కులాల బోర్డులు.. తీయించింది!
దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని ఎన్ని రుజువులు చూపించినా.. ఇంకా కులాల అడ్డుగోడలు పోకపోవడం అనసూయకు బాధ కలిగించేది. కనీసం రాబోయే తరాలైనా ఈ వివక్ష లేకుండా పెరగాలని ఆమె చేసిన పోరాటం.. ప్రభుత్వాన్నే కదిలించింది.
దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని ఎన్ని రుజువులు చూపించినా.. ఇంకా కులాల అడ్డుగోడలు పోకపోవడం అనసూయకు బాధ కలిగించేది. కనీసం రాబోయే తరాలైనా ఈ వివక్ష లేకుండా పెరగాలని ఆమె చేసిన పోరాటం.. ప్రభుత్వాన్నే కదిలించింది.
ఎప్పుడు ఊరొచ్చినా ‘ద్రవిడ వీధి’, ‘దళిత వాడ’ అన్న పేర్లతో కనిపించే బోర్డులు అనసూయ శరవణముత్తుకు ఇబ్బందిగా తోచేవి. ఈమెది తమిళనాడులోని ఆనందవాడి అనే గ్రామం. వీరి కాలనీ ఏర్పడిన కొత్తల్లో దానికి ‘ఇందిరా నగర్’ అని పేరు పెట్టారు. కానీ అక్కడ నివసించే వారి కులం ఆధారంగా దాన్ని ‘ఆది ద్రవిడర్’ వీధిగా పిలిచేవారు. క్రమంగా అదే పేరుతో బోర్డునీ ఏర్పాటు చేశారు. అనసూయ సివిల్ ఇంజినీరింగ్ చదివి, ఉద్యోగం చేస్తోంది. తన డాక్యుమెంట్లు, ఆధార్‌కార్డ్, రేషన్ కార్డుల్లో చిరునామా చేర్చేప్పుడు ‘ఇందిరా నగర్’ అని రాసినా చివరికి దాన్ని ‘ఆది ద్రవిడర్’ వీధిగానే మారుస్తుండటం గమనించింది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాల మధ్య కులాల విభజన కొనసాగుతుంది కదా అనిపించిందామెకు. దానికి అడ్డుకట్ట వేయాలనుకుంది. స్థానికుల నుంచి సంతకాలు సేకరించి, తమ పాత కాలనీ పేరే ప్రభుత్వ దస్త్రాల్లో చేర్పించాలని పిటిషన్ వేసింది. ఇలాంటి బోర్డుల కారణంగా గతంలో జరిగిన గొడవలు, కొన్నిసార్లు చంపుకోవడం వరకూ వెళ్లిన సంఘటనలు ఉదహరించింది. దాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్పెషల్ సెల్‌కి పంపింది. దాంతో అధికారులు పేరు మార్చాల్సిందిగా ఆదేశించారు. ఆమె ఇంటి వద్దే కాకుండా, ఊళ్లో అలాంటి బోర్డులన్నీ తొలగించారు. ఇది తన ఊరిదే కాదు.. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. అక్కడా ఇదే మార్పు కనిపిస్తే బాగుంటుందని అంటోంది అనసూయ. ఆమె కోరిక అభినందించ దగ్గదే కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.