తనతో.. వీటి గురించి మాట్లాడారా!

నెలసరి ప్రారంభమవడంతోనే అమ్మాయి పెద్దదై పోయిందని భావిస్తాం. ఎన్నో జాగ్రత్తలూ చెబుతాం. మరి తన మానసిక స్థితేంటో గమనించారా?  చర్మతీరు, ఎత్తు, శారీరకంగా వచ్చే మార్పులు.. ఇవన్నీ తనకు కొత్తే. దీనికి తోడు తనని మనం చూసే తీరులోనూ మార్పు వస్తుంది. ఇవంతా తనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అప్పటిదాకా లేలేతగా మృదువుగా ఉండే చర్మం కొందరిలో బరకగా మారిపోతుంది....

Published : 02 May 2022 00:41 IST

నెలసరి ప్రారంభమవడంతోనే అమ్మాయి పెద్దదై పోయిందని భావిస్తాం. ఎన్నో జాగ్రత్తలూ చెబుతాం. మరి తన మానసిక స్థితేంటో గమనించారా?

చర్మతీరు, ఎత్తు, శారీరకంగా వచ్చే మార్పులు.. ఇవన్నీ తనకు కొత్తే. దీనికి తోడు తనని మనం చూసే తీరులోనూ మార్పు వస్తుంది. ఇవంతా తనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అప్పటిదాకా లేలేతగా మృదువుగా ఉండే చర్మం కొందరిలో బరకగా మారిపోతుంది. తన స్నేహితుల ముఖాల్లోనూ ఆ మార్పు కనిపిస్తే సరే! కానీ అది తనలోనే కనిపించినప్పుడు ఆత్మన్యూనత మొదలవుతుంది. కొందరిలో శారీరక మార్పులూ వేగంగా కనిపిస్తాయి. అవన్నీ తనకు పరిచయం లేని అంశాలే. దీంతో కనిపించని ఒత్తిడి.

పోల్చుకొని బాధపడటం ఈ దశలో ప్రధాన సమస్య. దాన్ని నివృత్తి చేయకపోతే అది పెద్దయ్యాకా కొనసాగొచ్చు. వాళ్లు ప్రస్తావించగానే కోప్పడటమో, తోసిపుచ్చడమో చేయక.. శరీర తత్వాల మధ్య భేదమని చెప్పండి. ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం, దాని మీద దృష్టిపెడితే చాలని చెప్పండి.

వాళ్ల శరీరాన్ని వాళ్లు అర్థం చేసుకోవడానికీ.. అలవాటు పడటానికీ కొంత సమయం పడుతుంది. వాళ్లకి కొంత ఏకాంతాన్నివ్వండి. కోపంలో, చిరాకులో అరిస్తే మీరూ తిరిగి కోప్పడక కొంత సంయమనం పాటించండి. వాళ్లు కుదురుకున్నాకే నెమ్మదిగా కారణాన్ని తెలుసుకోండి. దేన్నైనా తమతో పంచుకోవచ్చన్న అభయాన్నివ్వండి, ఏ పరిస్థితిలోనైనా తనకు తోడుగా ఉంటామన్న భరోసానిస్తే.. సులువుగానే అలవాటు పడతారు.

అబ్బాయిలతో పోలిస్తే 8-13 ఏళ్ల వయసున్న అమ్మాయిలు మూడు రెట్లు కుంగుబాటుకు గురవుతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్కసారిగా హార్మోనుల్లో ఏర్పడే మార్పులూ ఇందుకు కారణమే. కాబట్టి.. అప్పటిదాకా ఎలాగున్నా.. వాళ్లతో స్నేహితుల్లా మెలగండి. ఇద్దరి మధ్యా ఎంత సాన్నిహిత్యమున్నా మనతో వాళ్లుగా వచ్చి ఏదీ చర్చించరు. మీరే చొరవ తీసుకోండి. శారీరక, మానసిక మార్పుల గురించి అర్థమయ్యేలా చెప్పండి. అవసరమైతే మీ అనుభవాలనూ చేరిస్తే.. అమ్మాయిలందరికీ అది ఎంత సాధారణమో వాళ్లే అర్థం చేసుకోగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని