పిల్లలకు కావాలి ప్రసంగ నైపుణ్యాలు...

చిన్నారులకు చిన్నప్పటి నుంచే ప్రసంగ నైపుణ్యాలను నేర్పించాలంటున్నారు నిపుణులు. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సూచిస్తున్నారు. ఎలా శిక్షణనివ్వాలో చెబుతున్నారిలా.రాయడంలో..మనసులోని ఆలోచనలు వ్యక్తీకరించడం చిన్నారులకు రావాలి.

Updated : 16 Mar 2022 03:33 IST

చిన్నారులకు చిన్నప్పటి నుంచే ప్రసంగ నైపుణ్యాలను నేర్పించాలంటున్నారు నిపుణులు. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సూచిస్తున్నారు. ఎలా శిక్షణనివ్వాలో చెబుతున్నారిలా.

రాయడంలో..

మనసులోని ఆలోచనలు వ్యక్తీకరించడం చిన్నారులకు రావాలి. ఇందుకోసం ముందుగా తమ అభిప్రాయాలను ఓ కాగితంపై వరుసగా రాయమని చెప్పాలి. ఇలా చేస్తే సరైన పదాలు వినియోగించడం అలవడుతుంది. చిన్న చిన్న పొరపాట్లున్నా విమర్శించకూడదు. ప్రశంసించి సరైన పదాలుంటే మరింత బాగుంటుందని చెప్పాలి. అలా కొత్త పదాలను నేర్పాలి. ఆ తర్వాత ఆ వ్యాసాన్ని చూస్తూ చదవడం కాకుండా మాట్లాడుతున్నట్టు చెప్పేలా నేర్పాలి. అదే ప్రసంగం అని చెప్పాలి. ఇలా చేస్తుంటే, వారి ఆలోచనలను ఇతరులెదుట స్పష్టంగా, సూటిగా చెప్పడానికి సంకోచించరు. ఇది వారికి మంచి వ్యాయామంలా మారుతుంది.

పలు రకాలుగా...

వేదిక ఏదైనా సరే... అందరినీ నవ్వించేలా, అలాగే అసలైన విషయాన్ని వారికి చేరవేసేలా మాట్లాడటం ఓ కళ అని పిల్లలకు తెలియజేయాలి. ప్రసంగం మధ్యలో సందర్భోచితంగా ఓ కథను చెప్పడం నేర్పాలి. అలా ఓ ప్రసంగంలో పలు రకాల హావభావాలుండాలనే నియమం ఉంటుందని అవగాహన కలిగించాలి. ఇందుకోసం సమయం ఉన్నప్పుడల్లా వారితో కథలు చెప్పించాలి. ఇది మాట్లాడే నైపుణ్యాలను పెంచుతుంది. ఇవన్నీ భయాన్ని దూరం చేసి ఎంతమంది ఎదుటైనా ధైర్యంగా మాట్లాడగలిగేలా చేస్తాయి.

ఇంటికే...

కొందరు పిల్లలు ఇంట్లో అందరి ఎదుట గట్టిగా, ధైర్యంగా మాట్లాడతారు. తీరా బయటకెళ్లేసరికి భయం ఆవరిస్తుంది. లేదా సిగ్గుపడుతూ వెనుకడుగు వేస్తుంటారు. ఇటువంటి వారికి రోజూ చిన్న వ్యాయామంగా స్నేహితుల ముందు ఏదైనా ఒక విషయంపై మాట్లాడమని చెప్పాలి. ఆ అంశంపై ముందుగా వివరాలు సేకరించడం నేర్పాలి. నిర్ణీత సమయం అని లేకుండా సరదాగా సాగేలా చూస్తే చాలు. క్రమేపీ వారిలో కూడా భయం పోతుంది. మంచి వక్తలుగా మారతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని