మురికివాడ అమ్మాయి.. గోల్‌కీపర్‌ అయ్యింది!

ఓ మురికివాడలో నివాసం. పైకప్పు కూడా సరిగాలేని రేకుల షెడ్డే ఇల్లు. ఓ పూట తింటే మరో పూట కష్టమే. అంతటి పేదరికమూ ఆ అమ్మాయి కలల సాధనకు అడ్డుకాలేదు. ఆటతో నుదుటి రాతను మార్చుకోవాలనుకుంది.

Published : 28 Nov 2021 01:29 IST

ఓ మురికివాడలో నివాసం. పైకప్పు కూడా సరిగాలేని రేకుల షెడ్డే ఇల్లు. ఓ పూట తింటే మరో పూట కష్టమే. అంతటి పేదరికమూ ఆ అమ్మాయి కలల సాధనకు అడ్డుకాలేదు. ఆటతో నుదుటి రాతను మార్చుకోవాలనుకుంది. ఫలితమే భారతీయ జూనియర్‌ మహిళా హాకీ జట్టుకు ఎంపికైంది. త్వరలో దక్షిణాఫ్రికాలో జరగనున్న వరల్డ్‌కప్‌లో ఆడనుంది. ఆశయం బలమైనదైతే పేదరికం అడ్డుకాలేదని నిరూపిస్తోన్న 19 ఏళ్ల ఖుష్బూఖాన్‌ కథ ఇదీ...

ఖుష్బూకి చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. చదువులోనూ చురుకే. తండ్రి షబ్బీర్‌ఖాన్‌ అద్దె ఆటో నడిపి తెచ్చే ఆదాయమే ఆ కుటుంబానికి ఆధారం. తల్లి ముంతాజ్‌ఖాన్‌ గృహిణి. అయిదుగురు పిల్లల్లో ఖుష్బూ ఒకరు. భోపాల్‌లోని ఓ మురికివాడలో ఉంటారు వాళ్లు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు 2013లో స్నేహితురాలొకరు లాల్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో హాకీ వేసవి శిబిరం జరుగుతోందని చెప్పింది. ఖుష్బూకు హాకీ ఆటను చూడటం అదే తొలిసారి. ఆసక్తిగా అనిపించి క్యాంపులో చేరింది. అది పూర్తయ్యాక మేజర్‌ ధ్యాన్‌చంద్‌ గ్రౌండ్‌లోని మెన్స్‌ ఎంపీ హాకీ అకాడమీకి వెళ్లి తన ఆసక్తిని చెప్పింది. అక్కడి శిక్షకులు తన ఆట తీరు, తపనలను చూసి శిక్షణనిస్తే మరింత బాగా ఆడగలదని నమ్మారు. అలా తన కెరియర్‌ మొదలైంది. సాధన కోసం ఇంటికి దూరంగా ఉన్న శిబిరానికి వెళ్లడానికి నాన్న ఓ పాత సైకిల్‌ కొనిచ్చాడు. అదేమో ఎప్పుడూ రిపేర్లే. దాన్ని బాగు చేయించే ఆర్థిక స్తోమత కూడా లేదు. అయినా ట్రైనింగ్‌కు మాత్రం గైర్హాజరు అయ్యేదికాదు ఖుష్బూ. ఎండైనా, వానైనా నడిచి వెళ్లేది. దేశం తరఫున ఆడాలన్నదే తన లక్ష్యం. దీంతో ఇవేమీ పెద్ద సమస్యల్లా తోచలేదామెకు.

గోల్‌కీపర్‌గా...

నాలుగేళ్లలోనే స్థానికంగా జరిగే పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలోనూ జట్టును గెలిపించే గోల్‌కీపర్‌గా మారింది. ఇండియన్‌ విమెన్‌ హాకీ టీంలో చోటును సంపాదించుకోగలిగింది. 2017లో జరిగిన ఈ ఎంపిక తర్వాత బెంగళూరు ఎస్‌ఏఐ సెంటర్‌లో కోచ్‌ హబీబ్‌ హసన్‌ వద్ద సాధన చేసే అవకాశాన్ని పొందింది. తద్వారా జాతీయ జట్టులో చోటునూ దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 60 మంది నుంచి ఈ ఎంపిక జరిగింది. భోపాల్‌ నుంచి హాకీలో అడుగుపెట్టిన తొలి అమ్మాయిగానూ నిలిచింది. తన సాధనంతా అబ్బాయిలతోనే. ఈమె వేగాన్ని చూసిన తోటి క్రీడాకారులు హీరో అనేవారు.

‘మగపిల్లలతో కలిసి శిక్షణ తీసుకునేదాన్ని. వారితో సమానంగా ఆడటానికి చేసే ప్రయత్నంలో నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తుండేదాన్ని. ఇదే గోల్‌కీపర్‌గా నా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తోడ్పడింది. మగవాళ్లతో ఆడేటప్పుడు వేగంగా పరుగెత్తాల్సివచ్చేది. గోల్‌పోస్ట్‌ వద్ద నిలబడి, ప్రత్యర్థిని అడ్డగించడం తేలిక అయ్యింది. టోర్నీ ఏదైనా సాధన వీళ్లతోనే. వారి వేగం, బలం, సామర్థ్యం వంటివన్నీ నన్ను నేను మంచి క్రీడాకారిణిగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. గత ఆరు నెలలుగా బెంగళూరులో జరుగుతున్న నేషనల్‌ హాకీ క్యాంపులో ఉన్నా. వరల్డ్‌ కప్‌ కోసం జరిగిన ఎంపికలో జూనియర్‌ ఇండియన్‌ విమెన్స్‌ హాకీ జట్టులో 18 మందిలో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకోగలిగా. ఈ పోటీల్లో మన దేశాన్ని గెలిపించడానికి నావంతు కృషి చేస్తా. ప్రభుత్వం తరఫున కొత్త ఇల్లు కట్టి ఇచ్చే పథకం ద్వారా మా కుటుంబానికి మంచి రోజులొస్తాయని ఆశతో ఉన్నా. మన దేశం గర్వపడే క్రీడాకారిణిగా నిలవాలనేదే నా లక్ష్యం’ అని చెబుతోంది ఖుష్బూ. మనమూ ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్