ఎల్‌ఈడీ లెహెంగా.. ఈమె దీపావళి స్పెషల్‌ డ్రస్‌ చూశారా?

దీపావళికి ఇల్లంతా దీపాలు, ఎల్‌ఈడీ బల్బులు, లాంతర్లతో అలంకరించడం పరిపాటే! పండగ శోభను రెట్టింపు చేయడానికి సంప్రదాయబద్ధమైన దుస్తుల్నీ ఎంచుకుంటాం. అయితే ఇలాంటి ట్రెడిషనల్‌ అటైర్‌కే దీపావళి టచ్‌ ఇచ్చిందో భారతీయ మహిళ....

Updated : 15 Nov 2023 15:47 IST

(Photos : Instagram)

దీపావళికి ఇల్లంతా దీపాలు, ఎల్‌ఈడీ బల్బులు, లాంతర్లతో అలంకరించడం పరిపాటే! పండగ శోభను రెట్టింపు చేయడానికి సంప్రదాయబద్ధమైన దుస్తుల్నీ ఎంచుకుంటాం. అయితే ఇలాంటి ట్రెడిషనల్‌ అటైర్‌కే దీపావళి టచ్‌ ఇచ్చిందో భారతీయ మహిళ. ‘ఈ పండక్కి ఇంటిని మాత్రమే రంగురంగుల లైట్లతో అలంకరించాలా..? ఆ వెలుగును దుస్తులకు ఎందుకు జోడించకూడదు?’ అనుకుందో ఏమో.. అన్నంత పనీ చేసేసింది. తన లెహెంగాకు ఎల్‌ఈడీ లైటింగ్‌తో హంగులద్ది వినూత్నంగా మెరిసిపోయింది. ఇలా తన వినూత్న లెహెంగాతో పాటు తానూ సోషల్‌ మీడియాలో తెగ పాపులరైపోయింది. మరి, ఇంతకీ తనెవరో, తను ధరించిన ఆ ఎల్‌ఈడీ డ్రస్ కథాకమామిషూ ఏమిటో తెలుసుకుందాం రండి..

దీపాల పండక్కి చాలామంది చీరలు, లెహెంగాలు.. వంటి సంప్రదాయ దుస్తులు ఎంచుకుంటుంటారు. రాత్రిపూట దీపాల వెలుతురులో మెరిసిపోవాలని వాటికి అద్దాలు/చమ్కీలతో హంగులద్దేవారూ లేకపోలేదు. ఈ క్రమంలోనే కాస్త వినూత్నంగా ఆలోచించి వార్తల్లోకెక్కింది దిల్లీకి చెందిన డిజిటల్‌ క్రియేటర్‌ వర్షా యాదవ్‌. వర్షా బాయ్‌ పేరుతోనూ ఇన్‌స్టాలో పాపులర్‌ అయిన ఆమె.. ఈ దీపావళికి తన దుస్తులకు కాస్త వినూత్నంగా టచప్‌ ఇచ్చి దేశవ్యాప్తంగా పాపులర్‌ అయింది.

బోర్డర్‌కు ఎల్‌ఈడీ హంగులు!

దీపావళి సందర్భంగా ఆకుపచ్చ, ఎరుపు రంగులు కలగలిసిన ఫ్లోరల్‌ ప్రింటెడ్‌ లెహెంగాను ఎంచుకుంది వర్ష. అయితే దుపట్టాకు మధ్యమధ్యలో టాజిల్స్‌తో హంగులద్దిన ఆమె.. బోర్డర్‌ మాత్రం ఏ లేస్‌తోనో, ఎంబ్రాయిడరీతోనో కవర్‌ చేయాలనుకోలేదు. వీటికి బదులుగా ఎల్‌ఈడీ బల్బుల్ని ఎంచుకుంది. బోర్డర్‌ చుట్టూ సమాన దూరాల్లో ఈ రంగురంగుల లైట్లు వచ్చేలా జాగ్రత్తపడిన వర్ష.. చివర్లో ఓ బ్యాటరీని అనుసంధానించేలా డ్రస్‌ డిజైన్‌ చేయించింది. అంతేకాదు.. బ్యాటరీ కనిపించకుండా.. డ్రస్‌ లోపలికి అమర్చుకుంది. అంటే.. చూడ్డానికి ఇది ఎల్‌ఈడీ బోర్డర్‌ డ్రస్‌లా ఉందన్నమాట! ఇలా దీపాల మధ్యలో దీపంలా వెలిగిపోతూ దిగిన ఫొటోలు, వీడియోల్ని సోషల్‌ మీడియాలో పంచుకున్న ఆమె.. ‘ఈసారి దీపావళి అటైర్‌ ఇలా ప్లాన్‌ చేశా.. ఈ డ్రస్‌ నాకు బహుమతిగా అందించిన సునీతా యాదవ్‌కు నా కృతజ్ఞతలు!’ అంటూ క్యాప్షన్‌ పెట్టింది. దీంతో ఈ ఎల్‌ఈడీ లెహెంగా దేశవ్యాప్తంగా పాపులర్‌ అయింది.

మిసెస్‌ బిజిలీ దేవి!

అయితే ఇలాంటి ఎల్‌ఈడీ తరహా డ్రస్సుల్ని డిజైన్‌ చేయడంలో డిజైనర్‌ సునీతది అందెవేసిన చేయి. ఇలా ఆమె రూపొందించిన విభిన్న ఎంబ్రాయిడరీ తరహా దుస్తులు, ఎల్‌ఈడీ డ్రస్సులకు ఆమె ఇన్‌స్టా పేజీనే కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పచ్చు. ఇలా సునీత చేతిలో రూపుదిద్దుకొని, వర్ష ధరించిన ఈ డ్రస్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాషన్‌ ప్రియుల్ని తెగ ఆకట్టుకుంటోంది. దీని గురించి స్పందిస్తూ.. ‘దీపావళికి తగ్గట్లుగా రడీ అవడమంటే ఇదే!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ‘మిసెస్‌ బిజిలీ దేవి’ అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా తన వీడియో లక్షల కొద్దీ లైక్‌లు, వ్యూస్‌తో దూసుకుపోవడం సంతోషంగా ఉందంటోంది వర్ష.

‘సోషల్‌’ స్టార్‌!

దిల్లీకి చెందిన వర్ష ప్రస్తుతం డిజిటల్‌ క్రియేటర్‌గా, యూట్యూబర్‌గా కొనసాగుతోంది. సంప్రదాయ కట్టూ-బొట్టుతో చూడ్డానికి సాధారణ గృహిణిగా కనిపించే ఆమె.. సోషల్‌ మీడియాలో విభిన్న రకాల పోస్టులు షేర్‌ చేస్తుంటుంది. తన రోజువారీ లైఫ్‌స్టైల్‌, ట్రెడిషనల్‌ డ్రస్సింగ్‌, తన గర్ల్‌ గ్యాంగ్‌తో గడిపిన క్షణాలు, కుటుంబ సభ్యులతో చేసిన సరదా వీడియోలు, భర్తతో తనుకున్న అనుబంధం, పండగ సెలబ్రేషన్స్‌.. వంటివన్నీ ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో పంచుకుంటూ పాపులర్‌గా మారింది. అంతేకాదు.. తన అందం, క్యూట్‌ స్మైల్‌తోనూ మరింతమంది ఫాలోవర్లను సంపాదించుకుందీ ఇన్‌ఫ్లుయెన్సర్‌. భారతీయ సంప్రదాయ దుస్తులకు కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇవ్వడమూ వర్షకు అలవాటే! అందుకే చాలామంది తనను ‘ఫ్యాషన్‌ ఐకాన్‌’ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం తన సోషల్‌ మీడియా పేజీలకు సుమారు పది లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు.

ఇక గతంలోనూ ఇండోర్‌కు చెందిన ఓ మహిళ దీపావళి సందర్భంగా.. ఎల్‌ఈడీ బల్బులతో హంగులద్దిన చీర ధరించి వార్తల్లోకెక్కింది. అప్పట్లో ఆమె శారీ వీడియోలూ నెట్టింట్లో తెగ వైరలయ్యాయి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్