ముంబయికి రంగులద్దుతోంది!
ముంబయి అంటే మెరిసే మేడలే కాదు.. మురికివాడలూ కనిపిస్తాయి. వాటిని రంగులతో తీర్చిదిద్దుతోంది సంగీత! అవే కాదు.. నగరగోడలు, రద్దీ ప్రదేశాలన్నీ ఆమె చిత్రాలతో నిండిపోతున్నాయి.
ముంబయి అంటే మెరిసే మేడలే కాదు.. మురికివాడలూ కనిపిస్తాయి. వాటిని రంగులతో తీర్చిదిద్దుతోంది సంగీత! అవే కాదు.. నగరగోడలు, రద్దీ ప్రదేశాలన్నీ ఆమె చిత్రాలతో నిండిపోతున్నాయి. దేశంలో జీ20 సదస్సు జరగనున్న సందర్భంగా ముంబయి కార్పొరేషన్ ఈ పనిని ఆమెకు అప్పగించింది. ఇంతకీ ఎవరీమె?
సవాళ్లను స్వీకరించడమంటే సంగీతా బబానీకి చాలా ఇష్టం. బాంద్రా అండర్‌పాస్ గోడలపై 15 అడుగుల మ్యూరల్‌ని అయిదు రోజుల్లో పూర్తిచేయడం, మిలాన్ సబ్‌వే ఫ్లైఓవర్‌పై చారిత్రక కట్టడాలు.. ఇవన్నీ ఆమెలో పోటీతత్వానికి చిహ్నాలే! ఇవేకాదు.. ‘దీనిపైనా చిత్రాలు గీయొచ్చా’ అని ఆశ్చర్యపోయేలా చేసిన సందర్భాలెన్నో. స్కైస్క్రేపర్స్, కార్లు, వాహనాలు.. ఇలా ఎన్నో ఆమె కాన్వాసులుగా మారాయి. సంగీత పుట్టి పెరిగిందంతా స్పెయిన్‌లో. పెళ్లయ్యాక ముంబయిలో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచీ బొమ్మలు గీయడం, ఆకృతుల తయారీపై ఆసక్తి. దానిలోనే డిగ్రీ పట్టా అందుకొని ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. తన చిత్రాలు, ఆకృతులతో ఎగ్జిబిషన్లూ నిర్వహిస్తుంటారు.
2016లో పిరమల్ గ్రూప్ కోసం 18 అడుగుల ఎత్తులో పల్లాడియం మాల్‌లో వృథా వస్తువులు, బాటిల్ మూతలు, టైప్‌రైటర్ మొదలైనవాటితో ఓ ఆకృతిని తయారుచేసి అందరి దృష్టీ ఆకర్షించారు. తర్వాత అలాంటి ఎన్నో అవకాశాలు అందుకున్న ఆమె టాటా సహా ఎన్నో కార్ల కంపెనీలతోనూ పనిచేశారు. టాటా తమ నానోకారు ప్రచారంలో భాగంగా కెమెరా ముందు ధైర్యంగా పెయింట్ చేయగల ఆర్టిస్ట్ కోసం చూసింది. అప్పుడు సంగీత ముందుకొచ్చారు. అలా 2012లో తొలిసారి నానో కారుపై చిత్రాలు వేసినామె తర్వాత బీఎండబ్ల్యూ, జీప్, బెంజ్, ఆడి వంటివాటిపైనా తన ప్రతిభను ప్రదర్శించి ఎన్నో పురస్కారాలూ అందుకున్నారు.
ఆర్ట్ గొప్పదనాన్ని వివరించేలా ‘అల్ఫాజ్’ పేరుతో లఘుచిత్రాన్ని రచించి, తీసినామె ఆర్ట్‌తో సోలో షోలనూ నిర్వహించారు. దాత కూడా. క్యాన్సర్ రిసెర్చ్‌కోసం నిధుల సమీకరణ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇవే ఆమెను ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ దృష్టిలో పడేలా చేశాయి. రూ.110 కోట్ల ‘బ్యూటిఫై ముంబయి’ ప్రాజెక్టులో భాగస్వామిని చేసింది. నిజానికి గతంలోనూ సంగీత ఈ సంస్థతో కలిసి పనిచేశారు. ‘ప్రతి ప్రాజెక్టుకీ ఓ పేరు పెడతా. దానివెనుక అర్థమూ ఉండేలా చూసుకుంటా’ననే సంగీత ముంబయి బాంద్రా లోని రద్దీ ప్రదేశాలు, అండర్‌పాస్‌లు, ఎక్స్‌ప్రెస్ హైవేలన్నింటినీ భిన్న చిత్రాలతో నింపేస్తున్నారు. ‘ముంబయి ల్యాండ్ మార్క్స్ పేరుతో.. మిలాన్ ఫ్లైఓవర్‌కి గేట్‌వే ఆఫ్ ఇండియా, తాజ్‌మహల్ హోటల్, వాంఖడే స్టేడియం వంటి చిత్రాలు వేస్తానంటే నా భర్తతో సహా అందరూ ‘చాలా కష్టం’ అన్నవారే. నాకేమో చేయలేవు అనగానే పట్టుదల వచ్చేస్తుంది. అందుకే 15 రోజులు గడువు పెట్టుకొని మరీ పూర్తిచేశా’ననే సంగీత గత ఏడాది నుంచి ఈ పనిలో ఉన్నారు. 38 డిగ్రీల వేడి, తాజా వర్షాల్లోనూ పనిచేస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.