Published : 19/01/2022 01:21 IST

నీ వెంటే...

పెద్దవారిలాగానే చిన్నారుల్లోనూ భిన్న భావోద్వేగాలుంటాయి. దెబ్బ తగిలినా... బాధేసినా, ఎవరైనా కోప్పడినా మొదట వచ్చేది ఏడుపే. కళ్ల నుంచి నీటి చుక్కలు జలజలా రాలతాయి. ఆ సమయంలో వారికి ఓదార్పు నివ్వాలి... అది ఎలా ఉండాలంటే...

ల్లిదండ్రులుగా చిన్నారి ఉద్వేగాలను వ్యక్తపరచడానికి అనుమతివ్వాలి. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చిన్నారి ఏడుస్తూ రాగానే... ‘ఇక ఆపు’ అని గద్దించకుండా కారణమేంటో, అసలేం జరిగిందో అనునయంగా తెలుసుకోవాలి. పిల్లలు కుంగుబాటుకు గురైనప్పుడు దగ్గరకు తీసుకుని సాంత్వన కలిగించేలా నాలుగు మాటలు చెప్పాలి. చిన్నారి బాధపడుతోంటే ‘నేనున్నా కన్నా... నీకు తోడుగా’ అంటూ ప్రేమగా అక్కున చేర్చుకోవాలి. కొండంత అండగా ఉన్నామంటూ ధైర్యం చెప్పాలి. వారికి సమస్య వస్తే మీ వంతు సహకారం అందించాలి. అంతే తప్ప ‘నువ్వే పరిష్కరించుకో’ అని వదిలెయ్యద్దు.

ఏడవనివ్వండి... ఏడ్చే చిన్నారిని కాసేపు ఏడవనివ్వండి. దాని వల్ల తన బాధ కాస్తయినా తగ్గుతుంది. ఆ తర్వాత విషయం ఏంటో కనుక్కుని పరిష్కారాన్ని సూచించండి. తను చెప్పే విషయాలను అమ్మ పట్టించుకుంటుందని, నాన్న అర్థం చేసుకుంటాడనే భరోసాను కల్పిస్తే చాలు. ఎలాంటి ఇబ్బంది, సమస్య వచ్చినా భయపడకుండా, బాధపడకుండా ఎదురెళ్లడానికి సిద్ధమైపోతారు. మార్పు శాశ్వతమని, ఇప్పుడు వచ్చిన ఇబ్బంది రేపు ఉండక పోవచ్చని, కాబట్టి బాధపడకుండా సమస్యకు పరిష్కార సాధన దిశగా సాగాలని చిన్నారులకు దిశానిర్దేశం చేయాలి. చివరగా... చిన్నారులకు తగినంత స్వేచ్ఛ ఇవ్వాలి. అలాగే వారికి కావాల్సినప్పుడు మీ చేయూతను అందించడానికి అన్నివేళలా మీరు సిద్ధంగా ఉన్నారని వారికి తెలిసేలా చేయాలి. ఒక్కోసారి మన పిల్లలదే తప్పు ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు వెంటనే రౌద్ర రూపం దాల్చకండి. అలా చేస్తే మరో సారి ఏ సమస్యలో చిక్కుకున్నా మీ దగ్గరకు రావడానికి భయపడతారు. సౌమ్యంగా వారితో మాట్లాడండి. మంచిమాటలతో సాధారణంగా వారి తప్పును వారే ఒప్పుకుంటారు.


Advertisement

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి