లైంగిక విద్యపై అవగాహన అందిస్తోంది

చిన్నప్పటి నుంచి లైంగిక విద్యపై పిల్లలకు అవగాహన కలిగించాలంటుంది స్వాతి జగదీష్‌. ఇది పిల్లలను ప్రతి అంశంలోనూ తీర్చిదిద్దడమే కాదు, వారిని మంచి మార్గంలో నడిపిస్తుందని చెబుతుందీమె.

Published : 04 Oct 2021 01:41 IST

చిన్నప్పటి నుంచి లైంగిక విద్యపై పిల్లలకు అవగాహన కలిగించాలంటుంది స్వాతి జగదీష్‌. ఇది పిల్లలను ప్రతి అంశంలోనూ తీర్చిదిద్దడమే కాదు, వారిని మంచి మార్గంలో నడిపిస్తుందని చెబుతుందీమె. అంతేకాదు, తల్లిపాలు, నెలసరి, లైంగికవేధింపులు వంటి అంశాలపై అందరికీ అవగాహన కలిగించడానికే ఇన్‌స్టాలో ‘మాయాస్‌ అమ్మ’ పేజీని ప్రారంభించింది. ఈ పేజీకి మూడు లక్షలమంది ఫాలోవర్స్‌ ఉండటం విశేషం.

స్వాతికి చిన్నప్పటి నుంచి నృత్యం చేయడమంటే చాలా ఇష్టం. టీవీలో ప్రసారమయ్యే పాటలను చూసి, డ్యాన్స్‌ నేర్చుకుని, ఇంట్లో అందరి ఎదుటా ప్రదర్శించేది. దాంతో బంధువులు వచ్చిన ప్రతిసారీ స్వాతిని నృత్యం చేయమని అమ్మానాన్నలు అడిగేవారు. వారి మాటకాదనలేని స్వాతిని బంధువులు ముద్దాడే వారు. అది నచ్చక, పైకి చెప్పలేక మొహమాటంతో ఒంటరిగానే ఉండటానికి ఆమె ఇష్టపడేది. అయితే ఓ సారి ‘తన ఎనిమిదేళ్ల కూతురు మాయను ఓ వ్యక్తి ముద్దు చేస్తుంటే...తను దాన్ని ఖండించడం’ చూసి ఆమె ఆశ్చర్య పోయింది. పిల్లలు తమ అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పగలిగేలా పెంచగలిగితే భవిష్యత్తులో చాలా సమస్యల నుంచి వాళ్లు తేలిగ్గా బయటపడగలుగుతారు అనుకుంది. ఇదే ఆమెను ఆలోచింపచేసింది.

తొలి లాక్టేషన్‌ కౌన్సెలర్‌గా... తల్లులకు చాలా విషయాలపై అవగాహన లేకపోవచ్చు. అటువంటి వారి కోసం ఏదైనా చేయాలనుకుంది స్వాతి. చాలా పేరెంటింగ్‌ గ్రూపులను సంప్రదించింది. వాటిలో డైపర్స్‌, పిల్లల నిద్రవేళలు, బేబీ క్యారియర్స్‌ నుంచి తల్లిపాల వరకు పలు అంశాలపై చర్చలుండేవి. వీటిలో పాలు పంచుకోవడం ప్రారంభించింది. స్తన్యమివ్వడంపై సంభాషణల్లో తరచూ తల్లులు పలు రకాల ప్రశ్నలు వేసేవారు. చాలామంది దీనిపై అపోహలు వ్యక్తం చేసేవారు. పాపకు పాలుపడితే అది శరీరాకృతిపై ప్రభావం చూపిస్తుందా అని అడిగేవారు. ఈ అంశంపై ఉన్న అభిప్రాయాలను సరిచేయాలనుకొన్న ఈమె, ఆన్‌లైన్‌లో లాక్టేషన్‌ కౌన్సిలింగ్‌ కోర్సును చేసింది. ఆ తర్వాత కోవైలోని ఓ ఆసుపత్రిలో తొలి లాక్టేషన్‌ కౌన్సెలర్‌గా చేరింది. దాంతో పాటు రొమ్ము క్యాన్సర్‌ గురించీ అవగాహన కల్పించడం ప్రారంభించింది.  

అవగాహన కలిగిస్తూ..  2015లో పేరెంటింగ్‌ గ్రూప్స్‌లోని తల్లులందరినీ బృందంగా రూపొందించి, కళాశాలల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టా అంటోంది స్వాతి. ‘ఆ తర్వాతి ఏడాదికే కోయంబత్తూరు పేరెంటింగ్‌ నెట్‌వర్క్‌ (సీపీఎన్‌) సంస్థను రూపొందించాం. దీనిద్వారా ప్రసవం తర్వాత వచ్చే ఒత్తిడి, తల్లిపాలను అందించే పద్ధతులతోపాటు బిడ్డకు పట్టగా మిగిలిన పాలను తల్లిపాల బ్యాంకుకు ఎలా అందించాలో వంటి అంశాలన్నింటిపైనా అవగాహన కలిగిస్తూనే, సెక్స్‌ ఎడ్యుకేషన్‌లో సర్టిఫైడ్‌ కోర్సు కూడా పూర్తిచేశా. ఆ తర్వాత 2017లో ‘మాయాస్‌ అమ్మ’ పేరుతో ఇన్‌స్టాగ్రాం పేజీని ప్రారంభించి, మహిళలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఇందులో చర్చించడం, సందేహాలకు సమాధానాలివ్వడం మొదలుపెట్టా. సెక్స్‌ అంటే చెడ్డ పదం కాదు,  పిల్లలకు 12 ఏళ్ల వయసు వచ్చిందంటే లింగబేధం నుంచి శరీరంలోని ప్రతి అవయవం గురించి తెలియాల్సిన అవసరమెంతో ఉంది. అది పాఠ్యాంశంలా కాకుండా సాధారణ చర్చలా మొదలుపెట్టి వారికి వివరించడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. ఇది పిల్లలను సమాజంలో సరైన మార్గంలో నడవడానికి సాయపడుతుంది’ అంటోంది స్వాతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్