హాలీవుడ్‌లో.. మన ఆర్ఘ్య!

కోట్ల బడ్జెట్‌, భారీ సెట్టింగులు.. సినిమాపై అంచనాలు పెంచే మాటలు కదూ! ఆర్ఘ్య పనంతా వీటితోనే. పైగా ఒక్క ఛాన్స్‌ దక్కితే చాలని దేశదేశాల తారలు భావించే హాలీవుడ్‌లో! వందల సెట్లను నిర్మించి, చేతి నిండా అవకాశాలతో దూసుకుపోతోంది.

Updated : 19 Jul 2022 09:43 IST

కోట్ల బడ్జెట్‌, భారీ సెట్టింగులు.. సినిమాపై అంచనాలు పెంచే మాటలు కదూ! ఆర్ఘ్య పనంతా వీటితోనే. పైగా ఒక్క ఛాన్స్‌ దక్కితే చాలని దేశదేశాల తారలు భావించే హాలీవుడ్‌లో! వందల సెట్లను నిర్మించి, చేతి నిండా అవకాశాలతో దూసుకుపోతోంది. అదీ 30ఏళ్ల లోపే. ఇంతకీ తనకా ఛాన్స్‌ ఎలా వచ్చింది?

పాత కాలం కథలు, నాటి పరిస్థితులను సినిమాల్లో చూపించేది కేవలం పాత్రల దుస్తులు, మేకప్పేనా? కాదు... సన్నివేశాల్లో ఉండే భవనాలు, పరిస్థితులు కూడా! ఆ పనిని చూసుకునేది సెట్‌ డిజైనర్లు. ఆర్ఘ్య సదన్‌.. పనదే! ‘మాది బెంగళూరు. నాన్న ఉద్యోగ రీత్యా పదేళ్లు సింగపూర్‌లో ఉన్నా. ఇక్కడికి తిరిగొచ్చాక నాన్న ఓ స్థలం కొన్నారు. దాన్ని నేనే తీర్చిదిద్దుతానన్నా. సరేనన్నారు. అప్పుడే నాకు ఆర్కిటెక్చర్‌ చదవాలనిపించింది’ అని చెబుతుంది ఆర్ఘ్య. బెంగళూరులోని ఓ కళాశాలలో చేరింది. చదువుతోపాటే ప్రయోగాత్మకంగా తెలుసుకోవడం కోసం కొన్ని ఆర్కిటెక్చర్‌ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసింది. అయిదో ఏడాదికొచ్చాక మొదలైంది సమస్య.

‘తర్వాతేంటి?’ అన్న ప్రశ్న వచ్చింది. సమాధానమే చిక్కలేదు. చదువు పూర్తైంది. మంచి ఉద్యోగం. తర్వాత విదేశీ అవకాశాలు. కానీ ఎప్పుడూ ఒకే తరహా పని. తెలియని అసంతృప్తి. నాకు సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. ‘ప్రైడ్‌ అండ్‌ ప్రిజ్యుడీస్‌’ ఎన్ని వందలసార్లు చూసుంటానో! 18వ శతాబ్దానికి సంబంధించిన చిత్రమది. ఓరోజు యథాలాపంగా చూస్తోంటే ఆ చిత్రంలో ఓ సెట్‌ ఆకర్షించింది. నాకూ అలాంటిది వేయాలనిపించింది’ అని గుర్తు చేసుకుంటుంది ఆర్ఘ్య.

దానికి సంబంధించిన కోర్సుల కోసం వెతికింది. దేశంలో ఎక్కడా లేవు. విదేశాల్లోనూ ప్రయత్నిస్తే లాస్‌ ఏంజెలెస్‌లోని అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ కోర్సు గురించి తెలిసింది. వెంటనే అందులో చేరింది. 2017లో పూర్తి చేసింది. ఈ కోర్సు చదివేటప్పుడూ ఇంటర్న్‌షిప్‌లు చేసింది. కోర్సులో భాగంగా ప్రాజెక్టులా తక్కువ నిడివి సినిమా చేయాలి. 2018లో ‘లిటిల్‌ డార్లింగ్‌’ పేరుతో ఆమె చేసిన చిత్రం ప్రొడక్షన్‌ డిజైనింగ్‌కి అంతర్జాతీయ వేదికపై గోల్డ్‌ అవార్డుని అందుకుంది. ఇంకేముంది టీవీ, సినిమా అవకాశాలు వరుస కట్టాయి.

ఏడాది వెదికా...

‘ఉద్యోగం మానేయాలనుకుంటున్నా అని ఇంట్లో చెప్పినపుడు అమ్మానాన్నా షాకయ్యారు. కెరియర్‌నీ మార్చాలనుకుంటున్నా అనేసరికి వాళ్లకేమీ అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచీ ఆసక్తి చూపిన రంగం. పైగా దాని కోసం చాలా కష్టపడ్డా. తగ్గట్టుగానే అవకాశాలూ వస్తున్నాయి. అలాంటి సమయంలో ఈ నిర్ణయం ఎందుకో వాళ్లకి అర్థం కాలేదు. కానీ నాది తొందరపాటు కాదు. సెట్‌/ ప్రొడక్షన్‌ డిజైనింగ్‌లో పనిచేయాలి అనుకున్నాక చాలా పరిశోధించా. ఫ్యాషన్‌ వీక్‌లు, ఆల్బమ్స్‌, ఆనాటి సినిమాలు ఎన్నో గమనించా. ఒకదానికి ఇంకో దానికి సంబంధం లేదు. దర్శకుడి ఊహకు రూపమివ్వడానికి ఎంత హోంవర్క్‌ చేయాలో అర్థమైంది. లోతుగా, శాస్త్రీయంగా తెలుసుకోవడం కోసం కోర్సుల్ని అన్వేషించా. దీనంతటికీ ఏడాదిపైనే పట్టింది. అమెరికాలో ఓ కోర్సు ఉందని తెలిశాక ఇంట్లో వాళ్లకి అర్థమయ్యేలా చెప్పా. అప్పుడు వాళ్లూ ఒప్పుకొన్నారు. కోర్సులో చేరాకా ఫీల్డ్‌ వర్క్‌కి వెళ్లేదాన్ని. నిపుణులతో మాట్లాడే దాన్ని. వాళ్లని కలవడానికి చాలా కష్టపడాలి. ఎలాగోలా సమయం సంపాదించేదాన్ని. ఆ నెట్‌వర్క్‌నీ కొనసాగిస్తూ వచ్చా. అవన్నీ నా మొదటి ప్రాజెక్టుతో మెప్పించడానికి సాయపడ్డాయి’ అంటుందీ 30 ఏళ్ల అమ్మాయి.

ప్రతిదీ సవాలే...

అవకాశాలు వచ్చినా ఇంకా నేర్చుకోవాలని నమ్ముతుందీమె. అందుకే అసిస్టెంట్‌గానే కెరియర్‌ ప్రారంభించింది. ఏడాదికే సొంతంగా ప్రాజెక్టు చేసే స్థాయికి ఎదిగింది. ‘ప్రతిదీ ఓ సవాలే. సమయం, బడ్జెట్‌, రూపురేఖలు ప్రతిదానిలో మార్పులుంటాయి. కొన్నింటికి వారమైనా సమయముంటే.. కొన్ని అప్పటికప్పుడు చేయాలి. అదే సమయంలో కాలం, సంస్కృతి వంటివి గమనించుకోవాలి. ‘విన్నింగ్‌ టైమ్‌’ సినిమాకు పనిచేశా. 80ల నాటి కథ ఇది. స్క్రిప్ట్‌ చదివాక పూర్తి అవగాహన కోసం ఎన్నో పుస్తకాలు, డాక్యుమెంటరీలను చూడటమేకాదు అప్పటి వ్యక్తుల్నీ కలిసి మాట్లాడా. దానిలో ఒక స్టేడియాన్ని 17000 మంది కూర్చునే దానిలా చూపించాలి. అంత మందిని తెస్తే నిర్వహణ సమస్య. ఇలాంటప్పుడు గ్రాఫిక్‌లతో మాయ చేయడానికీ వీలుగా పని చేయాలి. పైగా ఇప్పుడు చాలా చిత్రాలకు గ్రాఫిక్స్‌ తప్పనిసరయ్యింది. అంటే డైరెక్షన్‌తో పాటు మరెన్నో సాంకేతిక విభాగాలతో కలిసి నడవాలి. కష్టమే కానీ చేసిన పనికి గుర్తింపు రాగానే.. పడ్డ శ్రమంతా దూదిపింజెలా తేలిపోయినట్టు ఉంటుంది. మరో కొత్త సవాలుకి సిద్ధమవుతా’ అని నవ్వేస్తుంది ఆర్ఘ్య. ఇప్పటి వరకూ ఆమె వేసిన సెట్లు వందల్లోనే! లిటిల్‌ డార్లింగ్‌, డిస్‌ప్లేస్‌డ్‌, ది మిస్ట్రెస్‌, కంపల్షన్‌, సూపర్‌నోవా, 9-1-1.. వంటి ఎన్నో టీవీ షోలు, సినిమాలతోపాటు మ్యూజిక్‌ ఆల్బమ్‌లకీ పనిచేసింది.  హారీపోటర్‌ లాంటి చిత్రానికి పనిచేసి తన ప్రతిభను నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది తను.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్