Published : 07/09/2021 19:38 IST

అప్పుడు తప్పుగా ఊహించుకున్నాం!

(Photo: Instagram)

ప్రేమ విషయంలో ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’కు ఎంతో ప్రాధాన్యముంది. తొలిచూపులోనే ఒకరికొకరు ఇష్టపడడం, అభిప్రాయాలు పంచుకోవడం...ఇలా ప్రేమకు కావాల్సిన పునాది అంతా తొలి పరిచయంలోనే జరుగుతుందంటారు. అయితే తన ప్రేమ విషయంలో మాత్రం ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’కు అంత ప్రాధాన్యం లేదంటున్నాడు టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా. కొన్ని నెలల క్రితం ప్రముఖ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేశన్‌తో ఏడడుగులు నడిచిన ఈ క్రికెటర్‌...తాజాగా తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

తమ రెండేళ్ల ప్రేమను ఈ ఏడాది మార్చిలో మూడుముళ్ల బంధంగా మార్చుకున్నారు సంజన-బుమ్రా. గోవా వేదికగా అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి రోజు ముందు వరకు కూడా అత్యంత గోప్యత పాటించిన ఈ లవ్లీ కపుల్‌, పెళ్లయ్యాక మాత్రం సోషల్‌ మీడియాలో తరచూ తమ ఫొటోలను షేర్‌ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను ఒలకబోస్తున్నారు. ఇక టెస్ట్‌ సిరీస్‌ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉంటోన్న బుమ్రా...తీరిక దొరికినప్పుడల్లా తన భార్యతో కలిసి అందమైన ప్రదేశాలన్నీ చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ నిర్వహించిన ఓ ఛాట్‌ సెషన్‌లో పాల్గొన్న ఈ ఫాస్ట్‌ బౌలర్‌... సంజనతో పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నాడు.

అలా తప్పుగా ఊహించుకున్నాం!

‘ప్రేమికులకు సంబంధించి తొలి పరిచయం అనేది ఓ మధురానుభూతి. కానీ మా ప్రేమ విషయంలో ఇదేమంత స్పెషల్‌ కాదు. స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా, యాంకర్‌గా సంజనను నేను చాలాసార్లు చూశాను. మాటలు కూడా కలుపుదామనుకున్నాను. కానీ ఆగిపోయాను. ఎందుకంటే ఆమెను నేను ఓ అహంభావిలా ఊహించుకున్నాను. నా గురించి కూడా సంజన అలాగే ఊహించుకుందట. అలా మేమిద్దరం ఒకరికొకరం మాట్లాడుకోకముందే మా గురించి మేమే తప్పుగా అర్థం చేసుకున్నాం. దీని వల్ల మేమిద్దరం చాలాసార్లు తారసపడినా మాట్లాడుకోలేకపోయాం.’

అప్పుడే మాటలు కలిశాయి!

‘అయితే ఇంగ్లండ్‌లో జరిగిన 2019 వరల్డ్‌ కప్‌ మా మధ్య ఉన్న అంతరాలను చెరిపేసింది. ఈవెంట్‌ కవరేజ్‌ కోసం ఆమె కూడా ఇంగ్లండ్‌కు రావడంతో మొదటిసారిగా మా మాధ్య మాటలు కలిశాయి. అప్పటి నుంచే మంచి స్నేహితులుగా మారిపోయాం. తరచుగా మాట్లాడుకోవడం ప్రారంభించాం. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో అంతా ఓకే అనుకున్నాం. పెళ్లి చేసుకున్నాం. మా వివాహం జరిగి ఐదు నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు మేమెంతో సంతోషంగా ఉంటున్నాం.’

అందుకే నా భార్యను కూడా తీసుకెళుతున్నా!

‘క్రికెట్‌ గురించి, అందులో ఉండే ఒత్తిడి, ఆటుపోట్ల గురించి సంజనకు బాగా అవగాహన ఉంది. ముఖ్యంగా క్రికెటర్ల మూడ్‌ ఎప్పుడెలా మారుతుందో తనకు బాగా తెలుసు. అందుకే ఒత్తిడిగా అనిపించినప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడల్లా నా సతీమణితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాను. ఈ క్రమంలోనే తన నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. నాతో పాటు నా భార్యను కూడా క్రికెట్‌ మ్యాచ్‌లకు తీసుకెళ్లడానికి ఇదే కారణం’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని