Breakup: ప్రేమ బంధం తెగిపోయినప్పుడు.. ఆ బాధను ఇలా జయించాం!
ప్రేమంటే నమ్మకం. అది లోపించినప్పుడు ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తి.. క్రమంగా ఆ అనుబంధం బ్రేకప్‌కు దారితీయచ్చు. అయితే మనసిచ్చిన వ్యక్తితో విడిపోవడమంటే మాట్లాడుకున్నంత సులభం కాదు.. మనకు, మన మనసుకు జరిగే చిన్నపాటి యుద్ధమిది. దీన్నుంచి బయటపడందే మరో వ్యక్తితో స్నేహం చేయడానికి....
(Photos: Instagram)
ప్రేమంటే నమ్మకం. అది లోపించినప్పుడు ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తి.. క్రమంగా ఆ అనుబంధం బ్రేకప్‌కు దారితీయచ్చు. అయితే మనసిచ్చిన వ్యక్తితో విడిపోవడమంటే మాట్లాడుకున్నంత సులభం కాదు.. మనకు, మన మనసుకు జరిగే చిన్నపాటి యుద్ధమిది. దీన్నుంచి బయటపడందే మరో వ్యక్తితో స్నేహం చేయడానికి కూడా మనసు అంగీకరించదు. కానీ ఈ విషయంలో తన మనసు మాట అస్సలు విననంటోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. మరో యువ నటి సారా అలీ ఖాన్‌తో కలిసి ఇటీవలే ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న ఈ అందాల తార.. ప్రేమ-బ్రేకప్ గురించి తన మనసులోని మాటల్ని పంచుకుంది. ఈ నేపథ్యంలో కొందరు ముద్దుగుమ్మలు తమ బ్రేకప్ బాధ నుంచి ఎలా బయటపడ్డారో వారి మాటల్లోనే..!
ఆ విషయంలో మనసు మాట వినను: జాన్వీ కపూర్
నచ్చిన వ్యక్తితో విడిపోవడమంటే జీవితాన్నే కోల్పోయినట్లుగా ఫీలవుతుంటారు చాలామంది. ఈ క్రమంలో ఒత్తిడి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే వారూ లేకపోలేదు. అయితే తాను మాత్రం ఇందుకు భిన్నం అంటోంది జాన్వీ. తన ప్రాణ స్నేహితురాలు సారా అలీ ఖాన్‌తో కలిసి ఇటీవలే ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. ‘ప్రేమను నేనూ గౌరవిస్తా. అయితే వివిధ కారణాల రీత్యా ఇద్దరూ విడిపోవాల్సి వచ్చినప్పుడు.. నేను పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ కుంగిపోను.. వాటి నుంచి క్రమంగా బయటపడుతూనే.. నాకు నచ్చిన, నా హితం కోరే వ్యక్తులతో స్నేహాన్ని పెంచుకుంటా.. అప్పుడే జీవితంలో ఆగిపోకుండా ముందుకెళ్లగలం..’ అంది జానూ. తిరిగి రాని బంధం కోసం సమయం వృథా చేసుకోకుండా.. గత జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకొని సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం వల్ల అటు వ్యక్తిగతంగా, ఇటు కెరీర్ పరంగా విజయం సాధించగలమని చెప్పకనే చెప్పిందీ కపూర్ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ గతంలో ఇషాన్ కట్టర్, కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్ చేసినట్లు అప్పట్లో బాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి.
పాటే మంత్రం : అనన్యా పాండే
బ్రేకప్ బాధ నుంచి బయటపడే క్రమంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. కొంతమంది పాజిటివ్‌గా మెలిగే వ్యక్తుల మధ్య ఉండాలనుకుంటే, మరికొందరు తమకు నచ్చిన పనులు చేస్తూ సాంత్వన పొందుతారు. అలా నచ్చిన సంగీతంతోనే తాను బ్రేకప్ బాధను మర్చిపోతానంటోంది బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనన్యా పాండే. ‘మనసులోని బాధను నలుగురితో పంచుకుంటేనే ప్రశాంతత చేకూరుతుందని నమ్మే వ్యక్తిని నేను. అయితే ఎవరేమనుకుంటారోనన్న ఉద్దేశంతో కొంతమంది వీటిని తమలో తాము అణచుకుంటూ బయటికి సంతోషంగా కనిపిస్తారు. కానీ దీనివల్ల బాధ రెట్టింపవుతుంది. నేనైతే బ్రేకప్ బాధను మర్చిపోవడానికి అర్జిత్ సింగ్ (గాయకుడు, సంగీత దర్శకుడు) పాటలు ఎక్కువగా వింటా. ఐస్‌క్రీమ్స్ తింటా. బాధ నుంచి బయటపడడానికి స్నేహాన్ని మించిన ఔషధం లేదు. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం గడుపుతా..’ అంటూ చెప్పుకొచ్చింది అనన్య. ‘ఖాలీ పీలీ’ చిత్రంలో ఇషాన్‌తో కలిసి తెరను పంచుకున్న అనన్య.. అతనితో మూడేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నట్లు, ఇటీవలే ఈ జంట విడిపోయినట్లు ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే!
వాళ్లే అండగా నిలిచారు : దీపికా పదుకొణె
అధికారికంగా వెల్లడించకపోయినా.. బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్‌తో కొన్నేళ్లు ప్రేమలో మునిగిపోయింది దీపిక. ఇద్దరూ విడిపోయాక దీపిక డిప్రెషన్‌లోకి వెళ్లడం, తిరిగి కోలుకోవడానికి తాను పాటించిన చిట్కాల గురించి పలు సందర్భాల్లో పంచుకుందీ చక్కనమ్మ. ‘ప్రేమలో నేనెప్పుడూ మోసం చేయలేదు.. దారి తప్పలేదు. ఎదుటివ్యక్తి చేతిలో మోసపోయినా నాలోనే లోపముందేమోనని అనుకునేంత అమాయకురాలిని నేను. అయినా అవతలి వ్యక్తి ప్రాధేయపడడంతో రెండో అవకాశమిచ్చా. అదే నేను చేసిన తప్పు అని ఆ తర్వాత నాకు అర్థమైంది. ఈ బాధతోనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఈ సమయంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మానసిక నిపుణులు అండగా నిలవడంతో కుంగుబాటు నుంచి బయటపడగలిగాను..’ అంటూ తన అనుభవాలను పంచుకుంది దీప్స్. తనంటే ప్రాణమిచ్చే రణ్‌వీర్ సింగ్‌ని వివాహమాడి తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ‘ది లివ్ లవ్ లాఫ్’ ఫౌండేషన్ స్థాపించి.. మానసిక సమస్యలున్న ఎంతోమంది బాధితులకు అండగా నిలుస్తోంది. మరోవైపు రణ్‌బీర్ ఆలియాతో ఇటీవలే ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే!
అమ్మ మాటలే ధైర్యం నింపాయి : కత్రినా కైఫ్
బ్రేకప్ అంటే బాధ కాదు.. వరం అంటోంది బాలీవుడ్ టాల్ బ్యూటీ కత్రినా. ఈ ప్రతికూల సమయమే తన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిందని చెబుతోందీ బాలీవుడ్ అందం. అధికారికంగా ప్రకటించకపోయినా.. సుమారు నాలుగేళ్ల పాటు రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణాన్ని కొనసాగించిన క్యాట్.. బ్రేకప్ తన జీవితంలో మిగిల్చిన అనుభవాల గురించి ఓ సందర్భంలో ఇలా పంచుకుంది.
‘బ్రేకప్ నా జీవితంలో జరిగిన ఓ మంచి సంఘటన. ఎందుకంటే.. ఇది నన్ను నేను గుర్తించేలా, నాలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. బ్రేకప్ తర్వాతే నాకు స్వీయ ప్రేమ పెరిగిందని చెప్తా. అంతేకాదు.. ఆ సమయంలో అమ్మ నాతో ఓ మాట చెప్పింది.. ‘చాలామంది జీవితంలో ఇది సహజం. కానీ ఇలాంటప్పుడు నేను ఒంటరిని కాదు.. అన్న ఒక్క ఆలోచన మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది’ అని! ఈ మాటలే నాలో ధైర్యాన్ని నింపాయి. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎదిగేలా చేశాయి..’ అందీ చక్కనమ్మ. బ్రేకప్ బాధ నుంచి కోలుకున్నాక.. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌లో తన ప్రేమను వెతుక్కున్న ఈ భామ.. గతేడాది అతడితోనే ఏడడుగులు నడిచి.. సంతోషంగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
స్వీయ ప్రేమ పెంచుకున్నా : ఇలియానా
బాలీవుడ్ బెల్లీ బ్యూటీ ఇలియానా గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అతనితో విడిపోయిన ఆమె.. బ్రేకప్ బాధ నుంచి ఎలా బయటపడిందో పలు సందర్భాల్లో ఇలా చెప్పుకొచ్చింది.
‘ప్రతికూల సమయాల్లో ఇతరులపై కాకుండా మనపై మనం దృష్టి పెట్టాలి. బ్రేకప్ బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లినప్పుడు నా థెరపిస్ట్ నాకో మాట చెప్పారు. ప్రశంసల్ని అంగీకరిస్తూ నీలోని ప్రత్యేకతలపై దృష్టి పెట్టమని! ఆ తర్వాత దీన్నే ఆచరించా. కుటుంబ సభ్యులు, స్నేహితుల విలువ తెలుసుకున్నా. ఎందుకంటే నేను కుంగుబాటు నుంచి బయటపడే క్రమంలో వాళ్లే నాకు అండగా నిలిచారు. ఇప్పటికీ నా శరీరాకృతి, బరువు గురించి ఎవరెన్ని కామెంట్లు చేసినా పట్టించుకోను. ఎందుకంటే నన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి!’ అందీ గోవా బ్యూటీ.
‘ప్రేమ, బ్రేకప్.. ఈ రెండూ మన జీవితంలో ఓ భాగమే.. కానీ జీవితం కాదు!’ అని ఈ ముద్దుగుమ్మల మాటలు చెబుతున్నాయి. కాబట్టి ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా పాజిటివ్‌గా ఎదుర్కొందాం.. మానసికంగా మరింత దృఢంగా మారుదాం..! మరి, ఈ అంశంపై మీ స్పందనేంటి? Contactus@vasundhara.net వేదికగా మీ అభిప్రాయాల్ని పంచుకోండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.