అమ్మానాన్నలకి ఈ ఆటల పేర్లే తెలీదు!

పేద కుటుంబాల్లో పుట్టిన ఈ అమ్మాయిల్లో ఒకరు హాకీ ప్లేయర్‌, మరొకరు సెపక్‌ తక్రా క్రీడాకారిణి. అసలు అలాంటి ఆటలు కూడా ఉంటాయనీ వీరి తల్లిదండ్రులకు తెలియదు. అలాంటిది వాటిలో అడుగుపెట్టడమే కాదు అక్కడ పతకాలూ సాధిస్తున్నారు. వీరిలో ఎలమంచిలికి చెందిన 20 ఏళ్ల మడగల భవాని జాతీయ మహిళా జూనియర్‌ హకీ క్రీడాకారిణి కాగా, 18 ఏళ్ల కురుబ తేజ ఆంధ్రప్రదేశ్‌ సెపక్‌ తక్రా జట్టు కెప్టెన్‌. స్ఫూర్తిదాయకమైన వీళ్ల క్రీడా ప్రయాణం వారి మాటల్లోనే...

Updated : 02 Jul 2022 08:48 IST

పేద కుటుంబాల్లో పుట్టిన ఈ అమ్మాయిల్లో ఒకరు హాకీ ప్లేయర్‌, మరొకరు సెపక్‌ తక్రా క్రీడాకారిణి. అసలు అలాంటి ఆటలు కూడా ఉంటాయనీ వీరి తల్లిదండ్రులకు తెలియదు. అలాంటిది వాటిలో అడుగుపెట్టడమే కాదు అక్కడ పతకాలూ సాధిస్తున్నారు. వీరిలో ఎలమంచిలికి చెందిన 20 ఏళ్ల మడగల భవాని జాతీయ మహిళా జూనియర్‌ హాకీ క్రీడాకారిణి కాగా, 18 ఏళ్ల కురుబ తేజ ఆంధ్రప్రదేశ్‌ సెపక్‌ తక్రా జట్టు కెప్టెన్‌. స్ఫూర్తిదాయకమైన వీళ్ల క్రీడా ప్రయాణం వారి మాటల్లోనే...

గోల్‌ కొట్టనిదే నిద్ర పట్టదు!

న్నయ్య సాయిప్రకాష్‌ హాకీ ఆడేవాడు. నేనప్పుడు అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదివేదాన్ని. అన్నయ్య ఆట చూడ్డానికి వెళ్లి నేనూ హాకీ స్టిక్‌ పట్టుకున్నా. గోల్‌ కొట్టినప్పుడల్లా జనాలు ఈలలూ, చప్పట్లతో గోల చేసేవారు. అది కిక్‌ ఇచ్చేది. దాంతో క్రమం తప్పకుండా ప్రాక్టీసుకి వెళ్లేదాన్ని. అమ్మ వరలక్ష్మి కొబ్బరి బొండాల దుకాణం నడుపుతుంది. నాన్న బాబూరావు ప్రైవేటు ఉద్యోగి. హాకీలో మ్యాచ్‌ జరిగేంతసేపూ పరుగుతీస్తూనే ఉండాలి. దాంతో ఆట ముగిసేసరికి బాగా అలసిపోయేదాన్ని. ఆకలి తీర్చుకోవడానికి ఇంట్లో ఏది ఉంటే అది తినేసేదాన్ని. రెండేళ్లలో ఒక గుర్తింపు వచ్చింది. జిల్లా సబ్‌ జూనియర్‌ జట్టుకి ఆడేదాన్ని. అనంతపురంలోని రూరల్‌ డవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ హాకీలో శిక్షణ ఇస్తుందని తెలిసి మా జట్టులో కొందర్ని అక్కడికి పంపారు. నేను ఎంపికయ్యా. ‘అమ్మాయివి అంత దూరం.. అది కూడా ఆట కోసం ఎందుకు’ అని అమ్మానాన్న వద్దన్నారు. కానీ అన్నయ్య నచ్చజెప్పడంతో చివరకు అంగీకరించారు. ఆర్డీటీలో 8-10 తరగతులు చదువుతూ హాకీలో మెలకువలు నేర్చుకున్నా. రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌, జూనియర్‌ జట్లకు ఆడేదాన్ని. 2017లో టెన్త్‌ పూర్తిచేశా. అదే సంవత్సరం దిల్లీలోని నేషనల్‌ హాకీ అకాడమీలో శిక్షణకు ఎంపికయ్యా. ఉదయం, సాయంత్రం వ్యాయామాలూ, హాకీ ప్రాక్టీసు. అక్కడ ఉన్నప్పుడే హాకీనే కెరియర్‌ అనుకున్నా. ఇంటర్మీడియెట్‌ దూరవిద్యలో పూర్తిచేశా. ప్రస్తుతం బీఏ చదువుతున్నా. ఆంధ్రప్రదేశ్‌, శాయ్‌ జట్ల తరఫున జాతీయస్థాయిలో ఆడేదాన్ని. తర్వాత అకాడమీ తరఫున విదేశాల్లో అండర్‌-21, అండర్‌-22 టోర్నీలు ఆడించేవారు. అలా ఐర్లాండ్‌, కెన్యా, బంగ్లాదేశ్‌ వెళ్లా. బంగ్లాదేశ్‌లో జరిగిన టోర్నీకి కెప్టెన్‌గానూ ఉన్నా. 2019లో హాకీ ఫెడరేషన్‌ నుంచి బెంగళూరు శిబిరానికి పిలుపొచ్చింది. అక్కడ ఉండగా జాతీయ మహిళల జూనియర్‌ జట్టులో ఫార్వర్డ్‌ ప్లేయర్‌గా ఎంపికయ్యా. టీమిండియా జెర్సీ వేసుకున్న రోజు పొందిన ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాలుగురోజుల కిందట ఐర్లాండ్‌లో అయిదు దేశాల టోర్నీలో మా జట్టు రజతం గెలిచింది. ఈ టోర్నీలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. త్వరలో జూనియర్‌ ప్రపంచకప్‌లో ఆడబోతున్నా. సీనియర్స్‌ జట్టులో స్థానం సంపాదించి ఒలింపిక్స్‌లో ఆడాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్నలకు హాకీ గురించి అస్సలు తెలీదు. అయినా నాకు ఇష్టం అని ఆడనిచ్చారు. ఈ క్రీడలో మరిన్ని పతకాలు సాధించి వారి కళ్లల్లో ఆనందం చూడాలన్నదే నా లక్ష్యం.

-దాట్ల సుబ్బరాజు, ఎలమంచిలి


ఆర్మీలో చేరడమే లక్ష్యం...

మాది కర్నూలు జిల్లా ఆలూరు. అమ్మ లేపాక్షి అంగన్వాడీ టీచర్‌. నాన్న నాగరాజు.. నా చిన్నప్పుడే చనిపోయారు. నాకో అక్క, తమ్ముడు. పెద్దహోతూరు జిల్లా పరిషత్‌ స్కూల్లో ఎనిమిదో తరగతి చదివేటప్పుడు మొదటసారి మా పీఈటీ సర్‌  సెపక్‌ తక్రాని పరిచయం చేశారు. ఆ స్కూల్‌ గ్రౌండ్‌ చిన్నది. తక్కువ స్థలంలో ఆడే ఆటల్ని మాకు నేర్పేవారు. సెపక్‌ తక్రా వాలీబాల్‌ లాంటిది. వాలీబాల్‌లో బంతిని చేత్తో కొట్టి నెట్‌ దాటిస్తే దీన్లో కాలితో తన్ని దాటించాలి. జట్టులో ముగ్గురు ఉంటారు. ఈ ఆట ఆడాలంటే కాళ్లు బలంగా ఉండాలి, చురుగ్గా కదలాలి. ఈ లక్షణాలు చూసే నన్ను ఎంపికచేశారు. మొదట్లో స్కూల్‌, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటూ వచ్చా. తొమ్మిదో తరగతిలో ఉండగానే జాతీయ స్థాయిలో జూనియర్స్‌, ఇంటర్మీడియెట్‌లో సీనియర్స్‌ ఆడా. రాష్ట్ర అండర్‌-17 జట్టుకి కెప్టెన్‌గా హైదరాబాద్‌లో జరిగిన అంతర్‌ రాష్ట్ర పోటీల్లో స్వర్ణం గెలిచాం. 2018లో గోవా, అస్సాంలలో జరిగిన జాతీయస్థాయి పోటీలకు ఆంధ్రా జట్టు కెప్టెన్‌గా స్వర్ణం, రజతం గెలిపించా. గతవారం రాజస్థాన్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ కెప్టెన్‌గా ఉన్నా. 30 రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొనగా, క్వార్టర్స్‌కు వెళ్లగలిగాం. రోజూ ప్రాక్టీసు చేయడం కుదరదు.   ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ టోర్నీకి రెండు వారాల ముందు నుంచి టీమ్‌తో కలిసి ప్రాక్టీసు చేస్తా. అంతర్జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించి దేశానికి పేరు తేవాలనుకుంటున్నా. క్రీడల కోటాలో ఇండియన్‌ ఆర్మీకి ఎంపిక కావాలన్నదే నా లక్ష్యం. అమ్మకేమో నేను ఆడే ఆటపేరే తెలియదు. నేను చదువుకుంటేనే ఇష్టం. అందుకే చదువుని నిర్లక్ష్యం చేయలేదు. ప్రస్తుతం రాజంపేటలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నా.

-బోగెం శ్రీనివాసులు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని