్నాడు. ఏడేళ్ల కాలంలో తొమ్మిది హాలీవుడ్‌ చిత్రాల్లో నటించాడు. లండన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డును అందుకున్నాడు. హోమ్‌ లాండ్‌, గాడ్‌ ఫ్రెండెండ్‌ మి వంటి టెలివిజన్‌ షోల్లోనూ ప్రతిభాపాటవాలను ప్రదర్శించాడు. 

 

బాలెట్‌ డ్యాన్స్‌ తర్వాత... 

‘ద గాడ్‌ వైఫ్‌’అనే బ్రిటిష్‌ చిత్రంలో కలిందా శర్మగా కనిపించిన ఆర్చీ పంజాబీ మూలాలున్న నటి. ఇండియా నుంచి ఇంగ్లాండ్‌కు  వలస వెళ్లిన గోవింద్‌, పద్మ పంజాబీ దంపతులకు లండన్‌లో ఆర్చీ జన్మించింది. బాలెట్‌ డ్యాన్స్‌లో ప్రావీణ్యం పొందిన ఆర్చీ.. 1995 నుంచి హాలీవుడ్‌లో లఘుచిత్రాల్లో నటించింది. ‘బెండ్‌ ఇట్‌ లైక్‌ బెక్‌ హామ్’‌,‘ద కాన్‌స్టంట్‌ గార్డెనర్‌’,‘మైటీ హార్ట్‌’,‘ట్రైటర్‌’వంటి చిత్రాల్లో మెప్పించింది. 2007లో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో చాపర్డ్‌ ట్రోఫీ అందుకుంది. ప్రైమ్‌ టైమ్‌ ఎమ్మీ అవార్డ్స్‌ గెలుచుకుంది. సహాయ నటి కేటగిరీలో ఎన్‌ఏఏసీపీ ఇమేజ్‌ అవార్డు సొంతం చేసుకుంది.

 

అవతార్‌ సినిమాలో... 

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించిన ‘అవతార్‌లో భారత సంతతికి చెందిన నటుడు ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అతనే దిలీప్‌ రావు.  లాస్‌ ఏంజిల్స్‌లో జన్మించిన దిలీప్‌ రావు తల్లిదండ్రులు భారత సంతతికి చెందినవారు. 2006లో టీవీ షో ద్వారా నటన వైపు అడుగులు వేసిన దిలీప్‌రావు మూడేళ్ల తర్వాత ‘డ్రాగ్‌ మి టు హెల్‌’తో హాలీవుడ్‌ రంగ ప్రవేశం చేశాడు. ‘అవతార్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2010లో వచ్చిన ‘ఇన్సెప్షన్‌’లోని అతను పోషించిన యూసఫ్ పాత్ర గుర్తింపు తెచ్చింది. ‘మర్డర్‌ ఆఫ్‌ ఏ క్యాట్‌’, ‘బీబా బాయ్స్‌’లోనూ నటించాడు. అవతార్‌ 2, అవతార్‌ 3లోనూ దిలీప్‌ రావు కనిపించబోతున్నాడు. 

 

కేరళ నుంచి వెళ్లి... 

అమెరికా టీవీ షోల్లో సుపరిచితుడైన నవీన్‌ విలియమ్‌ సిడ్నీ ఆండ్రూస్ పూర్వీకులు భారత సంతితికి చెందిన వారే. కేరళకు చెందిన స్టాన్లే ఆండ్రూస్‌, నిర్మల దంపతులకు నవీన్‌ జన్మించాడు. 1991 నుంచి 2013 వరకు 22 ఏళ్లపాటు హాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేశాడు. దీంతోపాటు వివిధ టీవీ షోల్లోనూ నటించి మెప్పించాడు. ‘లండన్‌ కిల్స్‌ మి’, ‘వైల్డ్‌ వెస్ట్‌’, ‘డబుల్‌ విజన్‌’, ‘కామ సూత్ర: ఏ టేల్‌ ఆఫ్‌ లవ్‌’, ‘బాంబే బాయ్స్‌’, ‘ఈజీ’, ‘బ్రైడ్‌ అండ్‌ ప్రిజుడియస్‌’, ‘ద బ్రేవ్‌ వన్‌’, ‘డయానా’ చిత్రాల్లో నటించి నటించాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌  


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.