నెట్టింటి... డాక్టరమ్మలు!

పిల్లలకి కాస్త నలత చేస్తే తల్లడిల్లిపోతాం.. తోచిన సలహాలు తీసుకుంటాం. వచ్చే నెల డెలివరీ డేట్‌ అంటే మనసు నిండా ఎన్నో భయాలు.. అనుమానాలు. నెలసరి సమయానికి రాకపోతే కారణం ఏంటో తెలియక తల్లడిల్లుతాం.

Updated : 01 Jul 2023 04:14 IST

జాతీయ వైద్యుల దినోత్సవం

పిల్లలకి కాస్త నలత చేస్తే తల్లడిల్లిపోతాం.. తోచిన సలహాలు తీసుకుంటాం. వచ్చే నెల డెలివరీ డేట్‌ అంటే మనసు నిండా ఎన్నో భయాలు.. అనుమానాలు. నెలసరి సమయానికి రాకపోతే కారణం ఏంటో తెలియక తల్లడిల్లుతాం.. ఇలాంటి విషయాల్లో వాళ్లూ.. వీళ్లూ ఇచ్చే సలహాలు కాకుండా నేరుగా డాక్టరమ్మల సలహాలే తీసుకుంటే? అదెలా సాధ్యం అంటారా? సోషల్‌ మీడియా వేదికగా రాణిస్తున్న వీళ్ల వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది..


పసిపిల్లల ఆరోగ్యం కోసం
- డాక్టర్‌ లావణ్య బండిపల్లి పుష్కర్ణ

మాది సిద్దిపేట. కరీంనగర్‌లోని ప్రతిమా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌, ఎండీ (పీడియాట్రిషన్‌) పూర్తి చేశా. ఒక డాక్టర్‌గా తల్లులకు ఎన్ని సందేహాలుంటాయో నాకు తెలుసు. అలాగని ప్రతిసారీ వైద్యుల దగ్గరకి పరుగెత్తలేరు. కొవిడ్‌ సమయంలో ఈ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారింది. దాంతో బంధువులూ, తెలిసినవారు ఫోన్‌ చేసి వారి బిడ్డల ఆరోగ్య సమస్యలు చెప్పేవారు. రిపోర్టులు పంపి సలహాలు అడిగేవారు. వాళ్లందరికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పేదాన్ని. అయితే, ఇలా ఒక్కొక్కరికీ విడివిడిగా చెప్పే బదులుగా వీడియో తీసి ఇస్తే బాగుంటుంది కదా అనిపించడంతో వీడియోలు తీసి ఫార్వర్డ్‌ చేసేదాన్ని. ఇలా కొన్నాళ్లు గడిచాక మరింతమందికి ఆ అంశాలు ఉపయోగపడాలనే ఆలోచనతో ‘బేబీ డాక్టర్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ఏర్పాటు చేశా. ప్రారంభించిన తక్కువ కాలంలోనే మంచి ఆదరణ లభించింది. వైద్యం సామాన్యులకు ఉచితంగా అందినప్పుడే సమాజమూ బాగుంటుందన్న అభిప్రాయంతో రోజూ ఓ వీడియో తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేస్తా. పిల్లల ఆరోగ్యం, ఆహారం, పెంపకం వంటి ఎన్నో విషయాలపై ఇక్కడ మాట్లాడతాను. ఇతర రాష్ట్రాలూ, దేశాల మహిళలూ నన్ను సంప్రదిస్తుంటారు. మావారు డా. విశాల్‌ పుష్కర్ణ. ప్రస్తుతం గుజరాత్‌లోని భుజ్‌లో అదానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో పనిచేస్తున్నాం. ఇక్కడన్నీ గిరిజన గ్రామాలే కావడంతో వారికి సరైన పోషకాహారం, శుభ్రత వంటివీ నేర్పించాలనుకున్నా. వాటిపైనా వీడియోలు చేస్తున్నా. ఇప్పటి వరకూ 280కిపైగా వీడియోలు చేశా. యూట్యూబ్‌లో ఐదులక్షలమంది సబ్‌స్క్రైబర్లకు చేరువలో ఉన్నా. భవిష్యత్తులో పేద తల్లీపిల్లల ఆరోగ్యం కోసం మరిన్ని కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నా.

- వెంకటేశ్‌ మెతుకు, సిద్దిపేట


సహజ ప్రసవాల కోసం...
- డాక్టర్‌ శిల్పిరెడ్డి, కిమ్స్‌ కడల్స్‌

అమ్మ కాబోతున్న సంతోషం ఎంత ఉంటుందో... అంతకుమించి ప్రసవం ఎలా జరుగుతుందో అన్న భయం కూడా ఉంటుంది గర్భిణుల్లో. ఆ భయాన్ని పోగొట్టి ఆడిస్తూ, పాడిస్తూనే వాళ్లకు సహజ ప్రసవం అయ్యేలా చేస్తారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ శిల్పిరెడ్డి. అదే ఆమె ప్రత్యేకత. ప్రసవాన్ని పునర్జన్మతో పోలుస్తారు... అలాంటి సమయంలో కూడా ఏ మాత్రం భయం లేకుండా ఇంత హుషారుగా డాన్స్‌లు చేస్తూ కూడా బిడ్డని కనొచ్చా అనిపిస్తుంది ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలని చూస్తే. ‘మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది సిజేరియనే మేలు అనుకుంటున్నారు. అదైతే ఏ నొప్పీ ఉండదనుకుంటారు. కానీ ముందు నుంచీ చక్కని వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తే ఇదేమంత కష్టం కాదు. అవన్నీ మా దగ్గరకొచ్చే గర్భిణులకు దగ్గరుండి చేయిస్తా. జుంబా క్లాసులు తీసుకుంటా. అంతవరకూ బాగానే ఉన్నా చివరిగా.. ప్రసవ సమయంలో కూడా నొప్పుల గురించిన భయంతో ఒత్తిడికి గురవుతుంటారు. ఆ టెన్షన్‌ పోగొట్టడానికే డ్యాన్స్‌ థెరపీ చేయిస్తా. వాళ్లతో నేనూ అడుగులు వేస్తా. ఇలా చేస్తే వాళ్లలో ఓ చక్కని పాజిటివ్‌ ఆలోచన వస్తుంది. భయపడరు. మహిళ ఆరోగ్యంపైనే ఇంటిల్లిపాది ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఆమె మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటమెలానో నా వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నా’ అంటారు శిల్పి రెడ్డి. కిమ్స్‌ కడల్స్‌ వేదికగా ఏడేళ్లుగా సహజ ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్న ఆమె రెండేళ్లుగా డాక్టర్‌ కె. శిల్పిరెడ్డి పేరుతో సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. రెండు లక్షలమంది అనుసరిస్తున్నారు.


తినమని చెప్పే డాక్టరమ్మ
- విశాఖ శివదాసానీ

బరువు తగ్గాలి అనగానే ఇవి తినొద్దు.. అవి తినొద్దు.. అని సలహాలొచ్చేస్తాయి కదూ! కానీ డాక్టర్‌ విశాఖ అలాకాదు. నచ్చినవన్నీ తినమంటారు. కాకపోతే తీసుకునే పరిమాణం, చక్కెరల విషయంలో మార్పులు చెబుతుంటారు. డాక్టరన్నాక మందులూ సాధారణమే.. కానీ ఆవిడ మాత్రం ఆహారం, జీవనశైలిలో మార్పులకే ప్రాధాన్యమిస్తారు. అందుకే విదేశీయులే కాదు.. ఆదిత్య నారాయణ్‌ సహా ఎందరో బాలీవుడ్‌ తారలూ బరువు విషయంలో ఆమె సాయం కోరినవారే! డాక్టర్‌ విశాఖది ముంబయి. లైఫ్‌స్టైల్‌ డిసీజెస్‌, న్యూట్రిషన్లలో స్పెషలైజేషన్‌ చేసినామెది రెండు దశాబ్దాలకుపైగా అనుభవం. స్థూలకాయం, మధుమేహం, పీసీఓడీ.. లాంటి జీవనశైలిలో మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు చికిత్స చేస్తారు. ఉత్తమ న్యూట్రిషనిస్ట్‌గా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సహా పలు దేశీ వార్తాపత్రికలకు వ్యాసాలు రాస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి అందరికీ అందించాలనే ఉద్దేశంతో ‘డాక్టర్‌వీ’గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చారు. చెడు కొవ్వు తగ్గించుకోవడం.. గుండె ఆరోగ్యం.. ఒత్తిడి.. థైరాయిడ్‌, నెలసరి నొప్పి.. ఇలా అనేక సమస్యలను సులువుగా తగ్గించుకునే మార్గాలను పంచుకుంటున్నారు. ఆమెను ఇన్‌స్టాలో దాదాపు 2లక్షలమంది అనుసరిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశాలు దక్కించుకున్న విశాఖ రచయిత కూడా. టాటా, నైకా సహా పలు సంస్థలకు హెల్త్‌ కన్సల్టెంట్‌, హెల్త్‌ మేనేజ్‌మెంట్‌పై వర్క్‌షాప్‌లూ నిర్వహిస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్