Published : 09/10/2021 01:51 IST

మంచి అమ్మానాన్నలుగా...

రమణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న భర్త సురేశ్‌ నుంచి ఏ సాయమూ అందక సతమతమవుతోంది. బిడ్డపై తగిన శ్రద్ధ చూపలేకపోతున్నా అని ఆవేదన చెందుతోంది. ఈ తరహా దంపతులు మంచి తల్లిదండ్రులు కాలేరని చెబుతున్నారు మానసిక నిపుణులు.

* పంచుకోవాలి... గతంలో ప్రసవం సమయానికి అత్తామామలు లేదా తల్లిదండ్రులు దగ్గర ఉండేవారు. పిల్లల ఆలనపాలన చూసుకునేవారు. ప్రస్తుతం అన్నీ చిన్న కుటుంబాలే కావడంతో భార్యాభర్తలే ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరమెంతో ఉంది. కొత్తగా తల్లి అయినవారు పాపను సంరక్షించుకోవడం, పాలు పట్టడం వంటి పనులతో అలిసి పోతారు. ప్రసవం తర్వాత కలిగే ఒత్తిడీ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇటువంటి సమయంలో భర్త ఆమె పనులను కొన్నైనా పంచుకోవాలి.

* శిక్షణ... కాబోయే అమ్మా నాన్నలకు ఆసుపత్రిలో శిక్షణనందిస్తున్నారు. ఇద్దరూ దానికి హాజరైతే మంచిది. బిడ్డకు పాలు పట్టడం, నిద్ర పుచ్చడం నుంచి చాలా విషయాలపై కాబోయే తల్లికి శిక్షణ ఉంటుంది. అలాగే పసిపాపను ఎత్తుకోవడం నుంచి డైపర్లు మార్చడం వరకు కాబోయే తండ్రికి నేర్పుతారు. ఇవి తెలుసుకుంటే కొన్ని పనులనైనా భర్త చేయొచ్చు. 

* ఆ సమయంలో.. పగలంతా పని, రాత్రివేళల్లో పాపాయితో నిద్రకు దూరమయ్యే భార్యకు పగటిపూట కాసేపైనా నడుం వాల్చడానికి అవకాశాన్ని కల్పించాలి. ఆ సమయంలో పాపను చూసుకుంటే, ఆమె నిద్రలేమి బారిన పడదు. ఆ సమయంలో పౌష్టికాహారాన్ని అందించడం, పాపకు స్నానం చేయించేటప్పుడు చేయూతగా ఉండటం వంటివీ భర్త చేయాలి. ఆసుపత్రికెళ్లాల్సిన తేదీలను, ప్రసవానంతరం బుజ్జాయికి వేయాల్సిన వ్యాక్సిన్ల వివరాలను ఓ పుస్తకంలో రాసుకుని, దాని ప్రకారం వేయించడం వంటివన్నీ నాన్న బాధ్యతగా తీసుకుంటే అమ్మకి కాస్త ఉపశమనం. ఏ పనినైనా కలిసి చేయడంలో ఒకరికొకరు మద్దతునిచ్చుకుంటే పాపాయి కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.

* కోపం...  దంపతుల్లో ఒకరికొకరు కష్టాన్ని, అవసరాన్ని గుర్తించకపోతే ఎదుటివారిపై ఆ ప్రభావం పడుతుంది. అది పలు శారీరక, మానసిక అనారోగ్యాలకు దారి తీస్తుంది. దీని ప్రభావం పెరిగే పిల్లలపై పడుతుంది. దాంతో తల్లిదండ్రులిద్దరికీ పిల్లలు దగ్గరకాలేరు. అలాకాక  భార్యా భర్తలు ఏ పనినైనా పంచుకుంటూ ఉంటే అది వారి బంధాన్ని బలపరుస్తుంది. అంతేకాదు, చిన్నారులతో ఎక్కువ సమయం గడుపుతూ, వారికి సంతోషాన్ని అందిస్తే ఇంటి వాతావరణమూ ఆహ్లాదమవుతుంది. పిల్లలూ ఆరోగ్యంగా ఎదుగుతారు. ఆ దంపతులూ మంచి తల్లిదండ్రులవుతారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని