Published : 17/11/2022 00:33 IST

త్వరిత యవ్వనం.. కారణమేంటి?

12-14 ఏళ్ల వయసుకి నెలసరి ప్రారంభమవ్వడం సాధారణంగా భావిస్తాం. 8-10 ఏళ్లలోపే యవ్వనంలోకి అడుగు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణమేంటి? అలాంటప్పుడేం చేయాలి? నిపుణుల సూచనలివిగో!

నెలసరి ప్రారంభమవడం అంటే ప్రత్యుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెందుతుండటమని అర్థం. అమ్మాయిల శరీరంలో ప్రధాన మార్పులన్నీ ఈ దశలోనే మొదలవుతాయి. 12 - 14 ఏళ్లలోపు ప్రారంభమైతే దీన్ని సహజంగానే పరిగణిస్తారు. త్వరిత యవ్వనం కొత్తేమీ కాదు. 10లోపు పిల్లల్లో గతంలో చాలా కొద్ది మందిలో నెలసరి కనిపించేది. అయితే కొవిడ్‌ తర్వాత ఈ సంఖ్య రెట్టింపు, మూడొంతులు పెరిగిన దాఖలాలున్నాయి. అయిదేళ్ల వయసు వారిలోనూ కనిపిస్తుండటమే సమస్య.

విదేశాల్లోనూ ఇదే పరిస్థితి.

కారణమేంటి? ఆటలకు దూరమవడం, టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోవడం, చిరు తిళ్లు, ఊబకాయం.. ఇలా బోలెడు కారణాలు. నాడీవ్యవస్థపై పడే దుష్ప్రభావాలు, ఆహారం ద్వారా లోనికెళ్లే కొన్ని రకాల రసాయనాలూ కారణం కావొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమయ్యాం. గోల చేస్తున్నారనో, చదువు కోసమనో గ్యాడ్జెట్లకే పరిమితం చేశాం. ఒళ్లు పెద్దగా కదలక బరువు పెరిగి, ఆ ప్రభావమూ ముందస్తు నెలసరికి కారణమవుతోందట.

ఇది సమస్యేనా! శరీరం త్వరగా అభివృద్ధి చెందినంత మాత్రాన మనసూ ఎదగాలనేం లేదు. రక్తాన్ని చూసి పిల్లలు అయోమయ పడొచ్చు. కొందరు భయపడతారు కూడా. ఒక్కసారిగా హార్మోనుల్లో వచ్చే మార్పులు వాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శరీరంలో వచ్చే మార్పుల్నీ సానుకూలంగా తీసుకోలేకపోవచ్చు. చాలామందిలో నెలసరి తర్వాత ఎత్తు పెరగడం నెమ్మదిస్తుంది. పీసీఓడీ, హార్మోనుల్లో అసమతుల్యత వంటివీ కనిపిస్తున్నాయి. ఇతరులతో పోల్చుకొని కుంగి పోవడం, ప్రవర్తన సమస్యలు, ఒత్తిడి వంటివి కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు డిప్రెషన్‌కూ దారి తీయొచ్చు.

మన బాధ్యతేంటంటే.. ఆరోగ్యకరమైన జీవన శైలిని అందించగలగాలి. వాళ్లకు స్నేహితుల్లా మారాలి. శరీరంలో మార్పులపై అవగాహన కలిగించాలి. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌.. చెప్పాలి. ఆకర్షణలు, వాటి ప్రభావం వంటివి సహజం. వాటిని గమనిస్తూ దిశానిర్దేశం చేయాలేగానీ.. నిందించడం, కొట్టడం చేయొద్దు. అవీ మానసిక సమస్యలకు కారణమవుతాయి. ఏ చిన్న సందేహమొచ్చినా వైద్యుల సాయం తీసుకోవాలి. వాళ్లని అర్థం చేసుకుంటూ, ప్రోత్సహిస్తూ సరైన మార్గంలో నడిపించాలి. ఆ బాధ్యత మనదే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని