అమితాబ్ మెచ్చిన ఈనం గంభీర్.. ఎవరీమె?
దిల్లీ వేదికగా జరిగిన ‘జీ20 శిఖరాగ్ర సదస్సు’లో అధ్యక్ష హోదాలో భారత్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. కీలకమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పర్యావరణంతో పాటు పలు అంశాలపై రూపొందించిన ‘దిల్లీ డిక్లరేషన్’ను సభ్య దేశాలు ఏకాభిప్రాయంతో ఆమోదించాయి.
(Photo: Twitter)
దిల్లీ వేదికగా జరిగిన ‘జీ20 శిఖరాగ్ర సదస్సు’లో అధ్యక్ష హోదాలో భారత్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. కీలకమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పర్యావరణంతో పాటు పలు అంశాలపై రూపొందించిన ‘దిల్లీ డిక్లరేషన్’ను సభ్య దేశాలు ఏకాభిప్రాయంతో ఆమోదించాయి. ఈ డిక్లరేషన్ విజయవంతం కావడంలో భారత దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్లు భారత దేశ ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. ఈ బృందంలో ఐఎఫ్‌ఎస్ అధికారిణి ఈనం గంభీర్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు..
‘దిల్లీ డిక్లరేషన్’పై సభ్యదేశాలు ఏకాభిప్రాయం సాధించిన సందర్భంగా జీ20 భారత అధికార ప్రతినిధి అమితాబ్ కాంత్ ఎక్స్(ట్విట్టర్)లో స్పందించారు. ‘మొత్తం G20 సదస్సులో అత్యంత సంక్లిష్టమైన భాగం భౌగోళిక రాజకీయాలపై (రష్యా-ఉక్రెయిన్) ఏకాభిప్రాయం తీసుకురావడం. ఇది 200 గంటల పాటు నిరంతర చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయిదాల వల్లే సాధ్యమైంది. ఈనం గంభీర్, నాగరాజు నాయుడు ఈ విషయంలో ఎంతో సహకరించారు’ అని ఈ సందర్భంగా రాసుకొచ్చారు.
దౌత్యవేత్తగా రాణిస్తూ..!
⚛ దిల్లీకి చెందిన ఈనం గంభీర్ విదేశాంగ శాఖ, జీ20 కూటమికి జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.
⚛ ఈనం గంభీర్ 2005 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారిణి.
⚛ ఈనం రెండు మాస్టర్ డిగ్రీలు చేశారు. ఆమె దిల్లీ యూనివర్సిటీ నుంచి ‘మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథ్స్’లో మొదటి పట్టా అందుకున్నారు. ఆ తర్వాత జెనీవా యూనివర్సిటీలో ‘మాస్టర్స్ ఇన్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ’లో రెండో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు.
⚛ ఆమె హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్పానిష్ భాషలో కూడా అనర్గళంగా మాట్లాడగలరు.
⚛ ఐక్యరాజ్య సమితి 74వ జనరల్ అసెంబ్లీ అధ్యక్ష కార్యాలయంలో శాంతి, భద్రతలకు సంబంధించిన అంశాల పైన సీనియర్ అడ్వైజర్‌గా పనిచేశారామె.
⚛ మెక్సికో, అర్జెంటీనా వంటి లాటిన్ అమెరికన్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
⚛ 2011 నుంచి 2016 వరకు న్యూదిల్లీలో పనిచేశారు ఈనం. ఈ సమయంలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇరాన్‌కు సంబంధించిన వివిధ అంశాలపై వివిధ హోదాల్లో పని చేశారు.
⚛ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత మిషన్‌లో రాజకీయ, శాంతి, భద్రతా అంశాల పైన 2019 వరకు పని చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.