గిన్నిస్‌ జంటల ప్రేమ సూత్రాలు

ప్రేమించుకోవడం తేలిక. ఆ బంధానికి శాశ్వతత్వాన్ని అందించడమే కష్టం. ఆ భావం కొంతకాలానికి దూరమవుతోంది. ప్రేమికులు బ్రేక్‌ అప్‌ చెప్పేస్తుంటే.. కొందరు భార్యాభర్తలు విడిపోతున్నారు. మరికొందరు ఇష్టం లేని సంసారాలను లాక్కొస్తున్నారు.

Published : 14 Feb 2022 00:21 IST

ప్రేమించుకోవడం తేలిక. ఆ బంధానికి శాశ్వతత్వాన్ని అందించడమే కష్టం. ఆ భావం కొంతకాలానికి దూరమవుతోంది. ప్రేమికులు బ్రేక్‌ అప్‌ చెప్పేస్తుంటే.. కొందరు భార్యాభర్తలు విడిపోతున్నారు. మరికొందరు ఇష్టం లేని సంసారాలను లాక్కొస్తున్నారు. కానీ కొన్ని జంటలు సుదీర్ఘకాలం ప్రేమను కాపాడుకుని గిన్నిస్‌ రికార్డులకెక్కాయి. మరి ఇన్ని దశాబ్దాలు ప్రేమబంధాన్ని వాళ్లు ఎలా నిలబెట్టుకున్నారో చూడండి...

ఆ ప్రేమకు 27 ఏళ్లు...

అది ప్రేమికుల దినోత్సవం. అదే రోజు ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగాడు అతడు ప్రేమగా. ఆ గొంతులో అనురాగానికి ముగ్ధురాలైందామె. క్షణం ఆలస్యం చేయకుండా అంగీకారాన్ని చెప్పింది. అలా ఇద్దరూ 2015లో ఒక్కయ్యారు. ఈ పెళ్లి ప్రపంచరికార్డుకెక్కింది. ఎందుకంటే.. వారి ప్రేమకు 27 సంవత్సరాలైతే, వరుడు జార్జి కిర్బీ వయసు 103, వధువు డోరీన్‌ లుకీకి 91 ఏళ్లు. ఇంత పెద్ద వయసులో చేసుకున్న పెళ్లి ప్రపంచంలో ఇదే మొదటిది. దాంతో ఈ జంట గిన్నిస్‌ రికార్డుకెక్కింది. లండన్‌కు చెందిన ఈ ఇద్దరూ 1988లో ఓ పెళ్లిళ్ల సంస్థ ద్వారా కలుసుకున్నారు. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయారు. 27 ఏళ్లు కలిసి జీవించి, ఆ తర్వాత దంపతులయ్యారు. అప్పటి వరకు తమ ప్రేమ సజీవంగా ఉండటానికి కారణాలెన్నో అంటారీ ప్రేమికులు. ‘డోరీన్‌లో మంచి స్నేహితురాలుంది. తనతో కలిసి గడిపిన ప్రతీ క్షణం విలువైనదే.. వాటిని పెళ్లి పేరుతో మరింత శాశ్వతం చేసుకోవాలనిపించింది. అందుకే ప్రేమికుల దినోత్సవాన ప్రపోజ్‌ చేశా. తను ఓకే చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింది’ అని జార్జి అంటే, ‘తను క్షణం కూడా మరవకుండా నన్నే ప్రేమిస్తూ ఉన్నాడు. మా మధ్య చిన్న చిన్న సమస్యలకు, గొడవలకు ఆస్కారమే రానివ్వలేదు. దొరికే ఈ ఒక్క జీవితాన్ని సంతోషంగా గడపాలి అంటాడు. అదే తనలో నాకు నచ్చిన అంశం’ అంటూ మురిసిపోయింది డోరీన్‌.

ఒకరి కోసం మరొకరు...

దక్షిణ అమెరికాకు చెందిన 110 ఏళ్ల జూలియో సీజర్‌, 105 ఏళ్ల వాల్డ్రమినాల దాంపత్యానికీ గిన్నిస్‌ రికార్డు దక్కింది. వీరికి పెళ్లై 79 ఏళ్లైంది. 1934లో బంధువుల ఇంట్లో వాల్డ్రమినాను చూసిన జూలియో తొలిచూపులోనే ఆమెపై మనసు పారేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే అని గట్టిగా అనుకున్నాడు. తాను రాసిన కవితలను ఆమెకు వినిపించే వాడు. సాహిత్యం వారిద్దరినీ మరింత దగ్గర చేసింది. ఏడేళ్లు సాగిన వీరి ప్రేమ బంధం 1941లో వివాహంతో మరింత గట్టిపడింది. వీరి పెళ్లికి పెద్దవాళ్లు అంత తేలిగ్గా ఒప్పుకోలేదు. ఇరువైపుల వారినీ ఎంతో సహనంగా ఒప్పించారు. తమ మధ్య ఉండే గౌరవం, ప్రేమ, పరిణతి ఇన్నాళ్లూ సంతోషంగా కలిసి బతకడానికి ప్రేరణయ్యాయని చెబుతారు. ఈ బోసి నవ్వుల జంటకు అయిదుగురు సంతానం, 11 మంది మనవళ్లు, 30 మంది మునిమనవళ్లు, మనవరాళ్లు.

ఈ జంటల ప్రేమ మార్గాలివీ..

* పరస్పరం గౌరవించుకోవాలి.  ఒకరి మనసును మరొకరు చదివి, అర్థం చేసుకొని, ప్రవర్తించాలి.

వాదనలు, గొడవల్లేకుండా సమస్యను అప్పటికప్పుడే చర్చించి పరిష్కరించుకోవాలి.

* పరిణతి తెచ్చుకోవాలి. అప్పుడే ఎదుటివారి భావోద్వేగాలు అర్థమవుతాయి. భాగస్వామి అభిరుచి, లక్ష్యాలను గౌరవిస్తే చాలు. కష్టసమయాల్లో ఒకరినొకరు నిందించుకోకుండా తోడుగా ఉన్నామనే భరోసా అందించాలి.

* దయ, కరుణ, ప్రేమ, నిజాయతీ ఉండే ఏ బంధమైనా శాశ్వతమవుతుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్