Egg Freezing: ఎగ్‌ ఫ్రీజింగ్‌ వల్ల మెనోపాజ్‌ ముందే వచ్చేస్తుందా?

అండాల శీతలీకరణ పద్ధతిపై ఉండే కొన్ని సందేహాలు/అపోహలేంటి? వాటి గురించి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

Published : 27 Jul 2023 12:16 IST

కెరీర్‌, వ్యక్తిగత కారణాల రీత్యా ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవాలనుకునే ఈ కాలపు మహిళలకు అండాల శీతలీకరణ (Egg Freezing) పద్ధతి వరంగా మారిందని చెప్పచ్చు. వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని సేకరించి.. భద్రపరచుకొని.. కావాల్సినప్పుడు పిల్లల్ని కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్ధతిని సెలబ్రిటీలే కాదు.. కొంతమంది సామాన్యులూ పాటిస్తున్నారు. అయితే కొంతమందిలో దీనిపై పలు సందేహాలూ లేకపోలేదు. ఇలా అండాల్ని సేకరించడం వల్ల అండాల సంఖ్య తగ్గిపోయి.. త్వరగా మెనోపాజ్‌ వస్తుందేమోనని కొందరు భయపడితే.. అసలు ఎగ్‌ ఫ్రీజింగ్‌కి ఏ వయసు సరైందో మరికొందరు తేల్చుకోలేకపోతారు. దీనివల్ల సక్సెస్‌ రేటు ఎలా ఉంటుందోనన్న సందిగ్ధత మరికొందరిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో.. అండాల శీతలీకరణ పద్ధతిపై ఉండే కొన్ని సందేహాలు/అపోహలేంటి? వాటి గురించి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

ఎగ్‌ ఫ్రీజింగ్‌తో వంద శాతం సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుందా?

కెరీర్‌కు ప్రాధాన్యమివ్వడం, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, ఇతర వ్యక్తిగత కారణాల రీత్యా ఈ కాలంలో ఎగ్‌ ఫ్రీజింగ్‌ను ఎంచుకుంటోన్న జంటలెన్నో! అయితే.. అండాల్ని భద్రపరచుకున్నాం కదా.. ఇక మనకు నచ్చినప్పుడు పిల్లల్ని కనచ్చు.. వందశాతం సంతానం గ్యారంటీ! అనుకుంటారు చాలామంది. కానీ ఈ అతి విశ్వాసం పనికి రాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. గర్భధారణ అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో గర్భాశయం ఆరోగ్యం, శుక్రకణాల నాణ్యత.. వంటివీ కీలకమే! కాబట్టి శీతలీకరించుకున్న అండాల వల్ల సంతాన ప్రాప్తి 43 శాతమేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఎక్కువ అండాల్ని భద్రపరచుకోవడం, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడడం, ఆరోగ్యకరమైన జీవనశైలి, వీలైనంత వరకు 35 ఏళ్లు దాటక ముందే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకోవడం.. వంటి విషయాల్లో కచ్చితమైన ప్రణాళిక ఉంటే.. సంతాన భాగ్యానికి నోచుకునే అవకాశాలు పెరుగుతాయంటున్నారు నిపుణులు.

అండాల శీతలీకరణ ప్రక్రియ నొప్పితో కూడుకొని ఉంటుందా?

ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన చికిత్సలు తీసుకోవడానికి, చెకప్స్‌ చేయించుకోవడానికి చాలామంది భయపడుతుంటారు. ఇందుకు సిగ్గు/బిడియం ఒక కారణమైతే.. నొప్పి భయంతో మరికొందరు వెనకడుగు వేస్తారు. ఈ నొప్పి భయంతోనే ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతికి కొంతమంది దూరంగా ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి చికిత్సలోనైనా కాస్త నొప్పి ఉన్నట్లే.. ఈ ప్రక్రియలోనూ కాస్త అసౌకర్యం కలగడం వాస్తవమేనని.. అయితే మత్తు మందు ఇవ్వడం వల్ల అంత ఇబ్బంది ఏమీ అనిపించకపోవచ్చంటున్నారు. అలాగే ఇది సింపుల్‌గా పూర్తయ్యే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ తరహా పద్ధతిని పోలి ఉంటుందని, శరీరంపై కత్తి గాట్లు, కుట్లు.. వంటివేవీ ఉండవని చెబుతున్నారు.

ఈ సమయంలో శృంగారంలో పాల్గొనచ్చా?

ఇక అండాల సేకరణకు గరిష్టంగా పావుగంట సమయం పట్టినా.. రెండు వారాల ముందు నుంచే ఇందుకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుందట! ఈ క్రమంలో డాక్టర్‌ సలహా మేరకు హార్మోనల్‌ మందులు వాడాల్సి ఉంటుంది. ఇక ఈ సమయంలో దంపతులు శృంగారానికీ దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే హార్మోన్ల మందుల ప్రభావంతో గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇక గర్భ నిరోధక మాత్రలు వాడాలనుకుంటే.. ముందు వైద్యుల సలహా తప్పనిసరి అంటున్నారు.

ఎగ్‌ ఫ్రీజింగ్‌కు, మెనోపాజ్‌కు సంబంధముంటుందా?

ఆడపిల్ల పుట్టే సమయంలో ఆమె అండాశయంలో సుమారు 10-20 లక్షల పరిణతి చెందని అండాలుంటాయి. రజస్వల ప్రారంభమయ్యే సమయంలో పరిణతి చెందిన అండాల సంఖ్య దాదాపు 3 లక్షలుంటుంది. ఇక అప్పట్నుంచి ఏళ్లు గడిచే కొద్దీ అండాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. 30-35 ఏళ్లు దాటాక వాటి నాణ్యత కూడా తగ్గిపోతుంటుంది. అందుకే 25-35 ఏళ్ల మధ్య వయసులో అండాల్ని భద్రపరచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అయితే ఇలా అండాల్ని సేకరించి భద్రపరచుకోవడం వల్ల సంతాన రేటుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని అంటున్నారు. అలాగే దీనివల్ల అండాల సంఖ్య తగ్గి మెనోపాజ్‌ త్వరగా వస్తుందన్నదీ అపోహేనంటున్నారు.

ఏళ్లు గడిచే కొద్దీ అండాల నాణ్యత తగ్గిపోతుందా?

అండాల్ని భద్రపరచుకోవడమంటేనే.. వాటిని అవసరమైనప్పుడు తిరిగి ఉపయోగించుకునేందుకు వీలుగా జాగ్రత్త చేసుకోవడం. ఈ క్రమంలో అండాశయం నుంచి సేకరించిన అండాల్ని కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో/ ద్రావణాల్లో ఉంచి నిల్వ చేస్తారు. ఫలితంగా సేకరించినప్పుడు అవి ఎంత ఆరోగ్యంగా, తాజాగా ఉంటాయో.. ఏళ్లు గడిచినా వాటి నాణ్యత మారదంటున్నారు నిపుణులు. అందుకే ఈ పద్ధతిలో శీతలీకరించుకున్న అండాల్ని తిరిగి ఉపయోగించుకుంటూ నలభైల్లోనూ చాలామంది ఆరోగ్యవంతమైన సంతానానికి జన్మనిస్తున్నట్లు చెబుతున్నారు. కాబట్టి పిల్లల్ని కనే వయసు కంటే.. అండాల్ని భద్రపరచుకొనే వయసే ముఖ్యమంటున్నారు.

గమనిక: ఈ సమాచారం కేవలం ఒక ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. దీనికి సంబంధించిన మరిన్ని సూచనలు, సలహాల కోసం వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్