ఆ ఖర్చుకు వెనకాడకండి!

జీవన పర్యంతం కలిసుండే అపురూప ఆత్మీయ బంధం దాంపత్యం. ఆ దగ్గరితనం ఒకరు లేనిదే రెండోవారు లేరనేంత ఇష్టాన్ని పెంచుతుంది. అదంతా నిజమే అయినా కోపమొస్తే అలకలూ అరుపులూ తప్పవు. అంతవరకూ పరవాలేదు.. కానీ ఆ అస్త్రాలకు మరింత పదును పెట్టక,

Published : 30 Apr 2022 02:09 IST

జీవన పర్యంతం కలిసుండే అపురూప ఆత్మీయ బంధం దాంపత్యం. ఆ దగ్గరితనం ఒకరు లేనిదే రెండోవారు లేరనేంత ఇష్టాన్ని పెంచుతుంది. అదంతా నిజమే అయినా కోపమొస్తే అలకలూ అరుపులూ తప్పవు. అంతవరకూ పరవాలేదు.. కానీ ఆ అస్త్రాలకు మరింత పదును పెట్టక, ప్రయోగించక మాధుర్యాన్ని పెంచుకోవాలి. అందుకు ఫ్యామిలీ కౌన్సిలర్లు సూచిస్తున్న ఈ సూత్రాలను పాటించి చూడండి..

* ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువై అలటసగా ఉందా? ఆందోళన మనసులోనే ఉంచుకుంటే మరింత దిగులేస్తుంది. అది దీర్ఘకాలం కొనసాగితే కుంగుబాటుకీ దారితీస్తుంది. చిరాకుపెడుతున్న ఏ విషయమైనా సరే భాగస్వామితో పంచుకుంటే సగం కష్టం తీరిపోయినట్లే. ఆ బాధ్యతను కొంత తాను స్వీకరించడమో, అలా కుదరకుంటే మరో ఏర్పాటు చేయడమో, కనీసం ఊరడించడమో జరుగుతుంది. కనుక బాధలూ బాధ్యతలూ, మానసిక ఉద్వేగాలూ అన్నీ భాగస్వామితో పంచుకోండి. దిగులును గనుక వ్యక్తం చేయకుంటే అది కోపంగానో ఉక్రోషంగానో బయటపడుతుంది. అలా జరక్కుండా దాపరికం లేకుండా అన్నీ చెబుతుంటే ప్రేమ, నమ్మకం మరింత పెరుగుతాయి.
* లోకంలో ఏ ఒక్కరూ లోపాలనేవి లేకుండా కథల్లో ఆదర్శవ్యక్తుల్లా ఉండరు. జీవిత భాగస్వామీ ఇందుకు మినహాయింపు కాదు. మంచి లక్షణాలతోబాటు కొన్ని నచ్చనివీ ఉండొచ్చు. అవి చెప్పి మార్పించగలిగితే మంచిదే. సాధ్యం కాకపోతే ఆ చిన్నచిన్న బలహీనతలను సరిపెట్టుకోవడం నేర్చుకుంటే జీవితం సాఫీగా నడిచిపోతుంది.
*కేవలం మన ఇష్టాలే కాకుండా భాగస్వామి ఆశలూ ఆశయాలకూ కూడా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పరస్పర ప్రేమ, గౌరవాలు పెరుగుతాయి.
* మీ భాగస్వామి ఏదైనా మంచిపని చేసినప్పుడు లేదా మీపట్ల ఔదార్యం చూపినప్పుడు ‘ఇది మామూలే కదా’ అనుకోవద్దు. మెచ్చుకోండి. అది మరేదో ప్రయోజనం ఆశించి ఉత్తుత్తిగా కాకుండా మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రశంసలు పురస్కారాన్ని తలపిస్తాయి. మరింత కష్టపడేలా చేస్తాయి.
* ఆలుమగలు ఇద్దరూ ఎవరి బాధ్యతల్లో వాళ్లు సతమతమవడం తెలిసిందే. ఆ కష్టం నుంచి కాస్త ఊరట పొందాలంటే నెలకోసారి సినిమాకో షికారుకో, ఏడాదికోసారి ఇష్టమైన ప్రదేశానికీ వెళ్లండి. ఆ ఖర్చులు లెక్కలేసి డబ్బు వృథా అనుకుంటే యాంత్రికత వచ్చేసి జీవితమే దండగ అనిపించే ప్రమాదముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్