Published : 25/05/2022 01:52 IST

తెర వీడండి!

అలవాటు కాస్తా వ్యసనంగా మారితే దాన్ని వదిలించుకోవడం అంత తేలిక్కాదు. ఆ వ్యసనం మత్తులో కూరుకోకముందే జాగ్రత్తపడాలి. అరె ఇదంతా మాకెందుకు చెబుతున్నారు అంటారా? నెలల పాపాయి నుంచి వయసు మళ్లిన పెద్దవాళ్లూ ఎదుర్కొంటున్న ఆ వ్యసనం పేరే ‘తెరకి అతుక్కుపోవడం’. ఈ మత్తులో మీరూ కూరుకున్నారేమో ఆలోచించండి...!

టీటీ, వాట్సప్‌, యూట్యూబ్‌, సీరియళ్లు, వార్తలు,  గేమింగ్‌... ఇలా కారణాలు మారుతున్నా చివరిగా మనమంతా మితిమీరి తెరకి అతుక్కుపోతున్న వాళ్లమే. కొవిడ్‌ తర్వాత పిల్లలూ, పెద్దవాళ్లు కూడా ఈ జాబితాలోకి చేరిపోయారు. ఇలా తెర సమయం (స్క్రీన్‌ టైం) పెరగడాన్ని సాధారణంగా భావించకుండా వీలైనంతగా తగ్గించుకోవాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే...

మనసుపై ఇలా దెబ్బ కొడుతోందా?: సోషల్‌ మీడియా జీవితం ఇంతవరకూ మనల్ని మానసికంగా, శారీరకంగా మాత్రమే ప్రభావితం చేసిందనుకుంటే పొరపాటు. ఇది మన మెదడులో కూడా కొన్ని మార్పులకు కారణం అవుతోందని తాజా హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లల్లో నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం జరగాల్సిన కొన్ని మార్పులు ఫోన్ల వాడకం వల్ల చాలా వేగంగా, ముందుగానే జరుగుతున్నాయట. ముఖ్యంగా మెదడుపైన ఉండే కోర్‌టెక్స్‌ పొర పంచేంద్రియాల నుంచీ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం, అవగాహన తెచ్చుకోవడం, దృష్టి పెట్టడం వంటి పనులు చేస్తుంది. కానీ ఈ పొర ఫోన్‌ వాడకం వల్ల పల్చబడి ఈ పనిని ముందుగానే చేయడం వల్ల పిల్లల్లో ముందస్తు పెద్దరికం వస్తోందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. అతిగా ఆన్‌లైన్‌లో ఉండేవారిలో జ్ఞాపకశక్తి సమస్యలూ తలెత్తుతున్నాయి. వెల్లువెత్తుతున్న పోస్టులు, ఫొటోల కారణంగా మెదడు దేన్ని గుర్తు పెట్టుకోవాలో, దేన్ని మరిచిపోవాలో తెలియక సతమతవుతోంది.
శారీరకంగానూ: స్క్రీన్‌ సమయం పెరిగేకొద్దీ కళ్లు, మెడ, వెన్నుపాము సమస్యలతోపాటు అధిక బరువు, గుండెజబ్బులకు కూడా కారణమవుతోంది.

ఇలా చేసి చూడండి: నిద్ర పోవడానికి గంట ముందు టీవీ సహా అన్ని తెరలనీ ఆపెయ్యండి. కుటుంబమంతా కలసి ఉన్నప్పుడు ఆ సమయాన్ని స్క్రీన్‌ ఫ్రీ జోన్‌గా ప్రకటించి మొబైల్‌ దూరం పెట్టండి.
* వారానికోసారి ఉపవాసం ఉన్నట్టుగా... వారానికోసారి మొబైల్‌ ఉపవాసం ఉండండి. ఆ రోజంతా నేను ఫోన్‌కి దూరంగా ఉంటానని అనుకోండి. ఇదోరకం ‘డిజిటల్‌ ఫాస్టింగ్‌’ అన్నమాట.
* పిల్లలు వాళ్ల సంతోషం మొత్తాన్ని ఫోన్‌లు, టీవీల్లోనే వెతుక్కుంటున్నారు. దాంతో వాళ్లకి మానవ సంబంధాల అవసరం తెలియడం లేదు. మొబైల్‌ విజ్ఞానంలో ప్రశ్నలు ఉండవు. సమాధానాలు మాత్రమే ఉంటాయి. ఆ కారణంగానే పిల్లల్లో నోరుతెరిచి మాట్లాడాల్సిన అవసరం రావడం లేదు. చాలామంది పిల్లలకి స్పీచ్‌ థెరపీ ఇచ్చి మాట్లాడించాల్సిన పరిస్థితి.

అతిగా వాడే వారి జాబితాలో మీరూ ఉన్నారా?... చెక్‌ చేయండిలా!

* అర్ధరాత్రి లేచి ఉన్నట్టుండి ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ని చెక్‌ చేస్తున్నారా?
* నిద్రముంచుకొస్తున్నా, ఆకలి దంచుతున్నా, ఇంట్లో పని కొండలా పేరుకుపోయినా... పట్టించుకోకుండా ఫోన్‌లో మునిగిపోయారా.
* కాసేపు ఫోన్‌ చూడకపోతే కోపం, ఒత్తిడి, ఏదో కోల్పోయినట్టు అనిపిస్తోందా?
* రోజులో 8 గంటలకన్నా ఎక్కువ తెరని చూస్తున్నారా?
* మీ చదువు, కెరియర్‌పై ఫోన్‌ ప్రభావం ఉందా?

ఈ ప్రశ్నలకు అవును అనే జవాబు వస్తే మీరూ ఆ వ్యసనంలో ఉన్నారనే లెక్క.


అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ నిబంధనల ప్రకారం... ఏడాదిన్నరలోపు పిల్లలకు అసలు ఫోన్‌ తెరని పరిచయం చేయకూడదు. రెండు నుంచి ఐదేళ్లలోపు వాళ్లకి రోజుకి ఒక గంట మించి ఫోన్‌ని ఇవ్వకూడదు. కానీ మనదేశంలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులున్నాయి.  ఏడాదిలోపు ఉన్న పసిపిల్లల్లో 96 శాతం మంది ఫోన్‌ని గుర్తుపట్టేస్తున్నారు.

16 గంటల కన్నా ఎక్కువ సమయం ఫోన్‌ చూసేవాళ్లని వ్యసనపరులుగా భావిస్తాం. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలూ మా దగ్గరకు ఫోన్‌ సంబంధిత సమస్యలతో వస్తున్నారు. పసిప్లిలలకి గంటకు మించి ఫోన్‌ ఇవ్వకూడదు. ఈ విషయంలో కఠినంగా ఉంటే ఫోన్‌ అలవాటు కాకుండా ఉంటుంది. ఇక ఫోన్‌ వదల్లేని స్థితిలో ఉన్న పిల్లలని ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, కోకో, కబడ్డీ వంటి టీంగేమ్స్‌లో భాగస్వామ్యం చేస్తాం. వీళ్లు లేకపోతే ఆట మొత్తం ఆగిపోతుందని ఫోన్‌ పక్కనపెట్టి నెమ్మదిగా ఆటలకు అలవాటు పడతారు. ఆన్‌లైన్‌ క్లాసుల్లో పిల్లలు వేరే విండో తెరిచి ఆటలు ఆడుతున్నారా? క్లాసు వింటున్నారా అని తెలుసుకొనేందుకు ప్రత్యేకంగా టీచర్లని నియమిస్తున్నారు. వాళ్లు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ కూడా వినడం మంచిది. మొదట్లోనే ఈ అలవాటుని తుంచేయొచ్చు. ఇక పెద్దవాళ్లనయితే.. నీళ్లు ఎక్కువ తాగమని చెబుతాం. దాని వల్ల గంటకోసారి వాష్‌రూమ్‌కి వెళ్తారు. కూర్చునే భంగిమ గంటలకొద్దీ ఒకే విధంగా ఉండకుండా మారి.. మెడనొప్పి, వెన్నునొప్పి రాకుండా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని