నాలుగు తరాల రుచిని అందిస్తూ...

‘బాదం కీ జాలీ’.. అనే మిఠాయిని దేశవిదేశాలకు అందిస్తున్నారు ఆ ఇంటి అత్తాకోడళ్లు. దీన్ని నాలుగు తరాలుగా కొనసాగిస్తున్నారు. ఈ తరంలో నఫీస్‌, ఉన్నీసా హుస్సేన్‌... ఆ వారసత్వం అందుకుని భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకులుగా నిలిచారు.

Published : 28 Feb 2022 01:13 IST

‘బాదం కీ జాలీ’.. అనే మిఠాయిని దేశవిదేశాలకు అందిస్తున్నారు ఆ ఇంటి అత్తాకోడళ్లు. దీన్ని నాలుగు తరాలుగా కొనసాగిస్తున్నారు. ఈ తరంలో నఫీస్‌, ఉన్నీసా హుస్సేన్‌... ఆ వారసత్వం అందుకుని భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకులుగా నిలిచారు.

బాదం, జీడిపప్పు, చక్కెర కలయికతో తయారయ్యే బాదం కీ జాలీ గురించి హైదరాబాద్‌లో తెలియని ఆహార ప్రియులుండరు. తమిళనాడుకు చెందిన దీన్ని 60 ఏళ్ల క్రితం తెలంగాణ వాసులకు నఫీస్‌ పరిచయం చేశారు. వీళ్ల కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చిన కొత్తలో దీన్ని బంధువుల ఇళ్లల్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు కానుకగా చేసిచ్చేవారీమె. దాని రుచికి అందరూ ఫిదా కావడమే కాకుండా, ఇతరులకీ అందుబాటులోకి తేవచ్చు కదా అని కొందరు ఇచ్చిన సలహా ఈమెను చిరువ్యాపారిని చేసింది. మొదట్లో తెలిసినవారింట్లో పెళ్లిళ్లు, పండుగలకు చిన్నచిన్న ఆర్డర్లు తీసుకుని తయారు చేసిచ్చేవారు. తర్వాత ‘ఇంపీరియల్‌ స్వీట్‌ హౌస్‌’ పేరుతో దుకాణాన్నీ ప్రారంభించారు. క్రమంగా ఆర్డర్లూ పెరిగాయి. తన కోడలు ఉన్నీసాకు కూడా తయారీ నేర్పించారు నఫీస్‌.

అమ్మ, నానమ్మ దీని తయారీలో కొత్త విధానాల్ని తేవాలనుకున్నారని చెబుతోంది నేటి తరం అమ్మాయి ఆయేషా. ‘కొత్తగా ప్రయత్నించాలనుకున్న వారి ఆలోచన వినియోగదారులను మరింత ఆకర్షించింది. పలు రంగుల కలయికతోపాటు నక్షత్రాలు, ఆకులు, పూలు, పండ్లు వంటి రకరకాల ఆకారాల్లో జాలీలను చేసేవారు. అలాగే రెండు నిజాం నాణేల మధ్య పిండిని ఉంచి వాటి డిజైన్‌ స్వీటుకు అద్దేలా ‘అష్రఫీ’ డిజైన్ల తయారీనీ ప్రారంభించారు. వీళ్లీ తయారీ మొదలుపెట్టే నాటికి జీడిపప్పు కిలో రూ.10 లోపే. తర్వాత్తర్వాత ఖరీదు ఎక్కువే అయినా నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడటంలేదు. విదేశాల వరకూ ఈ రుచి వెళ్లగలుగుతోందంటే ఇదే కారణం. దీని తయారీకి దాదాపు నాలుగైదు గంటలు పడుతుంది. మొదట బాదం పప్పును వేడినీళ్లలో నానబెట్టి ఆ తర్వాత మెత్తగా రుబ్బి చక్కెరతో కలపాలి. తర్వాత బేక్‌ చేయాలి. చూడటానికి కుకీల్లా అనిపించినా రుచి మాత్రం ప్రత్యేకం. నానమ్మ తన ప్రతి ప్రయోగాన్నీ మా అమ్మకు నేర్పేవారు. ప్రస్తుతం వాటిని మేం పాటిస్తున్నాం. అలా నాలుగు తరాలుగా వినియోగదారులకు బాదం కీ జాలీ రుచిని అందిస్తున్నాం. ప్రారంభంలో అంతా చేత్తోనే చేసేవాళ్లు. ఇప్పుడు మెషిన్లు, గ్రైండర్లతో పని సులువైంది. కంప్యూటర్‌ విద్య చదివినా నానమ్మ, అమ్మతో కలిసి పనిచేస్తున్నా. సామాజిక మాధ్యమాల్లో మార్కెటింగ్‌ చేస్తున్నా. దుబాయి, లండన్‌, సింగపూర్‌ తదితర దేశాల నుంచీ ఆర్డర్లు వస్తుంటాయి. నెలకు దాదాపు 400 కేజీల స్వీటును అందించగలుగుతున్నాం. ఇంకా పురన్‌ పోలి, హల్వా వంటివాటినీ తయారుచేస్తున్నాం. మా స్వీట్లకు ప్రముఖులూ ఫిదా అవుతున్నారు. దియా మీర్జా వివాహానికి మేమే స్వీట్లు చేసిచ్చాం. పోటీ ఎంత పెరిగినా మా సంప్రదాయ వంటకే చాలామంది ఓటు. మా కుటుంబంలో రేపటి తరం మహిళలు కూడా ఇదే నాణ్యతను పాటిస్తారు’ అని చెప్పుకొచ్చింది ఆయేషా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్