Updated : 05/07/2021 20:23 IST

ఆహారపు కోరికలు ఎందుకు కలుగుతాయో తెలుసా?

మనలో చాలామందికి భోజనం చేసిన వెంటనే ఏదైనా స్వీటు కానీ, ఐస్‌క్రీం కానీ తినాలనిపిస్తుంది. మరికొందరు వేళాపాళా లేకుండా చిప్స్‌, చాక్లెట్స్‌ను రుచి చూడాలనుకుంటారు. ఇంకొందరు పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే పదార్థాలు తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. మరి అసలు ఇలాంటి ఆహారపు కోరికలు ఎందుకు కలుగుతాయని మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే వీటికి కూడా ఓ కారణముంటుందని చెబుతున్నారు నిపుణులు. మన శరీరంలో ఏదైనా పోషకం ఉండాల్సిన స్థాయి కంటే తక్కువగా ఉన్నా/లోపించినా ఆ పోషకం ఎక్కువగా ఉండే పదార్థం తీసుకోమని మన శరీరం మెదడుకు సంకేతం పంపుతుందట! దాంతో ఆయా పదార్థం తినేదాకా మనసు ఊరుకోదు. మరి, మనలో సాధారణంగా కలిగే అలాంటి కొన్ని ఆహారపు కోరికలేంటో తెలుసుకుందాం రండి..


స్వీట్స్‌

మీకేదైనా తియ్యగా తినాలనిపిస్తుందంటే రక్తంలో చక్కెర స్థాయులు పడిపోయాయని అర్థం అంటున్నారు నిపుణులు. సాధారణంగా చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. దీన్ని అదుపు చేయడానికి శరీరం ఇన్సులిన్‌ని విడుదల చేస్తుంది. ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయులు ఉండాల్సిన దానికంటే కాస్త తగ్గినా కూడా స్వీటు తినమని మెదడుకు సంకేతం వెళ్తుంది. అలాగే క్రోమియం, మెగ్నీషియం లాంటి పోషకాలు తగినంత స్థాయిలో లేనప్పుడు కూడా స్వీట్లు తినాలనిపిస్తుందట! అలాగని వాటిని ఎంత పడితే అంత తినేయకుండా.. మితంగా తిని సంతృప్తి చెందడం.. లేదంటే బెల్లంతో తయారుచేసిన స్వీట్లు తీసుకోవడం మరీ మంచిది.


ఉప్పు

శరీరంలో ఎలక్ట్రొలైట్ల శాతం తగ్గినప్పుడు/డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు ఉప్పగా ఉండే పదార్థాలు తినాలని మనసు కోరుకుంటుందట! అంతేకాదు.. ఒత్తిడి ఎక్కువైనా, నిద్రలేకపోయినా, ప్రి-మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (నెలసరికి ముందు) సమయంలోనూ.. ఈ కోరిక కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉప్పు బిస్కట్స్‌, చిప్స్‌ ఎక్కువగా తినాలనిపిస్తుంది. వాటిని కొద్ది మోతాదులో తీసుకోవడం లేదంటే విటమిన్‌-బి నిండి ఉండే నట్స్, సీడ్స్‌, చిక్కుళ్లు.. వంటివి తీసుకోవడం ఉత్తమం. ఇక ఎలక్ట్రొలైట్ల స్థాయులు పెంచుకోవడానికి కొబ్బరినీళ్లను మించింది లేదంటున్నారు నిపుణులు. అలాగే కూరల్లోనూ సాధారణ ఉప్పుకు బదులుగా పింక్‌ హిమాలయన్‌ సాల్ట్‌, కళ్లుప్పు.. వంటివి వాడచ్చు.


పుల్లటి పదార్థాలు

పచ్చి మామాడికాయ, పచ్చళ్లు, చింతపండు, ఉసిరి లాంటి పుల్లటి పదార్థాలు తినాలనిపిస్తే.. అది కొంతమందిలో జీర్ణ సంబంధిత సమస్యలకు సూచన కావచ్చంటున్నారు నిపుణులు. ఎసిడిటీ, అజీర్తి, ఒత్తిడి, ఆందోళన.. లాంటి సమస్యలున్నప్పుడు పుల్లటి పదార్థాలు తినాలన్న కోరికలు కలుగుతాయట! ఇలాంటి వారు నారింజ, బత్తాయి, పుచ్చకాయ.. వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆయా సమస్యలు తగ్గుముఖం పట్టి జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.


