నువ్వే స్ఫూర్తి నాన్నా
close
Updated : 19/12/2021 05:12 IST

నువ్వే స్ఫూర్తి నాన్నా!

పిల్లలకు అమ్మ ఎంత స్ఫూర్తిగా నిలుస్తుందో, తండ్రి కూడా మంచి మార్గదర్శకుడు కాగలడు అంటున్నారు మానసిక నిపుణులు. బాల్యం నుంచి తండ్రిని చూసి చాలా అంశాలను నేర్చుకున్నామంటూ ప్రముఖులెందరో తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. చిన్నారులకు మంచి నాన్నగానే కాకుండా, ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకునేలా వారికి స్ఫూర్తిగా నిలిచేలా.. తండ్రి వ్యవహరించాలంటున్నారు.

* చేయూతగా... పిల్లలకు ప్రతి పనిలో చేయూతగా ఉండాలి. వారికి చదువులోనే కాకుండా స్నేహితుల విషయంలోనూ ఎదురయ్యే సమస్యలకూ పరిష్కారాన్ని చూపించగలగాలి. వారికి తగిన సౌకర్యాలు కలిగించడానికి ప్రయత్నించాలి. పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలనే కల సాకారం అవ్వాలంటే వారికి అవకాశాలు వచ్చినప్పుడు వెన్నుతట్టి ప్రోత్సాహాన్ని అందించాలి. కెరియర్‌ను ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలి. నిత్యం వారిని పరిరక్షిస్తూ, మీరు ముందడుగు వేయడానికి నేనున్నాననే భరోసా ఇవ్వాలి.
* నైపుణ్యాలు... తమలోని నైపుణ్యాలను పెంపొందించు కుంటేనే పిల్లలకు వాటిపై వచ్చే సందేహాలను తీర్చగలడం, అందులో శిక్షణ ఇవ్వగలగడం వీలవుతుంది. అందుకే తండ్రికూడా నిత్యవిద్యార్థిగా మారాలి. ఎప్పటికప్పుడు ప్రాపంచిక విషయాలపై అప్‌డేట్‌ అవుతూ ఉండాలి. ఇలా స్వయంగా నైపుణ్యాలను పెంచుకోవడంతో పిల్లలూ స్ఫూర్తిని పొందుతారు. తండ్రిని చూసి తమని తాము మెరుగు పరచుకోవడానికి ప్రయత్నిస్తారు.
* అలవాట్లు... తండ్రిలోని మంచి అలవాట్లు పిల్లలకు క్రమేపీ పాఠాలుగా మారతాయి. పుస్తక పఠనం, క్రీడలు వంటి అభిరుచులతోపాటు ఇతరులను గౌరవించడం, సహనం, సంయమనం పాటించడం, సమస్యలను పరిష్కరించే విధానం వంటివన్నీ అలవరుచు కుంటారు. వాటినే అనుసరిస్తారు. అమ్మను ప్రేమగా చూసే నాన్నను చూస్తూ పెరిగే పిల్లలు, వారి జీవితంలో తటస్థపడే మహిళలనూ గౌరవించేలా పెరుగుతారు. సామాజిక అంశాలకు స్పందిస్తూ, మంచి జీవిత విలువలను అందించే తండ్రి తన పిల్లలకు గర్వకారణంగా నిలుస్తాడు.


Advertisement

మరిన్ని