Najwa Karam: తన పాటలతోనే కాదు.. డ్రస్‌తోనూ రికార్డు..!
పాన్-అరబ్ గాయనిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన నజ్వా కరమ్.. ఇటీవలే తన కొత్త ఆల్బమ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈసారి తన పాటలతోనే కాదు.. తాను ధరించిన ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్‌తోనూ ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచింది నజ్వా.
(Photos: Instagram)
ఆమె సంగీత ప్రదర్శన అంటే వీక్షకులు చెవి కోసుకుంటారు.. సరికొత్త సంగీత శైలిలో ఆమె రూపొందించి విడుదల చేసే పాటలకు, ఆమె గాత్రానికి అరబ్ దేశాల్లోనే కాదు.. ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. పాన్-అరబ్ గాయనిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన నజ్వా కరమ్.. ఇటీవలే తన కొత్త ఆల్బమ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈసారి తన పాటలతోనే కాదు.. తాను ధరించిన ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్‌తోనూ ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచింది నజ్వా. ఈ వేదికగా తెలుపు రంగు జంప్‌సూట్‌లో మెరిసిపోయిన ఆమె.. దానికి జతగా అతి పొడవైన కేప్ ధరించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకుంది. తద్వారా గిన్నిస్ రికార్డు వరించిన తొలి లెబనీస్ గాయనిగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ గాయని సంగీత ప్రస్థానం గురించి తెలుసుకుందాం..!
గాయకుల సంగీత ప్రదర్శనలన్నా, వారు రూపొందించిన ఆల్బమ్స్/పాటల విడుదల కార్యక్రమాలన్నా ఫ్యాన్స్‌కు పండగే! ఎక్కడున్నా, ఎంత బిజీగా ఉన్నా.. పనులన్నీ మానుకొని మరీ ఆ ప్రదర్శనలో వాలిపోతుంటారు. ఇక సింగర్స్ కూడా ఈ వేదికగా తమ గాత్రానికి తోడు తమ ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్‌తోనూ అభిమానుల్ని అలరిస్తుంటారు. అయితే ఈసారి గిన్నిస్ రికార్డే లక్ష్యంగా తాను రూపొందించిన కొత్త ఆల్బమ్ విడుదల కార్యక్రమంలో పాల్గొంది లెబనీస్ గాయని నజ్వా.
‘కరిజ్మా’ కేప్ కథ ఇది!
అయితే తన పాటలతోనే కాకుండా.. డ్రస్‌తో కూడా రికార్డు సృష్టించాలనుకుందామె. ఈ క్రమంలో తెలుపు రంగు జంప్‌సూట్ ధరించి.. గోల్డెన్ బెల్ట్‌తో నడుమును కట్టిపడేసిన ఆమె.. తన అవుట్‌ఫిట్‌కు మ్యాచింగ్‌గా తెలుపు రంగులో రూపొందించిన పొడవాటి కేప్ ధరించింది. దీని పొడవు 182.7 అడుగులు (సుమారు 55.7 మీటర్లు). ఇలా ప్రపంచంలోనే అతి పొడవైన కేప్గా దీనికి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది. అంతేకాదు.. దీన్ని ధరించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన తొలి లెబనీస్ గాయనిగానూ నజ్వా చరిత్ర సృష్టించింది. తన డ్రస్‌కు మ్యాచయ్యేలా ఈ కేప్పై అక్కడక్కడా గోల్డెన్ ఫ్యాబ్రిక్ ప్యాచ్‌లతో హంగులద్దారు. ఇక ఈ వేదికగా ‘కరిజ్మా’ పేరుతో తన కొత్త ఆల్బమ్‌ను విడుదల చేసింది నజ్వా. ఇందులో క్లాసికల్ నుంచి మోడ్రన్ దాకా.. విభిన్న సంగీత శైలులు రంగరించి రూపొందించిన ఏడు పాటలున్నాయి. ఇలా తన ప్రతిభతో మరోసారి తన మ్యూజికల్ మార్క్‌ను దాటేసిన నజ్వా.. ప్రపంచ రికార్డుతోనూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. తాను విడుదల చేసిన కరిజ్మా ఆల్బమ్ పేరు మీదుగానే.. ఈ కేప్‌కు ‘కరిజ్మా కేప్’గా నామకరణం చేశారు గిన్నిస్ నిర్వాహకులు.
టీచర్ నుంచి సింగర్‌గా..!
నజ్వా లెబనాన్‌లోని ట్రైపోలీలో పుట్టింది. ఆమెది సంప్రదాయ మూలాలున్న కుటుంబం. చిన్నతనం నుంచి క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో పెరిగిన ఆమెకు సంగీతమంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు తన తల్లి వంటింట్లో వంట చేస్తూ పాడే పాటల్ని ఆసక్తిగా వినేదామె. ఈ మక్కువతోనే సంగీత రంగంలోకి రావాలనుకుంది. కానీ అది వాళ్ల నాన్నకు నచ్చలేదు. ఎందుకంటే అమ్మాయిలు ఇలా పాటలు పాడడం, స్టేజీ ప్రదర్శనలివ్వడం కంటే.. చక్కగా చదువుకొని టీచర్‌గా స్థిరపడడం మేలన్నది ఆయన ఆలోచన. ఈ క్రమంలోనే ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేసిన నజ్వా.. రెండేళ్లు స్థానిక కళాశాలలో జాగ్రఫీ టీచర్‌గానూ పనిచేసింది. అయినా తన సంగీత ప్రయత్నాల్ని మాత్రం ఆపలేదంటోంది.
‘నేను సంగీత రంగంలోకి వెళ్తానని నాన్నను ఎంతగానో ఒప్పించడానికి ప్రయత్నించా. కానీ తను వినలేదు. అయినా నేను మనసు మార్చుకోలేదు. ఎప్పటికైనా నా ఆసక్తిని, ప్రతిభను తను గుర్తిస్తాడన్న నమ్మకంతో ముందుకు సాగా. అయితే ఓసారి ఓ టీవీ షోలో పాల్గొని స్టేజీపై పాటలు పాడా. అది చూసిన నాన్నకు నా గాత్ర నైపుణ్యం, సంగీతంపై ఉన్న మక్కువేంటో అర్థమైంది. దాంతో ఆయన మనసు మార్చుకొని నన్ను ప్రోత్సహించడం ప్రారంభించారు. ‘లెబనీస్ నైట్స్’ అనే టీవీ షో పాటల పోటీలో మవ్వాల్ అనే అరబిక్ శైలిలో పాటలు పాడిన నేను ఆ పోటీలో విజేతగా నిలిచా.. బంగారు పతకం అందుకున్నా. ఇక ఆపై నాన్న ప్రోత్సాహంతో నాలుగేళ్ల మ్యూజిక్ కోర్సు పూర్తి చేశా. ఆపై ఇద్దరు ప్రముఖ లెబనీస్ సంగీత దర్శకుల దగ్గర పని చేసిన నేను.. 1989లో అరబిక్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టా..’ అంటూ సంగీత రంగంలో తన కెరీర్ ప్రారంభించిన తీరును వివరించింది నజ్వా.
ముద్దు పేరుతో ఆల్బమ్!
తన కెరీర్ ప్రారంభంలో వివిధ రికార్డింగ్ సంస్థలతో కలిసి ఆల్బమ్స్ రూపొందించేది నజ్వా. లెబనీస్ సంప్రదాయ/జానపద స్వర శైలుల్ని రంగరించి ఆమె రూపొందించిన తొలి ఆల్బమ్ ‘యా హబాయెబ్’కు అక్కడి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో వాళ్లిచ్చిన ‘ది సన్ ఆఫ్ ది సాంగ్’ అనే ముద్దు పేరుతో మరో ఆల్బమ్‌ను రూపొందించిందామె. సమకాలీన, రొమాంటిక్ స్వర శైలులు కలగలిపి రూపొందించిన ఈ పాటలు ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఇలా ఆమె సంగీత, గాత్ర నైపుణ్యాలను మెచ్చి పెద్ద పెద్ద రికార్డింగ్ కంపెనీలు కూడా ఆమెతో పాటలు పాడించుకోవడానికి క్యూ కట్టేవి. అలా ఒకానొక దశలో సౌదీ అరేబియా యువరాజు అల్ వలీద్ బిన్ తలాల్ సొంత రికార్డింగ్ సంస్థ రొటానా స్టూడియోతో కలిసి పనిచేసే అవకాశం ఆమె తలుపు తట్టింది. ఇలా ఈ వేదికగా అరబ్ పాప్ వంటి వివిధ రకాల సంగీత శైలులతో పలు ఆల్బమ్స్ రూపొందించింది నజ్వా. 2001లో ఆమె విడుదల చేసిన ‘Nedmaneh’ అనే ఆల్బమ్ ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. ఆమె ఆల్బమ్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఇదీ ఒకటిగా నిలిచింది. 2011లో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, రొటానా రికార్డింగ్ సంస్థలతో కలిసి ఆమె పాడిన ‘Ma Fi Noum’ అనే పాటను త్రీడీ మ్యూజిక్ వీడియోగా రూపొందించారు. ఇది మధ్య తూర్పు దేశాల్లోనే తొలి త్రీడీ మ్యూజిక్ వీడియోగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది.
ఫ్యాషన్ క్వీన్!
తన సుదీర్ఘ సంగీత కెరీర్‌లో 20కి పైగా ఆల్బమ్స్ రూపొందించిన నజ్వా.. వందలాది సింగిల్స్‌కి తన గాత్రాన్ని అరువిచ్చింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంగీత ప్రదర్శనల్లో పాల్గొంది. సంగీతోత్సవాల్లో సందడి చేసింది. దుబాయ్, మస్కట్, ప్యారిస్, కువైట్, లండన్, బోస్టన్, స్టాక్‌హోమ్, ఇస్తాంబుల్, మెల్‌బోర్న్.. వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఒపేరా హౌస్‌లలో పాడిన ఘనతనూ సొంతం చేసుకుంది నజ్వా. ఇలా అరబ్ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఆమెకు.. కేన్స్ వంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలోనూ పాల్గొనే అవకాశం దక్కింది. తన సంగీత, గాత్ర నైపుణ్యాలతో ‘ఉత్తమ సింగర్’గా, ‘లెబనీస్ దివా’గా లెక్కకు మిక్కిలి అవార్డులు అందుకున్న ఈ లెబనీస్ క్వీన్.. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన వివిధ జాబితాల్లోనూ స్థానం సంపాదించుకుంది. ‘ప్రిన్సెస్ ఆఫ్ లెబనీస్ సాంగ్’గానూ పేరుపొందిన నజ్వాకు ఫ్యాషన్ క్వీన్‌గానూ పేరుంది. విభిన్న ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్ ధరించి హొయలు పోయే ఆమె.. ఆ ఫొటోల్ని, తన వ్యక్తిగత-కెరీర్ విషయాల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ నాలుగు కోట్లకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.