చాక్లెట్స్‌

మనలో చాలామందికి చాక్లెట్‌ తినాలన్న కోరికలు కలుగుతుంటాయి. ముఖ్యంగా నెలసరి సమయంలో మహిళల మనసు ఎక్కువగా చాక్లెట్ల వైపే మళ్లుతుంది. ఇందుకు కారణం ఆ సమయంలో వారి శరీరంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల స్థాయులు తగ్గడమే! ఈ క్రమంలో ఎక్కువగా ఆకలేసి చక్కెర, కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం నిండి ఉన్న చాక్లెట్స్‌ తినమని మనసు కోరుకుంటుంది. అలాగే క్రోమియం, విటమిన్‌-బి, ఫ్యాటీ ఆమ్లాలు లోపించినా ఈ కోరిక కలుగుతుందట! కాబట్టి చాక్లెటే కదా అని ఎక్కువగా లాగించేయకుండా ఒకటి లేదా రెండు బైట్ల డార్క్‌ చాక్లెట్‌తో మనసును సంతృప్తి పరచుకోమని చెబుతున్నారు నిపుణులు.


టీ/కాఫీ

చాలామందికి టీ/కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కానీ ఇవి ఎక్కువగా తాగాలనిపిస్తుందంటే అందుకు ముఖ్య కారణం శరీరం డీహైడ్రేషన్‌కి గురైందని అర్థమట! అది కాదంటే టీ/కాఫీలకు బాగా అలవాటు పడైనా ఉండాలి. అయితే కెఫీన్‌ ఎక్కువగా ఉండే వీటిని తీసుకుంటే గుండె కొట్టుకునే వేగం పెరిగి గుండె సంబంధిత సమస్యలొస్తాయి కాబట్టి.. రోజుకు ఒకటి లేదా రెండు కప్పులతో సరిపెట్టుకోమంటున్నారు నిపుణులు. అలాగే శరీరంలో నీటిస్థాయులు పడిపోకుండా ఉండేందుకు రోజుకు రెండు నుంచి రెండున్నర లీటర్ల నీళ్లు తాగడం మర్చిపోవద్దు.


ఆయిల్‌ ఫుడ్స్‌/ఫాస్ట్‌ ఫుడ్స్‌/జంక్‌ ఫుడ్స్‌

శరీరంలో లెప్టిన్‌ (ఆకలిని తగ్గించే హార్మోన్‌) స్థాయులు తగ్గినప్పుడు, కార్టిసాల్‌ (ఒత్తిడి హార్మోన్‌) స్థాయులు పెరిగినప్పుడు క్రమంగా ఆకలి పెరుగుతుంది. అలాగే నిద్ర లేకపోయినా ఆకలి ఎక్కువగా అవుతుందట! ఇలాంటి సమయంలో కొవ్వులు, నూనెతో చేసిన పదార్థాలు, చక్కెర అధికంగా ఉండే ఫుడ్స్‌ తినాలని మనసు కోరుకుంటుందట! కాబట్టి ఈ సమయంలో బయటదొరికే ఫాస్ట్‌ ఫుడ్స్‌, నూనె సంబంధిత పదార్థాలకు బదులు అవకాడో, నట్స్‌, గింజలు, పీనట్‌ బటర్‌.. వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. ఫలితంగా అధిక బరువు, మధుమేహం, రక్తపోటు.. లాంటి అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చు.


బ్రెడ్‌/పాస్తా

ఎవరికైనా పాస్తా, బ్రెడ్‌ లాంటి కార్బోహైడ్రేట్లు నిండి ఉన్న పదార్థాలు తినాలనిపిస్తే.. వారిలో అమైనో యాసిడ్‌ ట్రిప్టోఫాన్‌ అనే అత్యవసర అమైనో ఆమ్లం లోపం ఉందని అర్థమట! సాధారణంగా ఈ అమైనో ఆమ్లం శరీరంలో సెరటోనిన్‌ (హ్యాపీ హార్మోన్‌) విడుదలను ప్రేరేపిస్తుంది. దీన్ని పొందడానికి కార్బోహైడ్రేట్లు తీసుకోమని శరీరం మెదడుకు సంకేతం పంపుతుంది. అలాగే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీటిని మితంగా తీసుకొని మనసును సంతృప్తి పరచుకుంటూనే.. క్యాలీఫ్లవర్‌/బ్రకలీ, చిలగడదుంప, తక్కువ కార్బోహైడ్రేట్లుండే పాస్తా.. వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించడం ఉత్తమం అని చెబుతున్నారు నిపుణులు.


Advertisement

మరిన్ని